చివరి స్టేజ్‌కి హిందుజా ఆస్తుల గొడవ!

చివరి స్టేజ్‌కి హిందుజా ఆస్తుల గొడవ!
  • శ్రీచంద్ ఆస్తులను ఆయన కూతురు కంట్రోల్ చేయడంపై రిస్ట్రిక్షన్లు పెట్టేందుకు నో చెప్పిన కోర్టు
  • లిటిగేషన్లను పరిష్కరించుకుంటామని పేర్కొన్న  హిందుజా బ్రదర్స్‌‌‌‌
  • శ్రీచంద్‌‌ను ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ప్రభుత్వ హాస్పిటల్‌‌కు షిప్ట్ చేయాలనుకున్నారని ఆరోపణ
  • తన ఫ్యామీలీ సైడ్‌‌ వాళ్లను ఇబ్బందులు పెడుతున్నారన్న శ్రీచంద్ కూతురు వినూ హిందుజా

బిజినెస్ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు:  దశాబ్దాల పాటు హిందుజా బ్రదర్స్ మధ్య కొనసాగిన ఫ్యామిలీ గొడవలకు తాజాగా  ముగింపు దొరికింది. యూరప్‌‌‌‌లోని ఆస్తులకు సంబంధించి నెలకొన్న లిటిగేషన్స్‌‌‌‌ను పరిష్కరించుకుంటామని హిందుజా బ్రదర్స్ పేర్కొన్నారు. హిందుజా ఫ్యామిలీ డ్రామా గత కొన్నేళ్ల నుంచి నడుస్తోంది.  ఆస్తి మొత్తం అందరికి  అని, ఏ ఒక్కరికి కాదనే సిద్ధాంతాన్ని హిందుజా గ్రూప్ బ్రదర్స్ అయిన శ్రీచంద్‌‌‌‌ పీ హిందుజా(86) (ఎస్‌‌‌‌పీ), గోపిచంద్ పీ హిందుజా (82), ప్రకాశ్‌‌‌‌ పీ హిందుజా, అశోక్‌‌‌‌ పీ హిందుజాలు  2014 నుంచి ఫాలో అవుతున్నారు. ఫలితంగా ఆస్తులను  పంచుకోకుండా జాయింట్‌‌‌‌గా మెయింటైన్ చేస్తున్నారు. కానీ, గత కొన్నేళ్ల నుంచి ఆస్తి విషయంలో గొడవలు వస్తున్నాయి. ముఖ్యంగా మతిమరుపుతో బాధపడుతున్న శ్రీచంద్ పీ హిందుజా హెల్త్‌‌‌‌ కోసం తక్కువ ఖర్చు చేస్తున్నారని, తాజాగా ఆయన్ని ప్రైవేట్ హాస్పిటల్‌‌‌‌ నుంచి ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌కు మార్చడానికి ప్రయత్నించారని శ్రీచంద్ హిందుజా కూతురు వినూ హిందుజా ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని తాజాగా కోర్టు కూడా ప్రస్తావించింది. ఆస్తి అందరికి అని చెప్పి ఎస్‌‌‌‌పీని సరిగ్గా పట్టించుకోవడం లేదని ప్రస్తావించింది. మరోవైపు శ్రీచంద్ బ్రదర్ గోపిచంద్ హిందుజాను రిప్రెజెంట్ చేస్తున్న లాయర్ మాత్రం ఈ విషయాన్ని తోసిపుచ్చారు. శ్రీచంద్ హెల్త్ కోసం  5.9 మిలియన్ డాలర్లు కేటాయించామని అన్నారు.  తాత్కాలికంగా హిందుజా బ్రదర్స్ మధ్య సంధి నెలకొన్నా, లాంగ్ రన్‌‌‌‌లో  హిందుజా గ్రూప్ బిజినెస్‌‌‌‌లపై  వీరి ఫ్యామిలీ గొడవల ప్రభావం ఉంటుందని ఎనలిస్టులు చెబుతున్నారు. ప్రస్తుతం 40 దేశాల్లో  హిందుజా గ్రూప్‌‌‌‌ బిజినెస్ చేస్తుండగా, ఈ కంపెనీ కింద 1,50,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. బ్యాంకింగ్‌‌‌‌, ఆటో, కెమికల్స్ ఇలా వివిధ సెక్టార్లలో హిందుజా గ్రూప్ విస్తరించింది. ఇండియాలో అశోక్ లేలాండ్‌‌‌‌, ఇండస్‌‌‌‌ఇండ్ బ్యాంక్‌‌‌‌తో సహా మరో నాలుగు లిస్టెడ్ కంపెనీలను ఈ గ్రూప్ ఆపరేట్ చేస్తోంది. 

కూతురి కంట్రోల్‌‌‌‌లోకి శ్రీచంద్ ఆస్తి!

‘మొత్తం అందరికీ చెందుతుంది. ఏది కూడా ఏ ఒక్కరికీ చెందదు’ అనే సిద్ధాంతాన్ని హిందుజా బ్రదర్స్ ఫాలో అవుతున్నారు. కానీ,  ఈ స్పిరిట్ లండన్ కోర్టులో కనిపించలేదని బ్లూమ్‌‌‌‌బర్గ్‌‌‌‌ రిపోర్ట్ చేసింది. శ్రీచంద్ కూతురు వినూ హిందుజా, ఇతర హిందుజా బ్రదర్స్‌‌‌‌ ఒకరికొకరు వ్యతిరేకంగా  ఆరోపణలు చేసుకున్నారు. తమ ఫ్యామిలీ వాళ్లను నిర్ణయాలు తీసుకోవడం నుంచి, ఫండింగ్‌‌‌‌  నుంచి కట్ చేస్తున్నారని వినూ ఆరోపించారు. తన తండ్రి ఆస్తులను కంట్రోల్లోకి తీసుకోవడం తప్ప తనకు మరో మార్గం లేకుండా చేశారని పేర్కొన్నారు.  ఈ లిటిగేషన్‌‌‌‌తో గ్రూప్‌‌‌‌లో పవర్ పొందాలని వినూ చూస్తోందని, ఇది ఎస్‌‌‌‌పీ చిరకాల కోరికకు విరుద్ధమని మిగిలిన బ్రదర్స్ ఆరోపిస్తున్నారు. ఎవరికి వారు తాము తప్పు చేయలేదని, అవతలి వాళ్లే తప్పు చేశారని అంటున్నారని, పవర్‌‌‌‌‌‌‌‌ కోసం కొట్టుకుంటున్నట్టుగా ఉందని  ఈ సందర్భంగా కోర్టు పేర్కొనడం గమనార్హం. గోపిచంద్ మాత్రం తనకు, శ్రీచంద్‌‌‌‌కు మధ్య ఎటువంటి గొడవలు లేవని, నలుగురు అన్నదమ్ములమూ ఒకే  ఆత్మగా కలిసి ఉన్నామని కోర్టుకు వివరించారు.  

శ్రీచంద్ కూతురికి సపోర్ట్‌‌‌‌‌‌గా తీర్పు..

శ్రీచంద్‌‌‌‌కు బదులు ఆర్థిక, సామాజిక అంశాలపై నిర్ణయం తీసుకోవడానికి ఆయన భార్య మధుకి, ఆ తర్వాత ఆయన కూతుళ్లు వినూ, షనూకి పవర్ ఆఫ్ అటార్నీని కోర్టు ఇచ్చింది. దీనిపై గోపిచంద్ కోర్టులో సవాల్ చేశారు. నిర్ణయాలు తీసుకోలేని స్టేజ్‌‌‌‌లో ఉన్నవారికి బదులు వారి ఫ్యామిలీ మెంబర్స్ నిర్ణయాలు తీసుకోవడానికి  పవర్ ఆఫ్ అటార్నీని జారీ చేస్తారు. తాజాగా ఈ అంశంపై రిస్ట్రిక్షన్లు పెట్టడానికి కోర్టు నిరాకరించింది. కోర్టు ప్రొసీడింగ్స్‌‌‌‌లో ప్రకాశ్‌‌‌‌  హిందుజా, అశోక్ హిందుజాల ప్రస్తావన రాలేదు.  హిందుజా ఫ్యామిలీ అసెట్స్‌‌‌‌పై నెలకొన్న గొడవల మధ్య అనేక లిటిగేషన్ కేసులు నమోదయ్యాయి. ఆస్తులన్నీ తమ నలుగురికీ చెందుతాయని 2014 లో   చేసుకున్న లెటర్‌‌‌‌‌‌‌‌కు అధికారికంగా ఎటువంటి విలువ లేదని తీర్పు ఇవ్వాలని శ్రీచంద్  2019 లో కోర్టును కోరారు. ఈ లెటర్‌‌‌‌‌‌‌‌ను చూపి శ్రీచంద్‌‌‌‌ పేరు మీద ఉన్న హిందుజా బ్యాంక్‌‌‌‌పై కంట్రోల్ సాధించేందుకు  ముగ్గురు బ్రదర్స్ ప్రయత్నిస్తున్నట్టు ఉందని 2020 లో కోర్టు  వ్యాఖ్యానించింది.