వడ్ల పైసల్లో గోల్​మాల్​!

వడ్ల పైసల్లో గోల్​మాల్​!
  • అమ్మిన వడ్లకు, అకౌంట్లలో పడ్తున్న పైసలకు మస్తు తేడా
  • సెంటర్​ నిర్వాహకులు, మిల్లర్లపై ఆరోపణలు
  • మూడు గ్రామాల్లో రూ.41 లక్షలు కోల్పోయిన రైతులు
  •  మంచిర్యాల, సూర్యాపేట, మహబూబ్​నగర్​ జిల్లాల్లో అన్నదాతల ఆందోళన

సూర్యాపేట మండలం సోలిపేట ఐ‌‌కే‌‌పీ సెంటర్​లో వడ్లు అమ్మిన 50 మంది రైతుల అకౌంట్లలో  రూ.10 లక్షల దాక తక్కువ పడ్డాయి. కాంటా పెట్టేటప్పుడే తప్ప, తాలు పేరుతో ప్రతి క్వింటాల్​పై 4 నుంచి 6 కిలోల వరకు కట్​చేశారు. కటింగులు పోగా మిగిలిన వడ్లకే రసీదులు రాసిచ్చారు. తీరా అమ్మిన వడ్లకు, బ్యాంకులో పడ్డ సొమ్ముకు చాలా తేడా రావడంతో బాధితులంతా  బుధవారం  సూర్యాపేట కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. మిల్లర్లు, సెంటర్​ నిర్వాహకులు కలిసి తమను నిండా ముంచారని, న్యాయం చేసేవరకు అక్కడి నుంచి కదలబోమని బీష్మించారు. కొంతమంది రూలింగ్​పార్టీ లీడర్లు  మిల్లర్లకు సపోర్ట్ చేస్తూ తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు.

సూర్యాపేట/మంచిర్యాల/నవాబుపేట, వెలుగు: వడ్ల కొనుగోళ్లలో భారీ గోల్​మాల్​ జరిగినట్లు తెలుస్తోంది. ఖాతాలో పడిన వడ్ల పైసలు చూసి రైతుల మొహాల్లో ఆనందానికి  బదులు ఆందోళన కనిపిస్తోంది.  తాము అమ్మిన వడ్లకు, వచ్చిన పైసలకు నడుమ భారీ తేడా ఉండడంతో  ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి ఉంది. బుధవారం ఒక్కరోజే మూడు జిల్లాల్లో మూడు ఘటనలు వెలుగుచూశాయి. మూడు గ్రామాలకు చెందిన రైతుల ఖాతాల్లో ఏకంగా రూ.41 లక్షలు తక్కువ పడ్డాయి. దీంతో  సెంటర్​ నిర్వాహకులు,  మిల్లర్లు కలిసి తమను దోచుకున్నారని ఆరోపిస్తూ ఆయా జిల్లాల్లో రైతులు ఆందోళనకు దిగారు. ఎంక్వైరీ జరిపించి తమకు న్యాయం చేయాలని ఆఫీసర్లను వేడుకున్నారు.
అసలేం జరిగింది 
స్టేట్​వైడ్​6 వేలకు పైగా  పీఏసీఎస్, ఐకేపీ సెంటర్ల ద్వారా 90 లక్షల టన్నులకుపైగా వడ్లను కొనుగోలు చేసి మిల్లులకు తరలించారు. సెంటర్లలో వడ్లు తూకం వేసేటప్పుడే నిర్వాహకులు తేమ, తప్ప, తాలు పేరుతో క్వింటాల్​కు 4 నుంచి 6 కిలోల దాకా కోత పెట్టారు. తూకం వేసిన వెంటనే రైతుల నుంచి ఎన్ని క్వింటాళ్లు కొన్నారో చీటీలు రాసి చేతిలో పెట్టారు. ఏ- గ్రేడ్ ధాన్యమైతే​ క్వింటాల్​కు రూ.1,888, బీ గ్రేడ్ ​ధాన్యమైతే రూ.1,868 చొప్పున చెల్లించాలి. ఈ ప్రకారం  రైతులు తమకు ఎన్ని డబ్బులు వస్తాయో లెక్కలేసి పెట్టుకున్నారు. తీరా అకౌంట్లలో తక్కువ డబ్బులు పడడంతో అవాక్కయ్యారు. నిర్వాహకులను, మిల్లర్లను అడిగితే తేమ ఉందని రేటు తగ్గించామని కొందరికి, రైసుమిల్లుల్లో తప్ప, తాలు ఎక్కువుందని మళ్లీ కటింగులు పెట్టారని ఇంకొందరికి, ఏ గ్రేడ్​ ధాన్యానికి, బీ గ్రేడ్​ కింద లెక్కగట్టామని మరికొందరికి చెబుతున్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఎక్కడికక్కడ ఆందోళనకు దిగుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం కొల్లూరు గ్రామంలో వడ్ల పైసలు తక్కువ పడ్డాయంటూ బుధవారం రైతులు రాస్తారోకో చేశారు. ఐకేపీ సెంటర్​ ద్వారా అమ్మిన వడ్లకు తమ అకౌంట్లలో పడ్డ పైసలకు  సుమారు రూ.20 లక్షల తేడా ఉందని, సెంటర్​ నిర్వాహకులు, మిల్లర్లు కుమ్మక్కై తమ కడుపులు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఫకీరప్ప అకౌంట్‌‌లోకి రూ. 10 వేలు తక్కువగా వచ్చాయి. దీంతో అతను కొల్లూరు సెంటర్‌‌‌‌ నిర్వాహకుడితో పాటు మిల్లర్‌‌‌‌ను ప్రశ్నించగా.. వడ్లు మొలకలు వచ్చినందుకు డబ్బులు కట్​ చేశామని సమాధానం ఇచ్చారు.  అయితే అతని వడ్లు సెంటర్‌‌‌‌లోనే ఉండడంతో వెళ్లి చూడగా అసలు తడవనే లేదు. కొల్లూరుకు చెందిన రైతు శ్రీను 415 బస్తాలు సెంటర్‌‌‌‌లో అమ్మగా..  రూ. 3,13,000 రావాల్సి ఉంది. కానీ,  2,96,000 మాత్రమే అకౌంట్‌‌లో పడ్డాయి.  అలాగే పిట్టల వెంకటయ్య 100 సంచులు విక్రయించగా..  92 సంచులే రికార్డులో నమోదు చేశారు.  తౌర్యానాయక్‌‌కు రూ.10 వేలు తక్కువగా పడ్డాయి. ఇదేంటని  నిర్వాహకులను అడిగితే తమకేం తెలియదు.. మిల్లర్ల వద్దే కట్‌‌ చేశారని చెబుతున్నారు. సూర్యాపేట మండలం సోలిపేట ఐ‌‌కే‌‌పీ సెంటర్​లో వడ్లు అమ్మిన 50 మంది రైతుల అకౌంట్లలో  రూ.10 లక్షల వరకు తక్కువ పడ్డాయి. దీంతో బాధితులంతా  బుధవారం  సూర్యాపేట కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్​మండలం ఎర్రగుంటపల్లి పాక్స్​సెంటర్​లో వడ్లు అమ్మిన రైతులదీ ఇదే పరిస్థితి. సెంటర్​ నిర్వాహకులు, రైస్​మిల్లర్లు కుమ్మక్కై పెద్ద మొత్తంలో దోచుకున్నారని ఆరోపించారు.50 లారీల లోడ్​లో 1,500 బస్తాలు కట్​ చేశారని, రూ.11 లక్షకు పైగా ముంచారని ఆరోపించారు. న్యాయం చేయాలని అడిషనల్​ కలెక్టర్ డి.మధుసూదన్​ నాయక్​ను వేడుకున్నారు. 

లారీకి 30 బస్తాలు కట్ 
మంచిర్యాల జిల్లా చెన్నూర్​ మండలం ఎర్రగుంటపల్లి పాక్స్​సెంటర్​లో ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై గ్రామ రైతులు బుధవారం అడిషనల్​ కలెక్టర్ డి.మధుసూదన్​ నాయక్​కు కంప్లైంట్​ చేశారు. సెంటర్​ నిర్వాహకులు, రైస్​మిల్లర్లు కుమ్మక్కై పెద్ద మొత్తంలో దోచుకున్నారని ఆరోపించారు. సెంటర్​లో వడ్లు కాంటా వేసినప్పుడు, మిల్లుకు పంపినప్పుడు కనీసం రశీదులు కూడా ఇవ్వలేదన్నారు. ఒక్కో లారీకి 30 నుంచి 35 బస్తాల వడ్లు కట్​ చేశారని తెలిపారు. గ్రామంలో 50 లారీలకు పైగా వడ్లు కొనుగోలు చేశారన్నారు. ఈ లెక్కన సుమారు 1,500 బస్తాలు కట్​ చేశారని ఆరోపించారు. అంటే కనీసం 600 క్వింటాళ్లకు గాను రూ.11 లక్షకు పైగా రైతులకు నష్టం జరిగిందని చెప్పారు. 

రూ.28వేలు తక్కువ పడ్డయ్​ 
రెండు నెలల క్రితం సోలిపేట ఐ‌‌కే‌‌పీ సెంటర్​లో 290 బస్తాల వడ్లను అమ్మిన.  పైసలు పడ్డాయని తెలిసి బ్యాంకుకు పోతే రూ.28 వేలు తక్కువ వచ్చాయి. ఇదేమిటని అడిగితే ఐ‌‌కే‌‌పీ సెంటర్ నిర్వాహకులు మమ్మల్నే బెదిరిస్తున్నారు. ఆఫీసర్ల దగ్గరికి వెళ్తే వడ్లు తడిశాయని, తేమ పేరిట కోతలు పెట్టామని చెబుతున్నారు. 
- శంకర్, సోలిపేట, సూర్యాపేట మండలం