హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మరో 17 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను సర్కారు మంజూరు చేసింది. కొత్త డిగ్రీ కాలేజీలకు త్వరలోనే పరిపాలనాపరమైన అనుమతులను ఇస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరం నుంచే క్లాసులను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2022–23లో కొత్తగా 15 గురుకుల డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు.
తాజాగా 17 కాలేజీలతో మొత్తంగా అన్ని జిల్లాల్లోనూ బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసినట్టయిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, ఇంటర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు కలిపి 327 బీసీ గురుకులాలున్నాయని వివరించారు. వెనుకబడిన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మంత్రి గంగుల పేర్కొన్నారు.

