పాత తెలుగు పాటలకు హార్డ్ రాక్ మ్యూజిక్ సొగసులు

పాత తెలుగు పాటలకు హార్డ్ రాక్ మ్యూజిక్ సొగసులు

పబ్బుల్లో, పార్టీల్లో మ్యూజిక్ అంటే బాలీవుడ్ బీట్స్, హలీవుడ్ హిట్సే ట్రెండ్. కానీ, ఆ హార్డ్ రాక్/ మెటల్ మ్యూజిక్​ ట్రెండ్ కి ‘అక్షర్’ బ్యాండ్ తెలుగు టచ్ ఇచ్చింది. పాత తెలుగు పాటలకు హార్డ్ రాక్ మ్యూజిక్ సొగసులు అద్దుతూ కొత్త రాగాలతో  ఆడియెన్స్​ని మెస్మరైజ్​ చేస్తోంది. తెలుగులో రాక్  చేస్తే అడ్రస్ లేకుండా పోతారన్న బ్యాండ్స్ ని కూడా తెలుగే పాడేలా చేస్తోంది. మరో ఇంట్రెస్టింగ్​ విషయం ఏంటంటే.. ఈ బ్యాండ్​ని మొదలుపెట్టింది అమెరికాలో పెరిగిన తెలుగబ్బాయి ఆరోన్​​ వెస్లీ. 

రాక్ బ్యాండ్ అనగానే ఎవరికైనా వెస్ట్రన్​ ఇండిపెండెంట్ బ్యాండ్స్ గుర్తుకొచ్చేవి ఇంతకుముందు. రానురాను ఈ కల్చర్ ప్రపంచమంతా పాకింది. అలా బాలీవుడ్​కి, అక్కడ్నించి మన తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ, మన దగ్గర చాలాకాలం హాలీవుడ్, బాలీవుడ్ పాటలే పాడుతూ వచ్చాయి  బ్యాండ్స్ అన్నీ. పబ్బుల్లో, పార్టీల్లో తెలుగు పాటలు వినాలని ఉన్నా, తెలుగు అడిగితే ఎక్కడ చిన్న చూపు చూస్తారో అని ఆడియెన్స్... తెలుగు పాటలు పాడాలని ఉన్నా... రాక్ లో తెలుగు పాడితే ఆడియెన్స్​ని మెప్పించలేం అని మ్యుజీషియన్స్ బాలీవుడ్, హాలీవుడ్ మ్యూజిక్ కే పరిమితమయ్యారు. కానీ ‘అక్షర్’ బ్యాండ్​తో  ఆరోన్​​ వెస్లీ  చేసిన చిన్న ప్రయోగంతో దానికి బ్రేక్ పడింది. అసలు ఈ జర్నీ ఎలా మొదలైందో వెస్లీ​ మాటల్లోనే.. 
చదువు– బ్యాండ్​– ఉద్యోగం
‘‘నేను చిన్నప్పుడు అమెరికాలో పెరిగా. అప్పుడు మా డాడీ వాళ్లకు ఒక బ్యాండ్ ఉండేది. అందులో ఒక డ్రమ్మర్ ని చూసి చాలా ఇన్​ స్పైర్ అయ్యా. అది ఎంతలా అంటే.. ఏడు సముద్రాలు దాటి  అమెరికా నుంచి ఇండియాకి వచ్చినా ఆ డ్రమ్​ని వదల్లేకపోయా. అలా కాలేజీ టైం నుండే తెలిసిన బ్యాండ్​లో డ్రమ్స్​ వాయించడం మొదలుపెట్టా. కానీ, అప్పుడు మొత్తం ఇంగ్లీష్ పాటలే ప్లే చేస్తుండేవాళ్లం. ఆ తర్వాత ఇంజినీరింగ్ అయిపోయాక  హెచ్ఎస్ బీసీలో ఉద్యోగంలో చేరా. అలాగని మ్యూజిక్​ను వదల్లేదు. 
వీకెండ్స్​లో కన్సర్ట్స్​ ఇస్తుండేవాడ్ని. అయినా సరే ఏదో తెలియని వెలితి.. మనసు మ్యూజిక్ మీద నుండి మళ్లకపోవడంతో బ్యాండ్ మొదలుపెడదామని 
ఫిక్స్ అయ్యా. సింగర్ పీవీఎల్​ఎన్​ మూర్తితో కలిసి నాలాగే  మ్యూజిక్​ ఇంట్రెస్ట్​ ఉన్న గిటారిస్ట్ -సందీప్ ఆర్కే, బేస్ గిటారిస్ట్- సలీం షేక్, కీ బోర్డ్ ప్లేయర్- గోపాల్ సాహిస్, వయొలనిస్ట్- బెహతా రాజేశ్, సౌండ్ ఇంజినీర్ శరత్ బాబులతో కలిసి ‘అక్షర్ బ్యాండ్’​ని మొదలుపెట్టా. ఒకప్పుడు మల్టీనేషనల్​ కంపెనీల్లో పనిచేసిన మేమంతా  ఇప్పుడు ఫుల్ టైం బ్యాండ్ నడుపుతున్నాం.
ముందంతా బాలీవుడ్ ట్రెండే
అక్షర్ బ్యాండ్  మొదలుపెట్టిన 8 సంవత్సరాల వరకు అందరిలాగే బాలీవుడ్, హాలీవుడ్ ట్రెండ్​నే ఫాలో అయ్యాం.  తెలుగు పాట పాడితే ఎలా ఉంటుందో చూద్దామని ఒక పార్టీలో ట్రై చేశాం. ఆ పాటలకు ఆడియెన్స్ నుండి ఊహించని విధంగా రెస్పాన్స్ వచ్చింది. కానీ, అప్పుడు కూడా అంత సీరియస్​గా తీసుకోలేదు. 2013లో ‘ గీతాంజలి’  సినిమాలోని ‘ ఓ పాపా లాలి..’ సాంగ్​కు రాక్ వెర్షన్ చేశాం. అది సోషల్ మీడియాలో ఓ రేంజ్​లో వైరల్ అయింది. దాన్ని హీరో నాగార్జున రీ షేర్ చేసి, మా గురించి ట్వీట్ చేశారు. అలా మా గురించి చాలామందికి తెలిసింది.  తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. కానీ, 2019 నుండి దాదాపుగా తెలుగు పాటలనే రాక్ మ్యూజిక్​లో ప్లే చేస్తున్నాం. అలా మేము పాడిన ‘ఆనందో బ్రహ్మ, రూప్ తేరా మస్తానా’ పాటలు మంచి  పేరు తీసుకొచ్చాయి. ఈ పాటలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఆ ఊపులో హిందీ, ఇంగ్లీష్ పాటలను పక్కన పడేశాం. మొత్తం తెలుగు పాటలతోనే రాక్ చేయడం మొదలుపెట్టాం.
ఎవర్ గ్రీన్ సాంగ్స్ కి ఎప్పుడూ క్రేజే
మేము ఇచ్చే కన్సర్ట్​లో సాంగ్, కీ బోర్డ్ సేమ్ ఒరిజి నల్​​లో ఉన్నదే ఉంటుంది.  కానీ గిటార్, డ్రమ్స్,  వయొలిన్ కలిపి ఫ్యూజిన్ చేసి ఆ పాటలకు మా స్టైల్​లో ఒరిజినాలిటీని తీసుకొస్తాం. ఆ రాక్ ఫ్యూజనే ఆడియెన్స్​కి నచ్చుతోంది. సోమ, మంగళవారాల్లో ప్రాక్టీస్ చేస్తాం. బుధవారం నుండి ఆదివారం వరకు షోస్ చేస్తాం. ఇళయరాజా, రెహ్మాన్ మ్యూజిక్​ అంటే మాకు చాలా ఇష్టం. వాళ్ల పాటలు ఎప్పుడు ప్లే చేసినా ఫుల్ రెస్పాన్స్ వస్తుంది. రాక్​లో ఆ పాటలు విని చాలామంది ఎమోషనల్ అవుతుంటారు కూడా. ఎవర్ గ్రీన్ సాంగ్స్​తో పాటు ఇప్పుడు కొత్తగా వచ్చే పాటలు కూడా మిక్స్ చేసి మెడ్లీ చేస్తాం. చాలా సినిమాలకి పని చేశాం. అనూప్​ రూబెన్స్, మణిశర్మతో కూడా పని చేశాం. కానీ, మా సొంత మ్యూజిక్ తో ఆల్బమ్స్ చేసి పాపులర్ అవ్వాలనేది మా డ్రీమ్’’ అంటున్నాడు ఆరో​న్​ వెస్లీ. 

‘‘తెలుగులో రాక్ ఎందుకు బ్రో? తెలుగు వాళ్లకు అవసరమే లేదు. మీరందరూ  పైసల కోసం ఏమేమో చేస్తున్నారు’’ అని మొదట్లో చాలామంది మమ్మల్ని  చూసి వెటకారంగా మాట్లాడారు. ఫుల్ టైం మ్యూజిక్ అంటే పైసల గురించి కూడా ఆలోచించాలి కదా?! కట్ చేస్తే ఇప్పుడు వాళ్లు కూడా తెలుగే ప్లే చేస్తున్నారు. అది కూడా చిన్న బ్యాండ్స్​లో! ఇప్పడు మీ పవరే రాక్ అని పొగుడు తున్నారు కూడా. తెలుగు మ్యూజిక్​ని వినేవాళ్లు ఉన్నారు కాబట్టే, తెలుగు సింగర్స్ ఇప్పటి వరకూ ఉన్నారు. మన తెలుగు బ్యాండ్స్​​ వచ్చిందే ఇప్పుడిప్పుడు.. రాబోయే రోజుల్లో ఇవి మరింత సక్సెస్​ అవుతాయన్న నమ్మకం ఉంది. ఇప్పటికే కొన్ని చోట్ల తెలుగు బ్యాండ్​ లేకపోతే .. ఆ ప్లేస్​ల​కి జనాలు ఎవ్వరూ రారు అనే పరిస్థితి వచ్చింది.   ::: ఆవుల యమున