కోల్‌‌కతాకు చెక్ పెట్టిన టైటాన్స్

కోల్‌‌కతాకు చెక్ పెట్టిన టైటాన్స్

నావి ముంబై:ఐపీఎల్‌‌-–15లో కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్ జోరు కొనసాగుతోంది. ప్రత్యర్థులు ఎవరైనా.. తమ ఆల్‌‌రౌండ్‌‌ షోతో అద్భుత విజయాలను సొంతం చేసుకుంటున్నది. హార్దిక్ పాండ్యా (49 బాల్స్ లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 67) కెప్టెన్ ఇన్నింగ్స్‌‌తో చెలరేగడంతో.. శనివారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో గుజరాత్‌‌ 8 రన్స్‌‌ తేడాతో కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌కు చెక్‌‌ పెట్టింది. దీంతో ఆడిన ఏడు మ్యాచ్‌‌ల్లో 12 పాయింట్లతో టేబుల్‌‌ టాపర్‌‌గా నిలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ 20 ఓవర్లలో 156/9 స్కోరు చేసింది. నైట్‌‌రైడర్స్‌‌ బౌలర్లలో రసెల్ (4/5), సౌథీ (3/24) రాణించారు. అనంతరం ఛేజింగ్ లో ఓవర్లన్నీ ఆడిన కోల్‌‌కతా 148/8 స్కోరుకే పరిమితమైంది. ఆఖర్లో రసెల్ (25 బాల్స్ లో 1 ఫోర్, 6 సిక్సర్లతో 48) మెరుపులు మెరిపించినా ప్రయోజనం లేకపోయింది. రషీద్ కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది.

హార్దిక్ సూపర్ ఇన్నింగ్స్    

మొదట బ్యాటింగ్​లో గుజరాత్​కు రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ గిల్ (7)ను సౌథీ ఔట్ చేసి కోల్‌‌కతాకు బ్రేక్ ఇచ్చాడు. ఇదే ఓవర్లో రెండు ఫోర్లతో అలరించిన పాండ్యా మంచి టచ్‌‌లో కనిపించాడు. మరో ఓపెనర్ సాహా (25) సిక్స్, ఫోర్ తో హార్దిక్ బాటలోనే నడవడంతో గుజరాత్ పది ఓవర్లలో 78/1తో నిలిచింది. అయితే తర్వాతి ఓవర్లోనే సాహా వికెట్ తీసిన ఉమేశ్(1/31) రెండో వికెట్ కు 75 రన్స్ భాగస్వామ్యానికి ముగింపు పలికాడు. ఈ దశలో మిల్లర్ (27) కూడా జోరు చూపించాడు. 12వ ఓవర్లో సింగిల్‌‌తో పాండ్యా లీగ్‌‌లో మూడో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే మిల్లర్‌‌ను మావి (1/36) ఔట్ చేసినా... అప్పటికే 16.2 ఓవర్లలో 133 రన్స్ చేసిన టైటాన్స్ భారీ స్కోరు సాధించేలా కనిపించింది. కానీ చివరి మూడు ఓవర్లలో 6 వికెట్లు తీసిన కేకేఆర్ బౌలర్లు గుజరాత్​కు అడ్డుకట్ట వేశారు. సౌథీ వేసిన 18వ ఓవర్లో పాండ్యా, రషీద్ (0) పెవిలియన్ చేరారు. చివరి ఓవర్లో మనోహర్ (2), ఫెర్గుసన్ (0), తెవాటియా (17), యశ్ దయాల్ (0) వికెట్లు తీసిన రసెల్ కేవలం 5 రన్సే ఇచ్చాడు.

రసెల్ కాపాడినా..

ఛేజింగ్‌‌లో కోల్​కతాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్లోనే బిల్లింగ్స్ (4), తన మరో ఓవర్లో నరైన్ (5)ను షమీ ఔట్ చేశాడు. కాసేపటికే రాణా (2) కూడా వెనుదిరగడంతో 16/3తో నైట్​రైడర్స్​ కష్టాల్లో పడింది. ఇదే ఓవర్లో సిక్స్‌‌తో జోరు మీద కనిపించిన శ్రేయస్ అయ్యర్ (12) ఏడో ఓవర్లో వెనుదిరగడంతో కేకేఆర్ డిఫెన్స్‌‌లో పడిపోయింది. ఈ దశలో రింకూ సింగ్ (35), వెంకటేశ్ అయ్యర్ (17) ఇన్నింగ్స్‌‌ను గాడినపెట్టడంతో పది ఓవర్లలో కోల్‌‌కతా 63/4 స్కోరు చేసింది. కుదురుకుంటున్న సమయంలో రింకూను ఔట్ చేసిన యశ్ వీరి జోడీని విడదీశాడు. ఇదే ఓవర్లో రసెల్ (24) క్యాచ్ ఔట్ గా వెనుదిరగాల్సి ఉన్నా ఆ బంతి నో బాల్ కావడంతో బతికిపోయిన అతడు 4,6,6తో రెచ్చిపోయాడు. ఈ సమయంలో బౌలింగ్‌‌కు వచ్చిన రషీద్ వరుస ఓవర్లలో వెంకటేశ్, మావి (2)ని ఔట్ చేసి గుజరాత్ క్యాంప్ లో సంతోషం నింపాడు. అప్పటికీ 24 బాల్స్ లో 45 రన్స్ అవసరం కాగా, క్రీజులో రసెల్, ఉమేశ్ ఉన్నారు. తర్వాతి మూడు ఓవర్లలో 27 రన్స్ రాబట్టడంతో ఆఖరి ఓవర్లో 18 రన్స్ కావాల్సి వచ్చింది. జోసెఫ్ (1/31) వేసిన ఈ ఓవర్ తొలి బంతికే రసెల్ సిక్స్ బాదినా.. తర్వాతి బాల్ కు అతడు ఔటవడంతో మ్యాచ్ ఉత్కంఠకు దారితీసింది. ఇక చివరి నాలుగు బాల్స్ లో 3 రన్సే రావడంతో టైటాన్స్ గెలుపు ఖాయమైంది.