గ్రూప్ 1లో నెగటివ్ మార్క్స్ లేవు.. అన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేయండి

గ్రూప్ 1లో నెగటివ్ మార్క్స్ లేవు.. అన్ని ప్రశ్నలు అటెంప్ట్ చేయండి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి జరిగే గ్రూప్‌‌-1 ప్రిలిమ్స్​ పరీక్షను టీఎస్​పీఎస్​సీ అక్టోబర్​ 16న నిర్వహించనుంది. పోటీపరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల్లో చాలా మంది పరీక్ష సమయం దగ్గరపడగానే అనవసర ఆందోళనకు గురవుతుంటారు. ప్రిపరేషన్‌‌ మొత్తం పూర్తి చేయలేదని బాధపడుతుంటారు. ఎంత చదివినా ఇంకా చదవాల్సిన అంశాలు మిగిలే ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు ఆందోళన చెందొద్దు. ఎగ్జామ్​ హాల్​లో ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండాలి. పరీక్షకు ముందు అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.. 

మొత్తం 503 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి 1:50 నిష్పత్తిలో ప్రిలిమ్స్‌‌ నుంచి మెయిన్స్‌‌కు ఎంపిక చేస్తారు. దాదాపు సీరియస్‌‌ అభ్యర్థులందరూ మెయిన్స్‌‌కు అర్హులయ్యే అవకాశం ఉంటుంది. ఈ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షకు హాజరైతే విజయం సాధించవచ్చు.

ఆందోళన వద్దు

గ్రూప్‌‌-1 ప్రిలిమినరీ పరీక్షలో  వచ్చే ప్రశ్నల సరళి, కాఠిన్యతపై అభ్యర్థులు అనవసరంగా కంగారు పడొద్దు. 150 ప్రశ్నల్లో కొన్ని ప్రశ్నలు దాదాపు అభ్యర్థులందరికీ కఠినంగానే ఉంటాయి. అలాంటప్పుడు మార్కులతోపాటు కటాఫ్‌‌ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి క్లిష్టమైన ప్రశ్నలను చూసి అభ్యర్థులు ఆందోళన చెందొద్దు. ఆత్మవిశ్వాసంతో పరీక్షకు హాజరుకావాలి. నెగెటివ్​ మార్కింగ్​ లేకపోవడంతో అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు ప్రయత్నిస్తే మార్కులు పెరిగే అవకాశం ఉంది. 

ఎగ్జామ్​ రూల్స్​

హాల్‌‌ టికెట్‌‌పై సూచనలను చదివి అవసరమైన వాటిని సిద్ధం చేసుకోవాలి. ఎగ్జామ్​ సెంటర్​ను ముందురోజే వెళ్లి చూసుకోవాలి. పరీక్ష హాల్లోకి కాలిక్యులేటర్లు, ఫోన్, బ్లూటూత్, పెన్‌‌డ్రైవ్‌‌లు, వాచ్‌‌ తదితర ఎలక్ట్రానిక్‌‌ గాడ్జెట్స్​కు అనుమతి లేదు. పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను రెండు గంటల ముందునుంచే అనుమతిస్తారు. 15 నిమిషాల్లో పరీక్షల ప్రారంభం అవుతుందనగా గేట్‌‌ మూసివేస్తారు. ఓఎంఆర్‌‌ షీట్‌‌ను ఇన్విజిలేటర్‌‌కు ఇచ్చే సమయంలో దానిపై ఉన్న హాల్‌‌ టికెట్‌‌ నంబరు, టెస్ట్‌‌ బుక్‌‌లెట్‌‌ నంబర్​ సరిచూసుకోవాలి. హాల్‌‌ టికెట్‌‌లో ఫొటో కనిపించకపోయినా, సరిగా ప్రింట్​ కాకపోయినా, గెజిటెడ్‌‌ ఆఫీసర్‌‌తో ధ్రువీకరణ తీసుకోవాలి. దీంతోపాటు మూడు పాస్‌‌పోర్టు సైజు ఫొటోలపై సంతకం చేయించుకుని పరీక్ష కేంద్రంలో చీఫ్‌‌ సూపరింటెండెంట్‌‌ను సంప్రదించాలి. పరీక్ష ఉదయం 10.30కి ప్రారంభం అవుతుంది. అయితే.. పరీక్ష కేంద్రంలోకి మాత్రం ఉదయం 8.30 గంటల నుంచే అనుమతిస్తారు. ఉదయం 10.15 గంటల వరకు మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆ తర్వాత ప్రధాన ద్వారం మూసేస్తారు. సహాయకుడు కావాలని ముందుగా దరఖాస్తు చేసిన వారికి మాత్రమే స్ర్కైబ్‌‌ను కేటాయిస్తారు. పరీక్ష నిర్వహణ అధికారులే స్ర్కైబ్‌‌ను ఇస్తారు. పర్మిషన్​ లేకుండా అభ్యర్థులు ఎవరినైనా తీసుకొస్తే అనుమతించరు.

నో వాల్యుయేషన్​

బబ్లింగ్‌‌ చేసేటప్పుడు అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎవరైనా మీకు కేటాయించిన నంబర్‌‌ను ఓఎంఆర్‌‌ షీటులో సరిగా బబ్లింగ్‌‌ చేయకపోయినా, లేదా అభ్యర్థి, ఇన్విజిలేటర్‌‌ సంతకాలు లేకపోయినా అతని పేపర్‌‌ను మూల్యాంకనం చేయరు. ఈ విషయంలో హైకోర్టు డివిజన్‌‌ బెంచ్‌‌ ఆదేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి.. అభ్యర్థులు ఎవరూ కోర్టును సైతం ఆశ్రయించలేరు. అందుకే బబ్లింగ్‌‌ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. వివరాలన్నీ నమోదు చేసి, ఫిల్‌‌ చేయకున్నా ఆ పేపర్‌‌ను వాల్యుయేషన్‌‌ చేయరు.

అప్రమత్తంగా ఆన్సర్ చేయాలి

ఆబ్జెక్టివ్​ ప్రశ్నల్లో ఆప్షన్లు గందరగోళానికి గురిచేసేవిగా ఉంటాయి. అభ్యర్థుల సామర్థ్యాలను పరీక్షించేందుకు దగ్గరి సంబంధం ఉన్న ఆప్షన్లను ఇస్తారు. అభ్యర్థులు ప్రశ్నను చదవగానే సమాధానాన్ని ఊహించుకోవద్దు. ఆప్షన్లను అప్రమత్తతతో పరిశీలించాలి. వాటిని అర్థం చేసుకుని సరైన సమాధానం ఎంచుకోవాలి. ప్రశ్నాపత్రంలో బాగా తెలిసిన ప్రశ్నలకు ముందుగా ఆన్సర్​ చేయాలి. క్లిష్టమైన ప్రశ్నలకు తర్వాత సమయాన్ని కేటాయించాలి. పరీక్షలో కొన్ని తెలియని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేటప్పుడు అభ్యర్థులు వ్యూహాత్మకంగా ఆలోచించాలి. అంటే.. తెలిసిన అంశాల ఆధారంగా తెలియని ప్రశ్నలకూ సమాధానాలు రాబట్టాలి.

ఏకాగ్రతతో రాయాలి

ఇన్విజిలేటర్ ఇచ్చే సూచనలు తప్పనిసరిగా పాటించాలి. అభ్యర్థులు తమ వివరాలను పర్యవేక్షణాధికారి ఆదేశించిన రీతిలో నమోదు చేసుకోవాలి. హాల్‌‌ టికెట్‌‌ నంబర్, పరీక్షా పత్రం కోడ్‌‌ లాంటివి తప్పులు రాస్తూ చాలా సందర్భాల్లో నష్టపోయిన అభ్యర్థుల సంఖ్య ఎక్కువే. సమాధానాలను గుర్తించే సందర్భంలో మొదట తెలిసిన సమాధానాలు అన్ని గుర్తించుకుంటూ వెళ్లి తర్వాతి రౌండ్‌‌లో నమ్మకం ఉన్న సమాధానాన్ని గుర్తించాలి. పరీక్ష హాల్లో అనవసరమైన అవాంతరాలు ఎదురైనా పట్టించుకోకుండా పరీక్ష ఏకాగ్రతతో రాయాలి. ప్రతి 15 నిమిషాలకూ, 30 నిమిషాలకు ఒకసారి మొత్తం సమయంలో పూర్తిచేయాల్సిన బిట్ల సంఖ్యను అంచనా వేసుకుని తగినంత వేగంతో పూర్తి చేయాలి.