జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అజారుద్దీన్ పర్యటన.. అడ్డుకున్న విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అజారుద్దీన్ పర్యటన.. అడ్డుకున్న విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు

హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహమత్ నగర్ డివిజన్ లోని ఎస్పీఆర్ హిల్స్ లో ఉద్రిక్తత ఏర్పడింది. చాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొనడానికి అజారుద్దీన్ రావడంతో ఆయన్ను మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు, అభిమానులు అడ్డుకున్నారు.

విష్ణువర్ధన్ రెడ్డి వర్గీయులకు సమాచారం ఇవ్వకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అజారుద్దీన్ పర్యటించడం పట్ల ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఈ సందర్భంగా పోలీసులపై సీరియస్ అయ్యారు అజారుద్దీన్. మాజీ ఎంపీ అయిన అజారుద్దీన్ కు ప్రోటోకాల్ ఇవ్వకుండా ఏం పని చేస్తున్నారని పోలీసులను కాంగ్రెస్ కార్యకర్త ఒకరు ప్రశ్నించారు. విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు అడ్డుకోవడంతో తిరిగి వెళ్లిపోయారు అజారుద్దీన్.

అజారుద్దీన్ పై విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అజారుద్దీన్ పర్యటనపై విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే మనసత్వం తనదన్నారు. అజారుద్దీన్ తమకు చెప్పి రాకపోవడం తప్పుగా భావిస్తున్నానని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్న తమ కుటుంబాన్ని అవమానిస్తే సహించేది లేదని హెచ్చరించారు. తమ తండ్రి పి. జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశారని చెప్పారు. తాను కూడా 16 ఏళ్ల నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజా సమస్యలపై పోరాడుతున్నాని చెప్పారు. తనకు కాకుండా మరొకరికి టికెట్ ఇస్తే సహించేది లేదని విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు విష్ణువర్ధన్ రెడ్డి.