సింగరేణి క్రీడలు లేనట్లే!.లాకౌడౌన్ లేకున్నా పోటీలు పెట్టట్లే

సింగరేణి క్రీడలు లేనట్లే!.లాకౌడౌన్ లేకున్నా పోటీలు పెట్టట్లే

మందమర్రి, వెలుగు: కరోనా ప్రభావంతో సింగరేణిలో రెండేళ్లుగా క్రీడల నిర్వహణను చేపట్టడం లేదు. ఏటా సింగరేణి స్థాయిలో క్రీడలు నిర్వహించి కోలిండియా పోటీలకు జట్టును ఎంపిక చేస్తారు. ఏప్రిల్ నెలలో స్పోర్ట్స్ నిర్వహణ కోసం సింగరేణి యాజమాన్యం బడ్జెట్ కేటాయించి ఆగస్టు, సెప్టెంబర్​లో సింగరేణి లెవల్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రతి ఏటా రూ.1.25 కోట్ల బడ్జెట్​ను క్రీడా పోటీల కోసం సింగరేణి కేటాయిస్తోంది. ఆ ఫండ్స్​ను స్టేడియాలు, గ్రౌండ్స్ డెవలప్​మెంట్, స్పోర్ట్స్ మెటిరియల్ కొనుగోలు, పోటీల నిర్వహణ, ప్రైజ్​ల కొనుగోలు కోసం వినియోగిస్తారు. చివరగా 2020 మార్చిలో మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్​లో కోలిండియా స్థాయి అథ్లెటిక్స్​పోటీలు నిర్వహించారు. ఇక అప్పటినుంచి సింగరేణి వ్యాప్తంగా ఎలాంటి స్పోర్ట్స్ జరగలేదు.  2020–-21, 2021–-22  ఆర్థిక సంవత్సరాల్లో  పూర్తిగా క్రీడల నిర్వహణ లేకుండా పోయింది. 

మూడు దశల్లో పోటీలు

ఎంప్లాయీస్​ను క్రీడల్లో ప్రోత్సహించేందుకు యాజమాన్యం ఆరు జిల్లాల్లో విస్తరించిన అన్ని  సింగరేణి ప్రాంతాల్లో  స్టేడియాలు, గ్రౌండ్స్​నిర్మించింది. ఎంప్లాయీస్​తోపాటు వారి కుటుంబసభ్యులను కూడా క్రీడల్లో ప్రోత్సహిస్తోంది. సింగరేణి ఎంప్లాయీస్ కోసం మూడు దశల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తారు. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో ముందుగా డివిజన్ పరిధిలో డిపార్ట్​మెంటల్​స్పోర్ట్స్ నిర్వహించి అందులో ప్రతిభ చూపినవారిని రీజియన్ లెవల్ పోటీలకు సెలెక్ట్ చేస్తారు. వారిమధ్య కంపెనీ లెవల్ పోటీలను నిర్వహిస్తారు. ప్రధానంగా కబడ్డీ, హాకీ, క్రికెట్, అథ్లెటిక్స్, బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, కల్చరల్  పోటీలు పెడతారు. పోటీల్లో అత్యంత ప్రతిభ కనబర్చినవారిని కోలిండియా, పబ్లిక్ సెక్టార్ పోటీలకు పంపిస్తారు.

లాక్​డౌన్​ లేకున్నాపోటీలు పెట్టట్లే

ఏటా ఆగస్టు, సెప్టెంబర్​లోనే సింగరేణి స్థాయి క్రీడలు పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఈసారి ఆగస్టు నెల ప్రారంభమైనా ఇప్పటి వరకు క్రీడల నిర్వహణకు  సంబంధించి ఎలాంటి షెడ్యూల్​ విడుదల చేయకపోవడంతో  క్రీడాకారులు నిరాశ చెందుతున్నారు. కరోనా పేరుతో ఈసారి కూడా  క్రీడలు నిర్వహించకుండా పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయాన్ని సీనియర్ క్రీడాకారులు వ్యక్తం చేస్తున్నారు.  లాక్​డౌన్​ఎత్తేయడంతో జూన్ నెలలో  సింగరేణి స్టేడియాలు, గ్రౌండ్స్ ఓపెన్​చేసినప్పటికీ ఇప్పటివరకు  ఎలాంటి పోటీలు నిర్వహించలేదు. సింగరేణిలో అన్ని కేటగిరీల్లో సుమారు 2 వేల మంది వరకు క్రీడాకారులు ఉన్నారు. పోటీలు పెట్టకపోవడంతో వీరంతా నిరాశ చెందుతున్నారు. కనీసం డిపార్ట్​మెంట్, రీజియన్, కంపెనీ స్థాయిలో పోటీలను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.