ఆటగాళ్లకు కరోనా బ్రేక్ కలిసొస్తుందిలే

ఆటగాళ్లకు కరోనా బ్రేక్ కలిసొస్తుందిలే

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వల్ల వచ్చిన బ్రేక్.. టీమిండియా క్రికెటర్లకు మంచిదేనని చీఫ్ కోచ్ రవిశాస్ర్తి అన్నాడు. దీనివల్ల క్రికెటర్లు  ఫ్రెష్ గా ఉంటారన్నాడు. ‘ఈ రెస్ట్ క్రికెటర్లకు  కీడేమీ చేయదు. ఎందుకంటే కివీస్ టూర్ తర్వాత చాలా మంది ఇంజ్యూరీస్‌‌తో బాధపడుతున్నారు. మానసికంగా అలసిపోయారు. ఫిజికల్  ఫిట్‌‌నెస్‌‌ సమస్యలను  కూడా ఎదుర్కొంటున్నారు. వీరందరూ పూర్తిగా కోలుకోవడానికి ఈ బ్రేక్  ఉపయోగపడుతుంది. సీజన్‌ను ఫ్రెష్‌‌గా మొదలుపెట్టడానికి ఇది తోడ్పడుతుంది’ అని శాస్త్రి పేర్కొన్నాడు. గతేడాది మే నెలలో వరల్డ్‌‌కప్‌‌ తర్వాత దాదాపు పది నెలల పాటు టీమిండియా  క్రికెట్  ఆ డుతూనే ఉంది. కనీసం 10, 11 రోజులు కూడా విరామం లభించలేదు. ‘తమ ఎనర్జీని తిరిగి పెంపొందించుకోవడానికి ప్లేయర్లు ఈ బ్రేక్‌‌ను ఉపయోగించుకోవాలి. గత పది నెలల్లో మేం చాలా క్రికెట్ ఆడాం. ఇంగ్లండ్‌‌లో  వరల్డ్‌‌కప్‌‌ నాటి నుంచి మొన్నటివరకు నాతో పాటు సపోర్ట్ స్టాఫ్‌‌కు  బ్రేక్  లభించలేదు. కొంత మంది ప్లేయర్లు మూడు ఫార్మాట్స్‌‌లో ఆడుతున్నారు. వాళ్ల  మీద ఎంత ఒత్తిడి ఉంటుందో ఊహించొచ్చు. ముఖ్యంగా ఫీల్డ్‌‌లో  వాళ్లు చాలా కష్టపడ్డారు. టీ20 నుంచి టెస్టులకు అడ్జస్ట్ కావడం చాలా ఇబ్బందితో కూడుకున్నది. అయినా మన ప్లేయర్లు సమర్థంగా ఈ పాత్రను  పోషిస్తున్నారు. ఈసారి విదేశీ  ప్రయాణాలు కూడా చాలా చేశాం’ అని శాస్త్రి వ్యాఖ్యానించాడు.

సిరీస్‌ రద్దుతో షాకయ్యాం..

ఓవైపు కరోనా విజృంభిస్తున్నా.. తాము మాత్రం  సరైన సమయంలోనే న్యూజిలాండ్‌ నుంచి ఇండియాకు తిరిగొచ్చామని రవి తెలిపాడు. సౌతాఫ్రికాతో సిరీస్‌‌కు  సన్నద్ధమవుతున్నప్పుడే తాము లాక్‌‌డౌన్‌‌ను ఊహించామన్నాడు. ‘వర్షం వల్ల  ధర్మశాల వన్డే రద్దయింది. రెండో మ్యాచ్ కోసం లక్నోకు బయలుదేరాం. బయట పరిస్థితులు చేజారుతున్నట్లుగా  అనిపించింది. అనుకున్నట్లుగానే సిరీస్‌‌ను రద్దు చేశారు. దీంతో మేం షాక్‌కు గురయ్యాం. అప్పుడే లాక్‌‌డౌన్ పరిస్థితి తప్పదనిపించింది. వైరస్  ప్రభావం అధికంగా ఉంటుందని మన క్రికెటర్లు  కివీస్‌‌లోనే  ఊహించారు. మా ఫ్లయిట్ సింగపూర్ నుంచి రావడంతో మేం కూడా కాస్త భయపడ్డాం. కానీ ఇక్కడ దిగే సరికి  కొద్దిగా ఫర్వాలేదనిపించింది. మేం ఇక్కడ దిగిన రోజే స్క్రీనింగ్  మొదలుపెట్టారు. అంటే మేం సరైన సమయంలోనే వచ్చామనుకున్నాం’ అని రవిశాస్త్రి వెల్లడించాడు.

ఆరోగ్య భద్రతపై దృష్టి

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య  భద్రతతో పాటు సామాజిక అంశాలపై కూడా దృష్టిపెట్టాలని శాస్త్రి అన్నాడు. ప్రజల్లో అవేర్‌‌నెస్  కల్పించేందుకు తమ ప్లేయర్లు చేస్తున్న కృషి అభినందనీయ మన్నాడు. ‘కెప్టెన్ విరాట్‌‌ సహా చాలా మంది  ప్లేయర్లు… ప్రజల్లో మంచి అవగాహన కల్పిస్తు న్నారు. ఇందులోనూ మనమే ముందున్నాం. వరల్డ్‌‌వైడ్‌‌  అన్ని టోర్నీలు రద్దయ్యాయి. కాబట్టి ప్రతి ప్లేయర్ ఇంటికే పరిమితమయ్యాడు. ఏదో రకంగా ప్రతి ఒక్కరిలో అవగాహన పెంపొందిం చడం చాలా ముఖ్యం. అలాగే ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో మెలగాలి. ఇతరులకు  ఎలాంటి హాని కలగకుండా ప్రవర్తించాలి. అప్పుడే ఈ మహమ్మారి నుంచి బయటప డగలుగుతాం’ అని చీఫ్ కోచ్ వివరించాడు.