V6 News

ఫేక్ డాక్టర్ అరెస్ట్

ఫేక్ డాక్టర్ అరెస్ట్

సికింద్రాబాద్, వెలుగు: నిమ్స్​లో సర్జన్​నని, రోగం నయం చేస్తానని చెప్పి మహిళను నమ్మించి.. ఆమెకు మత్తు మందు ఇచ్చి బంగారం కొట్టేసిన ఫేక్ డాక్టర్​ను గోపాలపురం పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను నార్త్​జోన్​ డీసీపీ చందనా దీప్తి బుధవారం మీడియాకు వెల్లడించారు. ఏపీలోని నెల్లూరు జిల్లా కావలి మండలం చిన్ననట్టుకు చెందిన వాయిల వెంకటేశ్వర్లు అలియాస్​ వెంకీ(28) జల్సాలకు బానిసయ్యాడు. 2016  నుంచి చోరీలు మొదలుపెట్టాడు. రైళ్లలో ప్రయాణిస్తూ టికెట్​కలెక్టర్​నని చెప్పుకుని ప్యాసింజర్ల నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. కొన్నిరోజులు ఫేక్ డాక్టర్, ఫేక్​ఐఏఎస్ అధికారి అవతారమెత్తి జనాలను మోసం చేశాడు. జూబ్లీహిల్స్, ఏపీలోని పలు పీఎస్​ల పరిధిలో ఇలాంటి మోసాలు చేసి చాలాసార్లు జైలుకెళ్లి వచ్చాడు. 

ఈ నెల 2న గోదావరి ఎక్స్​ప్రెస్​లో ప్రయాణిస్తున్న వెంకటేశ్వర్లు.. తన పక్క సీటులో ఉండే సుజాతకు మాయమాటలు చెప్పి, రెజిమెంట్​బజార్​లోని లాడ్జికి తీసుకెళ్లి మత్తు ట్యాబ్లెట్లు ఇచ్చాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారం, బ్యాగ్​లోని క్యాష్  కొట్టేశాడు. బాధితురాలు గోపాలపురం పీఎస్​లో కంప్లయింట్ చేసింది. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టి మంగళవారం సికింద్రాబాద్ స్టేషన్​లో వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు. రూ.3 లక్షల విలువైన గోల్డ్ చైన్, నెక్లెస్, సెల్​ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్​కు తరలించినట్లు డీసీపీ తెలిపారు.