ప్రపంచానికి పరిచయమక్కరలేని పేరు గాంధీజీ

ప్రపంచానికి పరిచయమక్కరలేని పేరు గాంధీజీ

‘ఒక చెంపపై కొడితే మరొక చెంప చూపించాలి’..
సాధ్యమేనా ఇప్పుడు?
‘సత్యమే మనిషి జీవితానికి అసలైన గుర్తింపు’..
పాటించేవాళ్లు ఉన్నారా ఇప్పటికీ? 
‘స్వరాజ్యమంటే ఏ కొందరో అధికారం అనుభవించడం కాదు. 
దాని ఫలాలు అందరికీ సమానంగా అందడం’..
అందరికీ సమానంగానే అందుతున్నాయా ఇప్పుడు?
... పై సూక్తులు మహాత్మా గాంధీవి. 20వ శతాబ్దంలో బలమైన వెలుగుదివ్వెలవి. 
... వాటికింది ప్రశ్నలన్నీ 21వ శతాబ్దానివి. అంటే ఇప్పటి కాలానివి.  
    

ప్రపంచానికి పరిచయమక్కరలేని పేరు గాంధీజీ. భారతీయులకు ఆయన మహాత్ముడు, జాతిపిత, స్ఫూర్తిప్రదాత. కులమతాలు, ఆచారవ్యవహారాలు, భాషాభేదాలు.. అన్నింటినీ మరిచి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం కోట్లాది ప్రజలు ఒక్కతాటిపై నడిచేలా చేసిన వ్యక్తి. ముందుండి నడిపించిన శక్తి. దానికోసం ఆయన పడిన కష్టాలు, పాటించిన విలువలు చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి మహనీయుడి 153వ జయంతి నేడు. ఆయన సిద్ధాంతాలు, ఆదర్శాలే గాంధేయవాదం(గాంధీయిజం).

20వ శతాబ్దంలో ప్రపంచమంతా ఎన్నో గొప్ప సంఘటనలు జరిగాయి. అవి మనిషి జీవితాన్ని మలుపుతిప్పాయి. వాటిలో ముఖ్యమైనవి సైన్స్​ అండ్​ టెక్నాలజీలో వచ్చిన మార్పులు​. ఇప్పుడు మనం అనుభవిస్తున్న జీవితం వెనక ఉన్నది ఇవే. కానీ, భారతీయులకు వీటన్నింటికంటే ముఖ్యమైనదే దక్కింది. అదే స్వాతంత్ర్యం. దీనికి మూలకారణం గాంధీజీ. ఆయన జీవితం ఎంతో మందికి దిక్సూచి. ఇప్పటిలా మీడియా, సోషల్​ మీడియా లేని కాలంలోనే క్విట్​ ఇండియా, ఉప్పుసత్యాగ్రహం లాంటి ఎన్నో ఉద్యమాలకు ప్రజలను ఏకం చేసిన విధానం చరిత్రలో నిలిచిపోయే గొప్ప పాఠం. సత్యం, అహింస, స్వరాజ్యం, స్వదేశీ, లౌకికతత్వం, మతసామరస్యం, వికేంద్రీకరణ, పరిశుభ్రత, మహిళా సాధికారత.. ఒక్కటేమిటి ఎన్నోవాటిలో ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు మనకేకాదు ప్రపంచానికంతటికీ దారి చూపాయి. అయితే, అవన్నీ ఆయనకు పుట్టుకతోనే రాలేదు. సమాజమే అలా తీర్చిదిద్దింది.   

మనుషులంతా ఒక్కటే..

గాంధీజీ ఆలోచనలు, సిద్ధాంతాలు వ్యక్తిగతంగానే కాదు, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎంతో గొప్పవి. ప్రపంచమంతా తిరుగుబాట్లు, ఉద్యమాలు, మార్పులు జరుగుతున్న కాలంలో గాంధీ రాజకీయ జీవితం మొదలైంది. సమాజంలో పాతుకుపోయిన పాత సిద్ధాంతాల్ని పక్కన పెడుతూ, కొత్త ఆలోచనలు ఆచరణలోకి వస్తున్నది కూడా అప్పుడే. ఆ టైంలోనే గాంధీజీ కొన్ని ప్రత్యేక రాజకీయ విధానాలు నిర్ణయించుకున్నారు. సోషలిజాన్ని అన్నిటికంటే ఎక్కువగా నమ్మేవారు. అందులోని సూత్రాల బలమెంతో పరీక్షించి తెలుసుకున్నారు. ఆయన తన జీవితాంతం పాటించిన ‘సత్యం’, ‘అహింస’కు మూలాలు కూడా అప్పుడే పడ్డాయి. ‘సత్యం’తో ఎంతటి సమస్యనైనా పరిష్కరించవచ్చని అనుకున్నారు గాంధీజీ. దేశాల మధ్య యుద్ధాలు, గొడవలు రాకుండా ఉండాలంటే ‘మనుషులంతా ఒక్కటే’ అనే ఆలోచన అందరిలో రావాలన్నారు. ప్రపంచమంతా ఒక్కటి కావాలని కోరుకున్నారు. రాజకీయ, భూ సరిహద్దులు, ఆర్థిక, సంస్కృతి, సంప్రదాయాలు పక్కన పెడితే ఆధ్యాత్మికంగా, నైతికంగా మనమంతా మనుషులమని  గుర్తుంచుకోవాలని చెప్పారు. ప్రపంచమంతటికీ కలిపి ఒకే గవర్నమెంట్​ లాంటి వ్యవస్థ కూడా ఉండాలన్నాడు. ‘మనుషులంతా ఒక్కటవ్వడం’, ‘వరల్డ్​ గవర్నమెంట్’ ఆచరణలో కష్టమే అయినా ఇప్పటి కాలానికి కచ్చితంగా కావాల్సినవి. ఎందుకంటే ఇప్పుడు చాలా దేశాలు రకరకాల కారణాలతో ఒకదానిపై మరొకటి కత్తులు దూసుకుంటున్నాయి. యుద్ధాలతో అమాయక ప్రజల ప్రాణాలు పణంగా పెడుతున్నాయి. వీటిని చూస్తూ కూడా ఐక్యరాజ్యసమితి లాంటి సంస్థలు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాయి.

ఆ పోరాటం ప్రత్యేకం..

ఆధునిక ప్రపంచ నాయకుల్లో గాంధీజీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. దానికి ఆయన వ్యక్తిత్వం, పాటించిన ఆదర్శాలతోపాటు నాయకుడిగా ప్రజల్ని నడిపించిన తీరు కూడా కారణం. అనుచరులు, సైన్యం అండతో చెలరేగే నాయకులు, చట్టాన్ని, ప్రజల్ని గాలికొదిలేసే ప్రభుత్వాలకు మహాత్ముడు పూర్తి వ్యతిరేకం. అందువల్లే.. డబ్బు, అధికారం, పోలీసుల అండ లేకపోయినా ఆయన్ని కోట్లమంది ప్రజలు నమ్మారు. స్వేచ్ఛ కోసం, స్వతంత్రం కోసం వాళ్లను గాంధీజీ నడిపించిన మార్గం ఎంతో గొప్పది. స్ఫూర్తినిచ్చేది. దీనికి పునాది పడింది దక్షిణాఫ్రికాలోనే. అక్కడ భారతీయుల కష్టాలను కళ్లారా చూశారాయన. తాను కూడా అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ, తనను నమ్మినవాళ్లకు ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉన్నారు. దక్షిణాఫ్రికాలోని బ్రిటిష్​ ప్రభుత్వం యుద్ధంలో పాల్గొన్నప్పుడు అక్కడి భారతీయులను బలవంతంగా సైన్యంలో చేర్చుకుంది. అప్పుడు వాళ్లకు కావాల్సిన వైద్యం అందేలా చేశారు గాంధీజీ. గాయపడినవాళ్లను ట్రీట్మెంట్​ కోసం స్ట్రెచర్​ల మీద తీసుకెళ్లడానికి వెయ్యిమందితో టీమ్​లు ఏర్పాటుచేశారు. అంతేకాదు, అనుచరులు తప్పుదారిలో వెళ్తున్నారనుకున్నప్పుడు సరిదిద్దే లక్షణం కూడా గాంధీజీ సొంతం. మనదేశంలో జరిగిన చౌరాచౌరీ ఉద్యమం దీనికి ఉదాహరణ. శాంతియుతంగా, అహింసా పద్ధతిలో జరగాల్సిన ఈ పోరులో మనవాళ్లు హింసకు పాల్పడుతున్నారని తెలియడంతో వెంటనే ఆ ఉద్యమాన్ని ఆపించారు. ‘క్విట్​ ఇండియా’ ఉద్యమంలో కూడా హింస మొదలుకాగానే ఇలాగే ఆపేశారు. మరి ఇప్పటి కాలంలో హింసలేని ఉద్యమాలు ఉంటున్నాయా? ఎవరైనా నాయకుడు అరెస్ట్​ అయితే అనుచరులు గవర్నమెంట్​ ఆస్తుల్ని ధ్వంసం చేయడం, అమాయకుల్ని హింసించడం మనదగ్గరే కాదు అన్నిదేశాల్లోనూ మామూలైపోయింది. అందుకే.. ‘ఎక్కడైతే ప్రజల కార్యకలాపాల్లో ప్రభుత్వ జోక్యం తక్కువగా ఉంటుందో అక్కడ నిజమైన ప్రజాస్వామ్యం ఉంటుంద’ని గాంధీ చెప్పిన మాట ఇప్పుడు సాధ్యమయ్యే స్థితిలో లేదని చెప్పొచ్చు. 

సమాజమే దేవాలయం...

ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ప్రపంచం చాలా మారిపోయింది. పాతకాలం నాటి ఎన్నో సంప్రదాయాలు ఇప్పుడు లేవు. వాటిలో కొన్ని మంచివి కూడా ఉన్నాయి. వాటికి బదులు అసూయ, అపనమ్మకం, అనుమానం, ద్వేషం బలపడ్డాయి. హింస, పేదరికం, అసహనం ఎక్కువయ్యాయి. సైన్స్​ అండ్​ టెక్నాలజీ, గ్లోబలైజేషన్​ వల్ల వ్యాపారపరంగా యూనిటీ వచ్చినా మనుషులు, మనసుల మధ్య దూరం మాత్రం తగ్గడం లేదు. అది జరగాలంటే మన ఆలోచనల్లో మార్పు రావడమొక్కటే దారి. ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పారు గాంధీజీ. అది సాధ్యం కావాలంటే మనిషి తనను తాను ఆత్మశుద్ధి చేసుకోవాలన్నారు. దానికోసం సత్యం, అహింస, అస్తేయ(దొంగతనం చేయకపోవడం), అపరిగ్రహ(తన అవసరాల మేర ఉంచుకొని మిగతాది సమాజానికి వదలడం), బ్రహ్మచర్యం వంటి సూత్రాలు పాటించాలన్నాడు. వీటిలో కొన్నింటిని పాటించినా సమాజంతోపాటు ప్రపంచం కూడా బెటర్​గా తయారవుతుంది అని గాంధీజీ ఉద్దేశం. ఉదాహరణకు.. ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఉంటే అపనమ్మకం, భయం తగ్గుతాయి. అలాగే.. అహింసను పాటించాలంటే విద్వేషం, అసూయ, మనుషుల్ని, జంతువుల్ని చంపడం, చెడ్డ ఆలోచనలు రానీయకపోవడం ముఖ్యం. కానీ, ఇప్పుడు నీతి, నిజాయితీ, అహింస అనేవి చేతకానివాళ్లు మాట్లాడే మాటలుగా ప్రచారంలోకి వచ్చింది.  

ఆర్థిక సమానత్వం..

‘సంపూర్ణ ఆర్థిక సమానత్వం కష్టమ’ని గాంధీజీ అభిప్రాయం. అయితే, పేదలు, ధనికుల మధ్య ఆర్థిక అంతరాలు ఉండొద్దనేది ఆయన బలమైన కోరిక. ప్రతి ఒక్కరికీ తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట ఉండడమే నిజమైన ఆర్థిక సమానత్వం అని చెప్పారు. అయితే, కమ్యూనిజం చెప్తున్నట్లు సంపూర్ణ ఆర్థిక సమానత్వం మాత్రం కుదిరేపని కాదని అప్పట్లోనే కుండబద్దలు కొట్టినట్లు చెప్పారాయన. సమానత్వమంటే భూస్వాముల ఆస్తులను బలవంతంగా జప్తు చేయడం కాదని, అహింస, ప్రేమతో వాళ్లని ఒప్పించి తమ సంపదలో పేదలకూ వాటా ఇప్పించేలా చేయడమని అన్నారు. అసమానతల్ని ప్రేమతోనే తొలగించాలని చెప్పారు. ఆర్థిక సమానత్వం రావాలంటే ‘అవసరానికి మించి సంపాదించొద్దు. అనవసరమైనవి కొనొద్దు’ అనే రెండు పద్ధతులు కచ్చితంగా పాటించాలన్నారు. ‘ఎక్కువ సంపాదిస్తే వాటిని కాపాడుకోవడానికే మన జీవితమంతా సరిపోతుంది. దానివల్ల సత్యం, అహింస వంటివి మన నుంచి దూరమవుతాయ’ని గాంధీజీ అభిప్రాయం. అందుకే.. అవసరమైన దానికన్నా ఎక్కువ సంపాదిస్తే దాన్ని అవసరమున్న ఇతరులకు పంచాలన్నారు. 

అయితే, ఆర్థిక సమానత్వం గురించి గాంధీజీ చెప్పిన సూత్రాలు ఇప్పటి డిజిటల్​ యుగంలో కష్టమని చాలామంది అభిప్రాయం. కారణం.. పొద్దున లేచినప్పటి నుంచి సంపాదనే ధ్యేయంగా ఇప్పటి ప్రపంచం నడుస్తోంది. డబ్బున్నవాళ్లు మరింత ధనవంతులు అవుతున్నారు. అలాగే కొన్ని కోట్ల మంది పేదరికంలోనే మగ్గుతున్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితిపై ఇటీవల విడుదలైన ఓ నివేదిక కూడా ఇదే విషయం చెప్తోంది. ఈ సర్వే ప్రకారం మొత్తం సంపదలో 52శాతం కేవలం 10శాతం మంది వద్దే ఉంది. అలాగే ప్రపంచమంతా సగానికిపైగా నిరుపేదలు ఉన్నారు. ఇలాంటి పరిస్థితులను ముందుగానే ఊహించడం వల్లే సంపూర్ణ ఆర్థిక సమానత్వం సాధ్యం కాదన్నారు గాంధీజీ.   

సెక్యులరిజం

అన్ని మతాల వాళ్లు కలసిమెలసి ఉండడమే సెక్యులరిజం(లౌకికతత్వం). వందల ఏండ్లుగా ఎన్నో మతాలున్న మనదేశం ఒక లౌకిక రాజ్యం. అందుకే అన్ని మతాలను సమానంగా గౌరవించాలంటూ గాంధీజీ ‘సర్వధర్మ సంభవ్​’ సిద్ధాంతం ప్రతిపాదించారు. మతం ఇద్దరు మనుషుల్ని వేరు చేసేది కాదని, కలిపేదని చెప్పారు. అన్ని మతాలు ఐక్యతను, సోదరతత్వాన్ని చెప్తాయని, ఆ మతాలను పాటించేవాళ్లు వీటిని కూడా ఫాలో అవ్వాలని చెప్పాడు. అప్పుడే అసలైన సెక్యులరిజం కనిపిస్తుందని అన్నారు. కానీ, మతం పేరుతో గొడవలు ఇప్పుడు దాదాపు అన్ని దేశాల్లోనూ జరుగుతున్నాయి. ప్రపంచమంతా ఇవి మెల్లమెల్లగా ఎక్కువవుతున్నాయి. మనదేశంలోనూ ఇంతే. దీన్ని బట్టి మనం పాటిస్తున్న సెక్యులరిజంలో ఏదో లోపం ఉందని అర్థమవుతోంది. ఇది మరింత గట్టిగా నిలబడాలంటే మతాలతో సంబంధం లేకుండా మనుషులంతా ఒక్కటే అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.  

చదువే వెలుగు దివ్వె 

చదువు మనిషికి దారి చూపే వెలుగు లాంటిదని మహాత్ముడు అన్నారు. చదువంటే కేవలం అక్షరాలు నేర్చుకోవడం కాదని, మంచి వ్యక్తులుగా మారేందుకు అదొక సాధనమని చెప్పారు. మంచి సమాజం కావాలంటే చదువొక్కటే మార్గమన్నారు. ఏడు నుంచి 14 ఏండ్ల వయస్సులోని పిల్లలందరూ కచ్చితంగా చదువుకోవాలన్నారు. దానికోసం నిర్బంధంగానైనా సరే ఉచిత విద్య అమలు చేయాలని చెప్పారు. ప్రాథమిక స్థాయిలో పాఠాలు​ మాతృభాషలోనే చెప్పాలని, చదువుతోపాటు సంపాదనకు అవసరమయ్యే పనుల్ని కూడా నేర్పించాలని చెప్పారు. అయితే, ఎడ్యుకేషన్​ విషయంలో గాంధీజీ సిద్ధాంతాలకు దాదాపు పూర్తి వ్యతిరేకంగానే జరుగుతోందిప్పుడు. నిర్బంధ ఉచిత విద్య ఉన్నప్పటికీ అది సక్రమంగా అమలుకావడం లేదు. ఇప్పటికీ మనదేశంలో అక్షరాస్యత వందశాతం లేకపోవడమే దీనికి ఉదాహరణ. అలాగే పిల్లలు కేవలం బట్టీ పట్టడానికి మాత్రమే పరిమితమవుతున్నారు. ప్రాక్టికల్​ నాలెడ్జ్​ ఉండడం లేదు. వీటికితోడు మాతృభాషలో బోధన అనేది కేవలం ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పరిమితమవుతోంది. మరోవైపు పల్లెటూళ్లలో కూడా ఇంగ్లీష్​ మీడియం స్కూల్స్​ వచ్చాయి. వాటిలోనే తమ పిల్లల్ని చేర్చడానికి తల్లిదండ్రులు ఇష్టపడుతున్నారు. అంతేకాదు మార్కులు, ఉద్యోగాల వెంట పిల్లల్ని పరుగులు తీయిస్తున్నారు.    

అధికారాలు పంచాలి

అధికారం ఒక్కచోటే, ఒక్కరి చేతిలోనే ఉండడం గాంధీజీకి ఇష్టం లేదు. అందుకే అధికార వికేంద్రీకరణ జరగాలన్నారు. తాను సోషలిస్ట్​ అని చెప్పుకున్నప్పటికీ, అధికారం అంతా ఒకేచోట ఉండాలని చెప్పే సోషలిజం సూత్రాన్ని ఒప్పుకోలేదాయన. అధికారం ఒక్కచోటే ఉండడం ప్రజాస్వామ్యానికి దెయ్యం వంటిదన్నారు. అందుకే.. అధికార వికేంద్రీకరణ జరగాలని, అది కూడా కిందిస్థాయి నుంచి మొదలవ్వాలని చెప్పారు. అధికారాన్ని పంచుకుంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ పని చేస్తారని చెప్పారు. వివిధ భాషలు, సంప్రదాయాలు, ఆచారవ్యవహారాలతో కనిపించే మనదేశంలో రాష్ట్రాలు, కేంద్రం మధ్య అధికార వికేంద్రీకరణ ఉండాలని రాజ్యాంగం కూడా స్పష్టంగా చెప్తోంది. అయితే, ఆచరణలోకి వచ్చేటప్పటికి రాష్ట్రాల హక్కుల్ని తీసివేసేలా కేంద్రం ప్రవర్తించడం ఇప్పటి తరంలో మామూలైపోయిందని రాజకీయ మేధావులు చెప్పే మాట. 

స్వరాజ్యం  

గాంధీజీ దృష్టిలో స్వరాజ్యం అంటే మనల్ని మనమే పరిపాలించుకోవడం. అంటే.. మన పాలనలో బయటి దేశాలు, వ్యక్తుల జోక్యం లేకపోవడం. ఇప్పుడు మనది స్వతంత్రదేశం. వేరే దేశాలు ఏవీ మనమీద ఆజమాయిషీ చేయలేవు. కానీ, ప్రజలు పూర్తి స్వతంత్రులు అని చెప్పగలమా? అంటే సందేహమే. ఇతరుల అభిప్రాయాలు, నిర్ణయాలకు అనుకూలంగా ప్రజల్లో చాలా మంది నడుచుకుంటున్నారు. అంటే మనదేశంపై విదేశాల ఆధిపత్యం పోయింది కానీ, ఇంకా సొంత నిర్ణయం తీసుకోలేనివాళ్లు కోకొల్లలు. ఈ పరిస్థితి ఇప్పటి 21వ శతాబ్దంలో కొద్దిగా మారింది. గ్లోబలైజేషన్​, టెక్నాలజీ, ఎడ్యుకేషన్​ వల్ల ఇప్పటివాళ్లలో ఎక్కువ మంది స్వతంత్రంగా బతకడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడడం కొంతలో కొంత వచ్చిన మంచి మార్పు.   

అహింస

గాంధీజీ పేరు వినగానే గుర్తొచ్చేది అహింస. మనదేశానికి స్వాతంత్ర్యం రావడం వెనక ఉన్న బలమైన ఆయుధాల్లో అహింసదే మెయిన్​ రోల్. అంతేకాదు, అహింసతో దేన్నైనా సాధించవచ్చని ప్రపంచానికి పాఠం చెప్పారు గాంధీజీ. అహింస బలహీనమైన ఆయుధం కాదని, దాన్ని పాటించాలంటే ఎంతో ధైర్యం, సహనం ఉండాలన్నారు. వలసపాలకుల హింసకు అహింసే సరైన మందు అని నిరూపించారు. అన్యాయాన్ని, దౌర్జన్యాన్ని, హింసను అహింసతో ఎదుర్కోవడం వల్ల ఎదుటివాళ్లలో కోపం తగ్గి, ఆలోచన మొదలవుతుందన్నారు. దండియాత్రను అహింసాపద్ధతిలోనే ముందుకు నడిపించి జేజేలు అందుకున్నారు. దలైలామా, మార్టిన్​ లూథర్​ కింగ్​, నెల్సన్​ మండేలా, డెస్మండ్​ టుటు వంటి ఎందరో ప్రపంచనేతలకు మార్గదర్శకంగా నిలిచారు. నిజానికి గాంధీజీ కంటే ముందే మనదేశంలో ఎంతోమంది అహింస గురించి చెప్పారు. కానీ, గాంధీజీ వాటిని పాటించారు కూడా. అంతేకాదు, తనను నమ్మినవాళ్లనూ అహింసామార్గంలోనే నడిపించారు. కానీ, యుద్ధాలతోనే సమస్యలకు పరిష్కారం అనుకుంటున్న ఇప్పటి ప్రపంచంలో ‘అహింస’కు తావు ఎక్కడుంది? ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఉద్యమాలైనా, కనీస సౌకర్యాలు కావాలంటూ చేస్తున్న నిరసనలైనా అహింస, సత్యాగ్రహంతో సాధించుకోవడం కష్టమేననేది కొందరి అభిప్రాయం. ఈ 21వ శతాబ్దంలోనూ అహింసా మార్గంలో పోరాటాలు జరుగుతున్నా అవి చాలా తక్కువ. ఇంకా చెప్పాలంటే.. అహింసా సిద్ధాంతం ఎప్పటికీ ఎవర్​గ్రీన్​ అయినప్పటికీ అది అన్నిసార్లూ సాధ్యం కాదనే అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది. దీనికి ఉదాహరణ నెల్సన్​ మండేలానే. గాంధీజీని ఆయన ఆదర్శంగా తీసుకున్నప్పటికీ అహింస అన్నివేళలా సాధ్యం కాదని మండేలా చెప్పారు. 

మనదేశానికి స్వాతంత్ర్యం రావడంలో ‘అహింస’ మార్గం చాలా కీలకం. అలాగని కేవలం దానివల్లే వచ్చిందంటే చాలామంది నమ్మరు. గాంధీజీని జైల్లో పెట్టడం, ఆయన నిరాహారదీక్ష చెడగొట్టడం బ్రిటీష్​వాళ్లకు నిమిషాల్లో పని. అందుకే అహింస, సత్యాగ్రహం వల్లే స్వాతంత్ర్యం వచ్చిందనడాన్ని నమ్మమంటారు కొందరు. బ్రిటీష్​ సైన్యాన్ని ఢీ అంటే ఢీ అనేలా ఎదుర్కొనేవాళ్లు పెరగడం, బోస్​లాంటి వాళ్ల నాయకత్వంలో సెపరేట్​గా సైన్యం ఏర్పడడం ఆంగ్లేయులను కలవరపెట్టిందని, అందుకే మనకు స్వాతంత్ర్యం ఇచ్చారని వాళ్ల అభిప్రాయం. మనం తప్ప వలసపాలనలో మగ్గిన అన్ని దేశాలూ హింసా పద్ధతిలోనే స్వాతంత్ర్యం తెచ్చుకోవడాన్ని ఉదాహరణగా చెప్తున్నారు. వాళ్ల మాటల్లోనూ ఎంతోకొంత నిజం ఉందని అనిపించినప్పటికీ ‘కంటికి కన్ను, పంటికి పన్ను’ ఎప్పటికీ మంచిది కాదంటారు గాంధేయవాదులు. అలా జరిగితే ఇప్పటికే సగం ప్రపంచం గుడ్డిగా మారి ఉండేదంటారు వాళ్లు.    

సత్యం, సత్యాగ్రహం

‘మనిషి ఉనికికి అసలైన నిదర్శనం సత్యమే’ అంటారు గాంధీజీ. అబద్ధం మనిషిని బలహీనపరిస్తే, సత్యం శక్తిమంతుణ్ని చేస్తుందని చెప్పారు. మన మాటల్లోనే కాదు చేసే పనుల్లోనూ సత్యం కనిపించాలన్నారు. చెప్పడమే కాదు జీవితాంతం పాటించేందుకు ప్రయత్నించారు. అహింసకు సత్యాన్ని జోడించి స్వాతంత్ర్య పోరాటంలో ఆయన ఎంచుకున్న ‘సత్యాగ్రహం’ అనే నిరసన పద్ధతి చరిత్రలో ఎవరూ చేయనిది. తన వెంట నడిచేవాళ్లు, ఉద్యమకారులు ఇదే పద్ధతిలో నడవాలని కచ్చితంగా చెప్పారు. ఎక్కడైనా, ఎప్పుడైనా ఉద్యమకారులు అదుపుతప్పి హింసకు పాల్పడితే వెంటనే ఆ ఉద్యమాన్ని ఆపేసేవారాయన. అందుకే మానవాళికి గాంధీజీ ఇచ్చిన అతి గొప్ప ఆస్తి ‘సత్యాగ్రహం’ అని ఇప్పటికీ చెప్తుంటారు. అయితే, ఇప్పటి తరంలో ‘సత్యం, సత్యాగ్రహం’ కేవలం పిల్లలు పుస్తకాల్లోనూ, ఉపన్యాసాల్లోనూ మాత్రమే ఉంటాయంటారు కొందరు. మరొక విషయం ఏంటంటే అహింస, సత్యం రెండూ కవలల్లాంటివి. ఎక్కడైతే ‘సత్యం’ ఉండదో అక్కడ అహింస కూడా ఉండదు. ఇలాంటి పరిస్థితి వస్తుందని గాంధీజీ కూడా ఊహించారు. 1909లో జరిగిన ఓ సమావేశంలో సత్యం, సత్యాగ్రహం ప్రాముఖ్యం గురించి ఆయన చెప్పినప్పడు అప్పటివాళ్లలో ఎక్కువమందికి వీటిపై నమ్మకంలేదు. కానీ, గాంధీజీ మాటలు చెప్పడంతో ఊరుకోలేదు.  తాను చెప్పిన వాటిని జీవింతాంతం పాటించారు. తన సిద్ధాంతాలు నమ్మనివాళ్లను కూడా ఒప్పించగలిగారు. మెప్పించగలిగారు. 

కులంలేని సమాజం

టెక్నాలజీ యుగంగా చెప్పే 21వ శతాబ్దంలోనూ మానవత్వం మనుగడకు మచ్చగా మారిన దురాచారం కులవ్యవస్థ. అమెరికా, బ్రిటన్​, ఫ్రాన్స్​, జర్మనీ, రష్యా.. ఒక్కటేమిటి అభివృద్ధిలో ఎంతో ముందున్నాయనుకునే దేశాల్లోనూ ఈ రోగం అప్పుడప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. మనదేశంలో అయితే కులవ్యవస్థ వేర్లు పాతాళం వరకు పాతుకుపోయి ఉన్నాయి. ఇలాంటి కులవ్యవస్థకు వ్యతిరేకంగా వందేండ్ల కిందటే పోరాడారు గాంధీజీ. జాతి, కులం అనే తేడా లేకుండా అందరూ సమానమేనని చెప్పారు.  కులం వల్ల అంటరానితనాన్ని, అవమానాలను ఎదుర్కొంటున్నవాళ్లకు అండగా నిలిచారు. కులం తక్కువవాళ్లను లోపలికి రానివ్వని గుళ్లలోకి తాను కూడా వెళ్లేవారుకాదు.  అంతేకాదు, దళితులను ‘హరిజనులు’ అని గాంధీజీ పిలిచారు. అంటే దేవుని పిల్లలు అని అర్థం. కులరహిత సమాజం కోసం ఎంతో ప్రయత్నించారు. అయితే, అది ఇప్పటికీ పూర్తిగా సాధ్యం కాలేదు. కానీ, వందేండ్ల కిందటితో పోలిస్తే ఇప్పడు కులం పేరుతో జరిగే దాష్టీకాలు చాలావరకు తగ్గాయనే చెప్పొచ్చు. మహాత్ముడి ఆలోచనలతోపాటు అంబేద్కర్​ వంటి గొప్ప నాయకుడు తోడవడమే ఈ మార్పుకు కారణం. దీనికితోడు చదువుకున్నవాళ్లు పెరగడం, గ్లోబలైజేషన్​ పాత్ర కూడా ఉంది. 

స్వచ్ఛతే సేవ

‘పరిశుభ్రత అనేది దైవంతో సమానం’ అన్నారు గాంధీజీ. అనడమే కాదు పల్లెలు స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉండడానికి తన భార్య కస్తూర్బా గాంధీతో కలసి పనిచేశారు.  బహిరంగ మలవిసర్జన తప్పని చెప్పారు. శుభ్రత అంటే కేవలం బయటి వాతావరణమే కాదు మనిషి  మనస్సులోనూ ఎలాంటి కల్మషం లేకుండా ఉండడమన్నారు. అంటే.. ఇల్లు, పరిసరాలు, రోడ్లు శుభ్రంగా ఉంచుకోవడమే కాదు అవినీతి లేని సమాజం కూడా కావాలని అర్థం. శుభ్రత విషయానికొస్తే ఒకప్పటి కన్నా ఇప్పుడు ఎంతో మేలైన స్థితిలోనే ఉన్నాం. దీనివెనక గాంధీజీ చెప్పిన మాటలు, చూపిన చేతలు ఉన్నాయి. అందుకే మహాత్ముడి సేవకు గుర్తుగా ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం ‘స్వచ్ఛ భారత్​ అభియాన్​’ పథకం తెచ్చింది. అంతేకాదు, పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లోనూ అవగాహన పెరిగింది. కానీ, పేదరికం, నిరక్షరాస్యత, సౌకర్యాలు లేకపోవడం వంటి వాటివల్ల ‘స్వచ్ఛతే సేవ’ వందశాతం అమలుకావడం కష్టమవుతోంది. 

మహిళాశక్తి

మహిళా సాధికారత విషయంలో గాంధీజీ ఆలోచనలు, సిద్ధాంతాలు చాలా గొప్పవి. సహనం, అహింస మహిళల సహజ లక్షణాలు. అందువల్ల వాళ్లు స్వాతంత్ర్య పోరాటంలో కచ్చితంగా ఉండాలని చెప్పారు. అంతేకాదు, జాతీయోద్యమంలో ఆడవాళ్లను భాగస్వాములు చేశారు. ఆయన పిలుపుతోనే ‘దండి యాత్ర’లో వేలమంది మహిళలు పాల్గొన్నారు. అంతమంది మహిళలు వచ్చిన ఉద్యమంగా అప్పట్లో ‘దండియాత్ర’ దేశంపై ఎంతో ప్రభావం చూపింది. మహిళల చదువు విషయంలోనూ గాంధీ ఎంతో కృషి చేశారు. ఆడవాళ్లు చదువుకుంటే వాళ్లతోపాటు కుటుంబాలు, సమాజం కూడా బాగుపడుతుందన్నారు. కట్టుబాట్లు, ఆచారవ్యవహారాలు, పురుషుల ఆధిక్యం ఉన్న అప్పటి కాలంలో ఆడవాళ్లు ధైర్యంగా ముందుకొచ్చి చదువుకోవడం, జాతీయోద్యమంలో పాల్గొనడం వంటివాటి వెనక గాంధీజీ శ్రమ ఎంతో ఉంది. ఈ 21వ శతాబ్దంలో ఆడవాళ్లు అన్నింటిలోనూ రాణించడం వెనక గాంధీ మాటలు, ఆయన చూపిన బాటలు కూడా ఉన్నాయనేది కచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిన విషయమే. 

స్వదేశీ సూత్రం..

జాతీయోద్యమం టైంలో గాంధీజీ చెప్పిన ‘స్వదేశీ’ సూత్రం ఇప్పటి గ్లోబలైజేషన్​లో ఎంతో అవసరం. కట్టుకునే బట్ట దగ్గరి నుంచి లగ్జరియస్​ కార్ల వరకు ఇప్పుడు ఎక్కువ భాగం మనదేశానికి వస్తున్నది విదేశాల్లో తయారైనవే. వీటి వల్ల ఇప్పటికే చాలా వరకు లోకల్​ ఇండస్ట్రీస్​, బిజినెస్​లు దెబ్బతిన్నాయి. ఈ ముప్పును అప్పట్లోనే పసిగట్టారు గాంధీజీ. అప్పట్లో బ్రిటీష్​ అధికారులు మనదేశంలో తయారయ్యే వస్తువులపై ఎక్కువ పన్నులు వేసేవాళ్లు. రకరకాల కారణాలు చెప్పి మన పరిశ్రమల్ని మూసివేయించేవాళ్లు. దాంతో మన ఆర్థిక రంగం దెబ్బతింది. చాలామందికి పనిలేకుండా పోయింది. మరోవైపు విదేశాల్లో తయారైన, ముఖ్యంగా బ్రిటన్​ నుంచి వచ్చిన వస్తువులు మన మార్కెట్లో బలవంతంగా అమ్మేవాళ్లు. దీన్ని ఎదుర్కోవడానికే ‘స్వదేశీ’ నినాదం తెచ్చారు గాంధీజీ. విదేశీ వస్తువులు బహిష్కరించాలని, మనదేశంలో తయారైన వాటినే వాడాలని ప్రజలను కోరారు. ముఖ్యంగా మన ఖాదీ బట్టలే ధరించాలని కోరారు. అలా ‘స్వదేశీ’ ఉద్యమం అప్పట్లో దేశమంతటా బలంగా పాకింది. ఆ పిలుపును పాటించి ఇప్పటికీ ఖద్దరు వస్త్రాలనే వాడే గాంధేయవాదులు ఉన్నారంటే ‘స్వదేశీ’ నినాదం ఎంత ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. కానీ, ఈ 21వ శతాబ్దంలో విదేశీ వస్తువుల్ని బహిష్కరించడం అంత సులువు కాదు. దీనికి అనేక కారణాలున్నాయి. అందులో దేశాల మధ్య సంబంధాలు ముఖ్యమైనవి. మనం దిగుమతుల్ని నిషేధిస్తే ఆ ప్రభావం మన ఎగుమతులపై కూడా పడుతుంది. అలాగే ప్రజలు కూడా ధర తక్కువ ఉండి, మంచి క్వాలిటీ ఉన్నవాటినే కొనడానికి ఇష్టపడతారు. అయితే,  గాంధీ చెప్పిన స్వదేశీ సిద్ధాంతంపై ఈ మధ్యే మన దేశం మళ్లీ దృష్టి పెట్టింది.  అందులో భాగంగా తెచ్చిందే ‘మేకిన్​ ఇండియా’ పథకం. ఈ స్కీమ్​కు మూలం గాంధీజీ చెప్పిన ‘స్వదేశీ’ నినాదమే. 

లైఫ్​స్టైల్​..

ఇప్పటి టెక్నాలజీ యుగంలో ఆరోగ్యం బాగుండడం ఎంతో అవసరం. ఏదైనా రోగం వచ్చినప్పుడు డాక్టర్​ దగ్గరికో, డైటీషియన్​ వద్దకో వెళ్లినప్పుడు వాళ్లు చెప్పేమాట.. మంచి పోషకాలు ఉన్న నేచురల్​ ఫుడ్​ తినమని. ఇదే విషయాన్ని గాంధీజీ ఎప్పుడో చెప్పారు. ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లతోపాటు పచ్చి కూరగాయలు తినమన్నారు. అలాగే చిరుధాన్యాలు.. అంటే సజ్జలు, జొన్నలు, రాగులు వంటి వాటిని ఎక్కువగా తీసుకోమన్నారు. ఇది ఇటీవల బాగా పాపులర్​ అయిన ‘సూపర్​ఫుడ్​’ లాంటిదే. అలాగే అప్పుడప్పుడు ఉపవాసం ఉండాలంటూ ఇప్పటి డాక్టర్లు చెప్తున్న మాటను ఎప్పుడో పాటించి చూపారు గాంధీజీ. ఆరోగ్యంగా ఉండడమే కాదు సింపుల్​గా బతకడం ఎలాగో కూడా నేరుగా అర్థమయ్యేలా చేశారు. తాను పుట్టుకతోనే ధనవంతుడైనప్పటికీ కేవలం ధోతీ, కండువాతో కనిపిస్తూ ఆదర్శంగా నిలిచారు. ఆడంబరంగా బట్టలు వేసుకోలేదు. కారణం.. తాను కోట్ల మందికి ప్రతినిధి. వాళ్లలో కట్టుకోవడానికి సరైన బట్టలు లేనివాళ్లు కూడా ఉన్నారు. తానూ వాళ్ల మనిషినేనని చెప్పడానికి ఆయన ఎంచుకున్న మార్గమిది. ఇప్పటి తరంలో ఇలాంటివాళ్లు అరుదుగా కనిపిస్తారు. 

వనరులు తక్కువ వాడుకోవాలి

సహజ వనరులు తగ్గడం, గ్లోబల్​ వార్మింగ్​, క్లైమేట్ ఛేంజ్ ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు. వీటిని దాదాపు వందేండ్ల కిందటే గుర్తించారు గాంధీజీ. అందుకే ‘ప్రకృతి ఉండేది అందరి అవసరాలు తీర్చడానికి. అంతేకానీ, ఎవరో కొంతమంది కోరికలు తీర్చడానికి కాదు’ అన్నారు. అంటే సహజ వనరులను అవసరమైనంత వరకే వాడాలని, విచ్చలవిడిగా వాడి భవిష్యత్​ తరాలకు వాటిని దూరం చేయొద్దని చెప్పారు. పరిశ్రమలు పెరిగితే కాలుష్యం ఎక్కువవుతుందని, కొత్త కొత్త రోగాలు వస్తాయని కూడా ఆయన అప్పుడే ఊహించారు. అలా జరగకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు కూడా చెప్పాడు. దాన్నే సస్టైనబుల్​ డెవలప్​మెంట్​(సుస్థిరాభివృద్ధి) అన్నారు. అంటే.. మన దగ్గరున్న సహజ వనరులను అవసరమైనంత మేరకే వాడుకోవడం. భవిష్యత్​ తరాలకు వనరులను మిగల్చడం. గ్లోబల్​ వార్మింగ్​, వాతావరణ మార్పులతో ప్రపంచమంతా ఇబ్బంది పడుతున్న ఈ టైంలో గాంధీజీ చెప్పిన సూత్రాన్ని పాటించడం ఎంతో అవసరం. అందుకే ఇప్పటి వాతావరణ ఒప్పందాలు, పర్యావరణ పరిరక్షణ అగ్రిమెంట్స్​, సస్టెయినబుల్​ డెవలప్​మెంట్​ గోల్స్​ ఫాలో అవ్వాలని చాలా దేశాలు, అంతర్జాతీయ సంస్థలు నిర్ణయించుకున్నాయి.   
గాంధీ నమ్మని గాంధీయిజం! 

మహాత్ముడి సిద్ధాంతాలు, ఆదర్శాలు కలిపి పుట్టిందే ‘గాంధీయిజం’ లేదా ‘గాంధేయవాదం’. తన పేరుతో ఇలాంటిది రావడం గాంధీజీకి ఇష్టంలేదు. ఎందుకంటే.. అహింస, సత్యాగ్రహం లాంటివన్నీ ఎప్పటినుంచో ఉన్నవేనని, తాను  చేసింది కేవలం వాటిని పాటించడమేనని ఆయన చెప్పారు. అయితే, అందరూ దాన్ని పాటించడం కష్టమన్నారు. అందుకే.. ‘గాంధీయిజం’ పేరుతో తన తర్వాతి తరాలకు ఒక మార్గదర్శకం ఉండాలన్న ప్రతిపాదనను ఆయన ఇష్టపడలేదని చెప్తారు. 
గాంధీ మెచ్చిన నాయకులు
గాంధీజీ సిద్ధాంతాలు, ఆదర్శాలు ఎంతో మందిని ప్రభావితం చేశాయి. అందుకే ఆయన్ని అభిమానించేవాళ్లు ప్రపంచమంతా ఉన్నారు. వాళ్లలో మార్టిన్​ లూథర్​ కింగ్​ జూనియర్(అమెరికా)​, నెల్సన్​మండేలా(దక్షిణాఫ్రికా), కొరియన్​ గాంధీగా పేరు పొందిన చొ మన్​–సిక్​(దక్షిణకొరియా), హో చి మిన్​(వియత్నాం) మొదలుకొని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా వరకు ఎంతో మంది గొప్ప నాయకులు ఉన్నారు. వీళ్లు అంతలా గాంధీజీని అభిమానించడానికి కారణం ఆయన వ్యక్తిత్వమే. అయితే, గాంధీజీ గొప్ప వ్యక్తిగా మారడం వెనక కొంతమంది ఉన్నారు. వాళ్లే హెన్రీ డేవిడ్​ థియరూ(అమెరికా), జాన్​ రస్కిన్(బ్రిటన్​)​, లియో టాల్​స్టాయ్(రష్యా)​, సోక్రటీస్(గ్రీస్​)​, రాల్ఫ్​ వాల్దో ఎమర్సన్(అమెరికా)​. 
హెన్రీ డేవిడ్​ థియరూ: ఈయన రాసిన ‘ఆన్​ ది డ్యూటీ ఆఫ్​ సివిల్​ డిస్​ఒబీడియన్స్’ వ్యాసం చదివి ఎంతో ఇన్​స్పైర్​ అయినట్లు గాంధీ చెప్పుకున్నారు. ‘అన్యాయమైన ప్రభుత్వం ఎక్కడ ఉంటే అదే అక్కడి ప్రజలకు జైలు లాంటిద’ని ఆ వ్యాసంలో​ థియరూ అన్నారు. దాన్ని ఎదుర్కొనే ప్రయత్నంలో ‘శాసనోల్లంఘన’ తప్పదన్నారు. ఆ మాటలు గాంధీజీని ప్రభావితం చేశాయి. ఇవే సత్యాగ్రహానికి స్ఫూర్తి.

జాన్​ రస్కిన్​:  ఈయన రాసిన ‘అన్​ టు దిస్​ లాండ్​’ పుస్తకం గాంధీని ఎంతో ప్రభావితం చేసింది. ‘శారీరక శ్రమ అన్నిటికంటే గొప్పదని, మేధావి వర్గం కన్నా శారీరక శ్రమ చేసేవాళ్ళు గొప్పోళ్ల’ని ఆ పుస్తకంలో చెప్పిన విషయం గాంధీజీని ఇన్​స్పైర్​ చేసింది. సమాజంలోని ప్రతి ఒక్కరికీ అన్ని ప్రయోజనాలు కలగాలంటూ గాంధీజీ చెప్పిన ‘సర్వోదయ’ సూత్రానికి కారణం అదే. 
లియో టాల్​స్టాయ్​:  గాంధీజీ జీవితాంతం అహింసను పాటించడం వెనక ఉన్నది లియో టాల్​స్టాయ్​. ఈయన రాసిన ‘ది కింగ్​డమ్​ ఆఫ్​ గాడ్​ వితిన్​ యు’ పుస్తకం తనను ఎంతో ఇన్​స్పైర్​ చేసిందని స్వయంగా గాంధీజీనే చెప్పారు. ఆ పుస్తకంలోని ‘లవ్​ యాజ్​ లా ఆఫ్​ లైఫ్​(ప్రేమే జీవిత సూత్రం)’ అనే మాటలు తనమీద ప్రభావం చూపాయన్నారు. అందుకే వీళ్ళిద్దరి మధ్య ఉత్తరాల ద్వారా మాటలు నడిచాయి. 

సోక్రటీస్​: ఈయన గొప్ప గ్రీక్​ ఫిలాసఫర్. ‘నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతవరకైనా ఎదిరించి నిలబడు’ అనే సూత్రాన్ని సోక్రటీస్​ జీవితం నుంచే గాంధీజీ తీసుకున్నారు. సత్యాగ్రహాన్ని కట్టుతప్పకుండా పాటించడం వెనక సోక్రటీస్​ చెప్పిన అపాలజీ(గ్రీక్​ భాషలో ఎదురించు’ అనే మాటలు ఉన్నాయని గాంధీజీ ఎన్నోసార్లు చెప్పారు.

రాల్ఫ్​ వాల్దో ఎమర్సన్​: ఈయన అమెరికన్​ రచయిత. పట్టణీకరణను తీవ్రంగా వ్యతిరేకించే గాంధీజీ.. పల్లెలు స్వయంసమృద్ధి సాధించాలని తరచూ చెప్పేవారు. గ్రామాల అభివృద్ధికి ఆలోచించేవారు. దీని వెనక రాల్ఫ్​ వాల్దో ఎమర్సన్​ రాసిన పుస్తకాలు ఉన్నాయి. లా చదువుతున్నప్పుడు ఇంగ్లండ్​లో ఉండగా ఎమర్సన్​ పుస్తకాలను చదివారు గాంధీజీ. అప్పుడే ఆయనకు మనదేశంలోని గ్రామాల అభివృద్ధిపై ఒక అభిప్రాయం ఏర్పడింది.

తెలుగు నేర్చుకోవాలనుకున్నారు!

గాంధీజీ పుట్టింది మనదేశంలోనే అయినా ఆయన్ని కోట్ల మందికి ప్రతినిధిగా మారేలా చేసింది మాత్రం దక్షిణాఫ్రికాలో గడిపిన జీవితమే. రైలు ప్రయాణంలో ఫస్ట్​ క్లాస్​ కేటగిరీ టికెట్​ ఉన్నప్పటికీ బ్రిటీషోళ్లు బలవంతంగా రైలు నుంచి దించేయడంతో ఆయన పోరాటం మొదలైంది. ఆ తర్వాత అక్కడ బానిసలుగా బతుకుతున్న లక్షలాది భారతీయుల సమస్యలు, ఇబ్బందుల్లో అండగా నిలిచారు గాంధీజీ. ఆ టైంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగినట్లు చెప్తారు. అదేంటంటే.. దక్షిణాఫ్రికాలో ఉన్న భారతీయుల్లో తెలుగువాళ్లు చాలా ఎక్కువ మంది ఉండేవాళ్లు. వాళ్లతో మాట్లాడడంలో గాంధీజీకి భాషతో సమస్య వచ్చింది. దాంతో తెలుగు నేర్చుకోవాలనుకున్నారట గాంధీజీ. కానీ, కుదరకపోవడంతో చివరికి ఆయనే తెలుగువాళ్లను హిందీ నేర్చుకోమన్నారట. 

 ::: మహేశ్వర్​