సేంద్రీయ ఎరువులకు ప్రాధాన్యం ఇవ్వండి : నిరంజన్‌రెడ్డి

సేంద్రీయ ఎరువులకు ప్రాధాన్యం ఇవ్వండి :  నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌, వెలుగు : భూసార పరిరక్షణ కోసం రైతులు సేంద్రీయ ఎరువులకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. మంగళవారం అగ్రికల్చర్ ఆఫిసర్లతో  ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రసాయనిక ఎరువులతో నేలల సహజ స్వభావం దెబ్బతింటున్నదని తెలిపారు. భూమికి నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం తగ్గుతుందని చెప్పారు. పశువులు, కోళ్లు, గొర్రెలు, వర్మి కంపోస్ట్ ఎరువుల వాడకం రైతులకు భారంగా మారిందన్నారు. 

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మూడు శాతానికి పైగా ఉన్న కర్బనం.. మన దేశం, రాష్ట్రంలో కనీసం ఒక శాతం కూడా లేదని వెల్లడించారు. అందుకే మన రాష్ట్రంలోని నేలల్లో పోషకాలు పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పచ్చిరొట్ట సాగును ప్రోత్సహిస్తోందని మంత్రి తెలిపారు. పచ్చిరొట్ట పైర్లయిన జీలుగ, పిల్లిపెసర, జనుము పంటలను సాగు చేసి నేలను కలియ దున్నాలని వివరించారు. దానివల్ల నేలలో భాస్వరం, గంధకం పోషకాలు పెరగుతాయని చెప్పారు. రైతులకు 65 శాతం సబ్సిడీపై పచ్చి రొట్ట విత్తనాలు అందిస్తున్నామని..దీని వల్ల ప్రభుత్వంపై రూ.76.66 కోట్లు భారం పడతోందని నిరంజన్ రెడ్డి తెలిపారు.  

పచ్చి రొట్ట ఎరువులతో నాణ్యమైన, ఆరోగ్యవంతమైన పంట దిగుబడులు వస్తాయన్నారు. వచ్చే సీజన్‌ కోసం లక్ష 46 వేల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీకి సిద్ధం చేశామని వెల్లడించారు. ఇవి రాష్ట్రంలోని అగ్రో రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతామని  మంత్రి పేర్కొన్నారు. సమీక్షలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు, సీడ్స్ ఎండీ కేశవులు పాల్గొన్నారు.