గుడ్‌‌‌న్యూస్: కరోనా రికవరీల్లో భారీ పెరుగుదల

గుడ్‌‌‌న్యూస్: కరోనా రికవరీల్లో భారీ పెరుగుదల

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే రికవరీలు కూడా భారీ స్థాయిలో పెరుగుతుండటం శుభ పరిణామంగా చెప్పొచ్చు. టెస్టుల సంఖ్యను పెంచడంతోపాటు తగు జాగ్రత్తలు తీసుకుంటుండటంతోనే ఇది సాధ్యమయ్యిందని కేంద్రం తెలిపింది. దేశ కరోనా రికవరీ రేటు 77.77 శాతంగా ఉందని ప్రభుత్వం పేర్కొంది. ‘ఇండియాలో కరోనా రికవరీ రేటు విపరీతంగా పెరుగుతోంది. మే నెలలో వైరస్ బారి నుంచి 50 వేల మంది కోలుకోగా.. అప్పటి నుంచి ఇప్పటికి మొత్తంగా 36 లక్షల మంది రికవర్ అయ్యారు. దాదాపు ప్రతి రోజు 70 వేల మంది వరకు రికవర్ అవుతున్నారు. యాక్టివ్ కేసులతో పోలిస్తే రికవరీలు 3.8 శాతం ఎక్కువగా ఉన్నారు. కచ్చితమైన దృష్టితో సహకారం, ప్రతిస్పందన, సమర్థమైన చర్యలు, టెస్టింగ్‌‌లో వేగం, హై క్వాలిటీ క్లినికల్ కేర్‌‌‌తోనే ఇది సాధ్యమైంది’ అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఉత్తర్ ప్రదేశ్‌‌లో కరోనా రికవరీలు ఎక్కువగా ఉండటం గమనార్హం. దేశంలో కరోనా కేసుల సంఖ్య 46,59,984కు చేరింది. ఒక్క శనివారమే రికార్డు స్థాయిలో 97,570 కేసులు నమోదయ్యాయి. కరో్నా మరణాల సంఖ్య 77,472కు చేరింది.