రాష్ట్రాల వారీగా నమోదైన కరోనా కేసులివే..

రాష్ట్రాల వారీగా నమోదైన కరోనా కేసులివే..

దేశంలో కరోనా పాజిటీవ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 73 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. గురువారం లోక్ సభలో కరోనా వైరస్ కట్టడి పై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ.. రాష్ట్రాల వారీగా నమోదైన కరోనా కేసుల జాబితాను విడుదల చేశారు. కరోనా సోకిన 73 మందిలో 17 మంది విదేశీయులని చెప్పారు మంత్రి.  అత్యధికంగా కేరళలో 17 పాజిటీవ్ కేసులు నమోదు కాగా… మహారాష్ట్రలో 11, ఉత్తర ప్రదేశ్ లో 10, ఢిల్లీలో ఆరుగురికి టెస్టుల్లో పాజిటీవ్ వచ్చింది. అటు కర్ణాటకలో 4, లడక్ లో 3 కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ, రాజస్థాన్, తమిళనాడు, కశ్మీర్, పంజాబ్ లో ఒక్కో పాజిటీవ్ కేసు నమోదు అయ్యిందని తెలిపారు.

కరోనా వ్యాప్తి నిరోధానికి విస్తృత చర్యలు చేపట్టామన్నారు హర్షవర్ధన్.  కరోనా వైరస్‌ పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, దేశంలో కరోనా వ్యాప్తి నిరోధంపై రోజువారీ సమీక్షలు జరుపుతున్నామని చెప్పారు. ఇరాన్‌, ఇటలీ సహా విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, దేశంలో అన్ని విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు.  కరోనా నెగిటివ్‌ వచ్చిన ప్రయాణికులను మాత్రమే బయటికి పంపిస్తున్నామని చెప్పారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితి అదుపులోనే ఉందన్నారు.  కరోనా వైరస్‌ను నిర్ధారించేందుకు పుణెలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌కు అనుమానిత వ్యక్తుల రక్త నమూనాలను పంపించి ఫలితాలు తెలుసుకుంటున్నాంమన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా చూసేలా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేస్తున్నామన్నారు మంత్రి.

రాష్ట్రాల వారీగా నమోదైన కరోనా కేసులు: ఢిల్లీ (6), హరియాణా (14), కేరళ (17), రాజస్థాన్ (3), తెలంగాణ (1), ఉత్తర్‌ ప్రదేశ్ (11), లద్ధాఖ్‌ (3), తమిళనాడు (1), జమ్ముకశ్మీర్ (1), పంజాబ్ (1), కర్ణాటక (4), మహారాష్ట్ర (11)లో కరోనా బాధితులు ఉన్నట్లు హర్షవర్ధన్ తెలిపారు.