వారంలో గ్రూప్-1 ఫైనల్ కీ!.. ఏర్పాట్లు చేస్తున్న టీఎస్​పీఎస్సీ

వారంలో గ్రూప్-1  ఫైనల్ కీ!.. ఏర్పాట్లు చేస్తున్న టీఎస్​పీఎస్సీ
  • ఆరు నుంచి ఏడు మార్కులు కలిసే చాన్స్
  • రిజల్ట్ ఇచ్చిన మూడు నెలల్లోనే మెయిన్స్

హైదరాబాద్, వెలుగు: గత నెలలో నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ఫైనల్ కీని వారం రోజుల్లో రిలీజ్ చేసేందుకు టీఎస్​పీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్నది. తర్వాత వారంలోపే పికప్ లిస్ట్ విడుదల చేసే అవకాశముంది. నిరుడు ఏప్రిల్​లో 503 పోస్టుల భర్తీకి గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ కాగా.. 3,80,181 మంది అప్లై చేశారు. అయితే, అక్టోబర్​లో జరిగిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ పేపర్ లీక్ కావడంతో దాన్ని రద్దు చేశారు. దీంతో జూన్ 11న మళ్లీ రెండోసారి గ్రూప్1 ప్రిలిమ్స్ నిర్వహించారు. దీనికి 2,33,506 మంది అటెండ్ అయ్యారు. పోయిన నెల 28న ప్రిలిమినరీ కీ రిలీజ్ చేశారు. ఈ నెల ఐదో తేదీ వరకు అబ్జెక్షన్లు స్వీకరించారు. ఈ వారం రోజుల్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫైనల్ కీ రిలీజ్ చేయాలని టీఎస్​పీఎస్సీ అధికారులు భావిస్తున్నారు. 

దాదాపు ఆరు, ఏడు క్వశ్చన్లు తప్పులు వచ్చాయని ప్రాథమికంగా తేలినట్టు సమాచారం. వీటన్నింటికీ మార్కులు యాడ్ చేసే అవకాశముంది. దీంతో చాలామంది మార్కుల్లో భారీగానే తేడా వచ్చే ఛాన్స్ ఉంది. కీ రిలీజ్ చేసిన నాలుగైదు రోజుల్లోనే మెయిన్‌‌ ఎగ్జామ్​కు 1:50 పికప్ లిస్ట్ రిలీజ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రిజర్వేషన్ల ప్రకారం 25 వేల మంది అభ్యర్థులను మెయిన్ ఎగ్జామ్​కు పికప్ చేయనున్నారు.

ఎన్నికలొస్తే.. రెండు నెలలు వాయిదా

గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు రిలీజ్ చేసిన తర్వాత అభ్యర్థులకు కొంత ప్రిపరేషన్​కు టైమ్ ఇవ్వాలని టీఎస్​పీఎస్సీ భావిస్తున్నది. అక్టోబర్ దాకా చాన్స్ ఇవ్వాలని ఆలోచిస్తున్నది. నవంబర్​లో మెయిన్ ఎగ్జామ్ పెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఒకవేళ ఆ టైమ్​లో ఎన్నికలుండి సాధ్యంకాకపోతే మరో రెండు నెలల వాయిదా పడే అవకాశం ఉంది.