కిలో రూ.2 వేలకు కొని.. రూ.20 వేలకు అమ్ముతున్నారు

 కిలో రూ.2 వేలకు కొని.. రూ.20 వేలకు అమ్ముతున్నారు

ఎల్ బీనగర్, వెలుగు: వైజాగ్ లోని ఏజెన్సీ నుంచి సిటీ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న గ్యాంగ్ కు చెందిన ఆరుగురిని మల్కాజిగిరి ఎస్ వోటీ, చౌటుప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఎల్ బీనగర్ లోని రాచకొండ కమిషనరేట్ క్యాంప్ ఆఫీసులో  సీపీ మహేశ్​భగవత్ వివరాలు వెల్లడించారు. ఏపీలోని ఈస్ట్ గోదావరికి చెందిన కనుమరెడ్డి పవన్ కుమార్(31), మంద సుధీర్ బాబు (27), కోటిపల్లి లోవరాజ్(28), మిల్లుల తేజ(18), పవన్ మనోహర్(26), గంటే సంతోశ్​(31) ఈ ఆరుగురు గ్యాంగ్ గా ఏర్పడి గంజాయి దందా చేస్తున్నారు.

వైజాగ్ లోని ఏజెన్సీ నుంచి కిలో రూ.2 వేలకు గంజాయిని కొని కర్ణాటక, మహారాష్ట్రలో రూ.20 వేలకు అమ్ముతున్నారు. ఇటీవల వైజాగ్ కు వెళ్లి ఏజెన్సీ నుంచి గంజాయిని కొన్న ఈ గ్యాంగ్ 3 కార్లలో సిటీకి బయలుదేరింది. చౌటుప్పల్ టోల్ ప్లాజా వద్ద వీరిని అడ్డుకున్న మల్కాజిగిరి ఎస్ వోటీ, చౌటుప్పల్ పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గరి నుంచి రూ. కోటి 20 లక్షలు విలువైన 360 కిలోల గంజాయి, 3 కార్లు, 8 సెల్ ఫోన్లు, రూ.10 వేల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల్లో కొందరు గతంలోనూ గంజాయి కేసులో పట్టుబడి అరెస్ట్ అయి జైలుకెళ్లినట్లు సీపీ మహేశ్​భగవత్ తెలిపారు. ఈ గ్యాంగ్ తో లింక్ ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన డ్రగ్స్ సప్లయర్స్ ముగ్గురు పరారీలో ఉన్నారన్నారు. ఎన్ డీపీఎస్ యాక్ట్31(ఎ) కింద ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. సమావేశంలో ఎస్ వోటీ డీసీపీ మురళీధర్, ఇన్ స్పెక్టర్లు అశోక్ రెడ్డి, శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.

రాజేంద్రనగర్​లో మరో 250 కిలోలు స్వాధీనం 

గండిపేట: లారీలో గంజాయిని తరలిస్తున్న నలుగురిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం రాజేంద్రనగర్ పరిధిలోని ఓఆర్ఆర్ మీదుగా వెళ్తున్న ఓ లారీని పోలీసులు ఆపి తనిఖీ చేశారు. ప్లాస్టిక్ డ్రమ్ముల్లో 250 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్, క్లీనర్ తో పాటు వెనకాలె మరో వెహికల్ లో వస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని నాసిక్ కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను విచారిస్తున్నామని.. పూర్తి వివరాలను మంగళవారం వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.