మొక్కల నేస్తం..కొమనేని రఘు

మొక్కల నేస్తం..కొమనేని రఘు

కొమనేని రఘు పదేళ్ల క్రితం హన్మకొండ నుంచి శాయంపేటలోని పెద్దకోడెపాక గ్రామానికి మకాం మార్చాడు. ఆయన ఒక ప్రైవేటు ఉపాధ్యాయుడు. హన్మకొండలో ఉన్నప్పుడు సంగీతం నేర్పేవాడు. స్నేహితుల పిల్లలకు స్పోకెన్ ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పేవాడు. అప్పుడే ఆయనకు చెట్లు పెంచాలనే ఆలోచన వచ్చింది. దాంతో అరుదైన మొక్కలను సేకరిస్తూ వాటిని సంరక్షిస్తూ ‘మొక్కల నేస్తం’గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

అరుదైన మొక్కల సేకరణ….

రఘు ఎక్కడికి వెళ్లినా అరుదైన మొక్కలను సేకరిస్తుంటాడు. ఆయన దగ్గర ఎడారి మొక్కలే ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడ విభిన్నమైన మొక్క కనిపించినా ఇంటికి తీసుకొస్తాడు. ఎంతో అరుదైన ‘బ్రహ్మకమలం’ చెట్టు కూడా ఆయన ఇంట్లో ఉంది. అంతేకాదు కృష్ణకమలం, డ్రాగన్ ఫ్రూట్స్ , కాక్టస్‌ లో పదిహేను రకాల మొక్కలు,మే పుష్పం , గరుఢ వర్ధిని, సపోట, దానిమ్మ, అల్లనేరేడు, సీతాఫలం, ఎలక్కా య, వెలగ, ఎర్రబెండ, బాంబూస్​, అరుదైన కలబంద మొక్కలు పెంచుతున్నాడు.

బ్రహ్మ కమలం….

విష్ణుమూర్తికి అత్యం త ఇష్టమైన పుష్పం బ్రహ్మకమలం. సాధారణంగా ఈ పువ్వు రెండేళ్లకు ఒకసారి పూస్తుంది. కాని రఘు ఇంట్లో ఉన్న బ్రహ్మ కమలం చెట్టు రెండు నెలలకోసారి పూలు పూస్తుంది. మామూలుగా అయితే ఈ రకం మొక్కలు ఇక్కడి వాతావరణాన్ని తట్టు కోలేవు. కానీ, రఘు ఇంట్లో మొక్కలు పూలు కూడా పూస్తాయి.

మొక్కలతో మాటలు…

మొక్కలకు చలనం ఉంటుం ది. వాటికీ ఆశలు, కోరికలు ఉంటాయనేది రఘు నమ్మకం. అందుకే ప్రతి రోజు ఉదయం,సాయంత్రం మొక్కలతో మాట్లాడుతుంటాడు. ‘రెండేళ్లకు ఒకసారి పూసే బ్రహ్మకమలం నేను చెప్పిన మాటలు విని రెండు నెలలకోసారి పూస్తుంది. దాన్ని రెండు నెలలకోసారి పూయమని నేను రెండేళ్లపాటు అడిగాను’ అని చెప్తాడు రఘు. ఆయన దగ్గరున్న మొక్కలు ఎక్కువగా ఆన్ లైన్ లో కొన్నవే. అయితే కొనే స్తోమత లేని వాళ్లకు రఘు తన దగ్గర ఉన్న మొక్కలను ఉచితంగా ఇస్తాడు. అది కూడా కచ్చితంగా వాటిని సంరక్షిస్తామని హామీ ఇస్తేనే.

పక్షులకు ఆవాసాలుగా…

రఘు ఇంటి చుట్టూ మొక్కలతోపాటు చాలా పక్షులు ఉంటున్నాయి. అక్కడే ఉన్న చెట్లలో కొన్ని పక్షులు గూళ్లు కూడా కట్టు కున్నాయి. అక్కడే బాతులను కూడా పెంచు తున్నాడు.వీటి రక్షణ కోసమని ఒక కుక్కను కూడా పెంచు తున్నాడు. ఆ కుక్క వీటన్నింటినీ కోతుల బారినుంచి కాపాడుతుం ది. వాటితో స్నేహం చేస్తుంది. మొత్తం మీద ఈ ఇంటికి వెళ్తే..వనంలోకి అడుగు పెట్టినట్టే ఉంటుంది.