‘ఐస్ బేబీ’లతో గ్లేసియర్లు

‘ఐస్ బేబీ’లతో గ్లేసియర్లు

అడవులు నాశనమై, బాగా పలుచబడిపోతే ఏం చేస్తాం? మొక్కలు పెంచుతాం. అడవులు మళ్లీ దట్టంగా చెట్లతో నిండిపోయేలా చేసేందుకు ప్రయత్నిస్తాం. మరి ఉత్తర, దక్షిణ ధ్రువాల వద్ద గ్లేసియర్లు (భారీ మంచుగడ్డలు) కరిగిపోతే ఏం చేయాలి?  మొక్కలు పెంచినట్లుగా గ్లేసియర్లను కూడా సృష్టిస్తే పోలే..? ఇదెలా సాధ్యం? అనుకుంటున్నారా! దీనికోసం మా దగ్గర ఓ సూపర్ ​ఐడియా ఉందంటున్నారు ఇండోనేసియా ​ఆర్కిటెక్ట్​లు. సబ్​మెరీన్ల లాంటి భారీ మెషీన్లు.. సముద్రపు నీటిని మంచు ముక్కలుగా మార్చి వదిలితే.. సముద్రంపై గ్లేసియర్లు తరిగిపోకుండా చేయొచ్చని చెబుతున్నారు. వీటితో తయారు చేసే మంచు ముక్కలకు వారు ‘ఐస్​బేబీలు’ అని పేరు పెట్టారు.

ఐస్​బేబీస్ ఐడియాకు ప్రైజ్.. 

ఆర్కిటిక్, అంటార్కిటికా ప్రాంతాల్లో సముద్రంపై భారీ గ్లేసియర్లు ఉంటాయి. ఒక్కోటి కనీసం 25 ఎకరాల నుంచి వందల చదరపు కిలోమీటర్ల వరకూ ఉంటుంది. ఇవి సూర్యుడి నుంచి వచ్చే వేడిని వెనక్కి రిఫ్లెక్ట్​ చేస్తాయి. ఒకవేళ ఇవన్నీ కరిగిపోతే సముద్ర మట్టాలు కొన్ని మీటర్ల వరకూ పెరిగిపోయి ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాలు నీటిలో మునిగిపోతాయి. అంతేకాదు.. టెంపరేచర్లు విపరీతంగా పెరిగి వాతావరణం పూర్తిగా మారిపోతుంది. అందుకే గ్లేసియర్లు కరిగిపోకుండా చూడటం చాలా అవసరమని ఇండోనేసియన్​ ఆర్కిటెక్ట్​ ఫరీస్​ రజాక్​ కొటాహతుహా చెబుతున్నారు. ఆయన టీం ఈ ఐస్​బేబీల ఐడియాను తయారు చేసింది.  వీరి ఐడియాకు ఇటీవల థాయిలాండ్​లో జరిగిన ఇంటర్నేషనల్​ డిజైన్ ​కాంపిటీషన్​లో సెకండ్ ​ప్రైజ్​ దక్కింది. సబ్​మెరీన్​ లాంటి ఓ భారీ మెషీన్​ సముద్రపు నీటిని ట్యాంకులో నింపుకొని, పైకి వచ్చాక ఉప్పును పూర్తిగా తీసేస్తుంది.  మిగిలిన స్వచ్ఛమైన మంచి నీటిని  ఐస్​గా మారుస్తుంది.

ఈ ట్యాంకు ఆరు భుజాలతో.. షడ్బుజి (హెక్సాగోన్) ఆకారంలో ఉంటుంది కాబట్టి, అదే ఆకారంలో ఐస్​బేబీ తయారవుతుంది. ఒక్కోటి 16 అడుగుల మందం, 82 అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. షడ్బుజి ఆకారంలో ఉంటుంది కాబట్టి.. ఒకదానితో ఒకటి  కలిసిపోయి పెద్ద ఐస్​గడ్డలుగా ఏర్పడతాయి. దీంతో సముద్రం నీటిపై గ్లేసియర్లు​గా మారి సూర్యుడి నుంచి వచ్చే వేడిని వెనక్కి పంపుతాయి. కాన్సెప్టు బాగానే ఉంది కానీ.. కిలోమీటర్ల కొద్దీ గ్లేసియర్లను సృష్టించాలంటే.. ఎన్ని ఐస్​బేబీలు తయారు చేయాలి? ఒక గ్లేసియర్ తయారు చేసేందుకు 10 వేల సబ్​మెరీన్​లు కావాలి? ఆ మెషీన్లు పనిచేసేందుకు ఎంత ఇంధనం అవసరం? ఆ ఖర్చు ఎవరు భరిస్తారు? అసలు ఇదంతా అయ్యే పనేనా? అంటూ పెదవివిరిచారు కొందరు సైంటిస్టులు.