అమెరికాలోని ఒక రోడ్డు మీద 150 ఏండ్లుగా ఈ లైట్ కనిపిస్తోంది

అమెరికాలోని ఒక రోడ్డు మీద 150 ఏండ్లుగా ఈ లైట్ కనిపిస్తోంది

ఆ రోడ్డు మీద వెళ్తున్నవాళ్లకు కాస్త దూరంలో రోడ్డుకి అడ్డంగా పెద్ద వెలుగు కనిపిస్తుంది. అది అటూ ఇటూ కదులుతూ ఉంటుంది. గుండ్రంగా ఆరెంజ్ ‌‌ కలర్​లో ఉండే ఆ లైట్ ‌‌ చాలా బ్రైట్​గా కనిపిస్తుంది. పెద్ద బంతిలా ఉండే ఆ లైట్​ని చూసినవాళ్లు గాలిలో అంత పెద్ద దీపం ఎలా పెట్టారు? అని ఆశ్చర్యపోతుంటారు. కానీ.. అదేంటనేది ఇప్పటికీ ఎవరూ చెప్పలేకపోయారు. అమెరికాలోని ఒక రోడ్డు మీద దాదాపు 150 ఏండ్లుగా ఈ లైట్ కనిపిస్తోంది. 

అమెరికాలోని ఒక్లహామా స్టేట్​లో హార్నెట్ అనే టౌన్ ఉంది. అక్కడికి అమెరికాలోని ఫేమస్ హైవే రూట్66 మీదుగా వెళ్లి, దానికి ఆనుకుని ఉన్న మరో చిన్న దారి గుండా వెళ్లాలి. ఆ దారిలోనే ప్రయాణికులకు రాత్రిళ్లు ఒక వెలుగు కనిపిస్తుంటుంది. ఆ ప్రాంతాన్ని అక్కడివాళ్లు ‘డెవిల్స్ ప్రొమెనేడ్’ అని పిలుస్తుంటారు. అంటే.. దెయ్యాలు షికారు చేసేది అని అర్థం. ఈ లైట్ మీద దాదాపు100 ఏండ్ల నుంచి రీసెర్చ్​లు చేస్తున్నారు. కానీ.. ఇప్పటికీ దాని మిస్టరీని ఎవరూ కనుక్కోలేకపోయారు. ఆ వెలుగుని ‘ది హార్నెట్ స్పూక్ లైట్’ అని పిలుస్తుంటారు. మన జానపద కథల్లో చెప్పుకునే కొరివి దెయ్యంలా ఉంటుంది. కొందరికి బాస్కెట్​బాల్ సైజులో మరికొందరికి ఇంకాస్త పెద్దగా కనిపిస్తుంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది? దేనివల్ల ఆ లైటింగ్​ కనిపిస్తుంది? అనేది ఇప్పటివరకు ఎవరూ కనుక్కోలేకపోయారు. ఆర్మీ కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ కూడా దీనిపై రీసెర్చ్ చేసి, ‘ఇది ఒక అంతుచిక్కని మిస్టీరియస్ లైట్’ అని మాత్రమే చెప్పారు. 

భ్రమా...? నిజమా...? 

దీని మీద రీసెర్చ్ చేయని చాలామంది సైంటిస్ట్​లు ‘‘అదంతా అక్కడివాళ్ల భ్రమ. ఆ వెలుగు గురించి ఆలోచించడం వేస్ట్” అని కొట్టిపారేశారు. దాంతో ఇది నిజమా? లేక భ్రమా? అనేదాని మీద అనేక వాదనలు వినిపించాయి. కానీ, ఎక్కువమంది దీన్ని నిజమనే చెప్తున్నారు. అందుకే ఈ వెలుగు కనిపించే ఆరు కిలోమీటర్ల మేర రాత్రుళ్లు జర్నీ చేయడానికి భయపడుతుంటారు. కొందరైతే ఇక్కడ అతీత శక్తులు ఉన్నాయని, అందువల్లే ఇలా వెలుగు వస్తుందని నమ్ముతారు. 

ఎలా వస్తుంది? 

ఈ స్పూక్ లైట్ వాస్తవానికి క్వాపా అనే చిన్న టౌన్​ దగ్గరలో కనిపిస్తుంది. కానీ.. దగ్గర్లోని హార్నెట్ టౌన్ వైపు కనిపిస్తుంది. అక్కడివాళ్లు చెప్పినదాని ప్రకారం.. 1836లోనే కొందరు దీన్ని చూశారట. కానీ.. వాళ్లు చెప్పిన విషయాన్ని అప్పట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత 1881లో కనిపించినప్పడు అధికారికంగా రికార్డ్ చేశారు. మొదట చాలా చిన్నగా ఉండి, ఆ తర్వాత మెల్లిగా సైజు పెరుగుతుంది. కొందరికి డాన్స్ చేస్తున్నట్టు కనిపించింది. బహుశా ఆ దెయ్యం లైట్​ పట్టుకుని డాన్స్ చేస్తుందేమో అనుకున్నారు అది చూసిన వాళ్లు. ఆ లైట్​ ఒక్కోసారి రోడ్డు మధ్యలో చాలా స్పీడ్​గా, ఒక్కోసారి మెల్లిగా అటుఇటు తిరుగుతుంటుంది. లైట్​ కనుమరుగయ్యే ముందు కాస్త వెనక్కి వెళ్తుంది. రోడ్డు పక్కన ఉన్న చెట్టు చివర్లలో పుట్టి రోడ్డు మీదికి వస్తుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపించింది. కొందరేమో ఏదో అదృశ్య శక్తి ఆ లైట్​ని లాంతరు లాగా వాడుతుంది. అది రోడ్డు దాటేటప్పుడు లైట్​ మాత్రమే జనాలకు కనిపిస్తుంటుంది అని చెప్తున్నారు. ఎక్కువగా రాత్రి పది గంటల నుండి అర్ధరాత్రి వరకు కనిపిస్తుంది. 

సహజంగానే.. 

గాలిలో ఏర్పడే కెమికల్ రియాక్షన్ వల్ల సహజంగానే ఈ వెలుగు వస్తుందని కొందరు వాదించారు. కానీ.. సైంటిఫిక్ గా నిరూపించలేకపోయారు. ఇంకొందరేమో కార్ల హెడ్ లైట్ల వల్లే ఆ లైట్ కనిపిస్తుందని చెప్పారు. అందుకోసం కొన్ని ఎక్స్ పరిమెంట్స్ కూడా చేశారు. కానీ, కచ్చితంగా కార్ల హెడ్ లైట్లే కారణమని నిరూపించలేకపోయారు. కొందరు సైంటిస్ట్ లు సేంద్రియ పదార్థం కుళ్ళిపోవడం వల్ల అందులో నుంచి వచ్చే కెమికల్స్  ‌‌ ‌‌ ఈ వెలుగుని క్రియేట్ చేస్తున్నాయని చెప్పారు. అలా జరగాలంటే ఆ ప్రాంతంలో కచ్చితంగా చిత్తడి నేలలు ఉండాలి. కానీ, ఆ చుట్టుపక్కల అలాంటి నేల లేదు. కాబట్టి అవన్నీ నిరాధారమైనవే. 

ప్రేమ జంట

ఈ వెలుగుల మీద కొన్ని కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడికి దగ్గరలో ఉన్న క్యాపా టౌన్​లో ఒక ఇండియన్  ఫ్యామిలీ ఉండేది. ఆ ఫ్యామిలీకి చెందిన యువతి ఒక యువకుడితో ప్రేమలో పడింది. కట్నం విషయంలో గొడవలు వచ్చి, పెద్దలు వాళ్ల పెండ్లికి ఒప్పుకోలేదు. ఆమె మాత్రం అతన్నే పెండ్లి చేసుకుంటానని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఇద్దరూ కలిసి పారిపోతుండగా కొందరు వాళ్లను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దాంతో ఇద్దరూ దగ్గర్లోని స్ప్రింగ్ నదిలో దూకి చనిపోయారు. అప్పటినుంచే ఈ రోడ్డు మీద వెలుగు కనిపిస్తున్నట్టు అక్కడివాళ్లు చెప్పుకుంటారు. ఆ ప్రేమికుల ఆత్మలే వెలుగు రూపంలో తిరుగుతున్నాయని చాలామంది నమ్ముతారు. ఇదొక్కటే కాదు.. ఇలాంటి కథలు చాలానే ప్రచారంలో ఉన్నాయి. ఒక వ్యక్తి తన ఫ్యామిలీ కోసం లాంతరు పట్టుకుని ఇక్కడ వెతుకుతూ ఉంటాడని కూడా చెప్తుంటారు. ఇంకొందరేమో అక్కడ చనిపోయిన ఒక ట్రైబ్ లీడర్ ఆత్మ లాంతరు పట్టుకుని తిరుగుతుందని నమ్ముతారు. ఇలాంటి నమ్మకాలు, వాదనలు చాలానే ఉన్నా ఈ మిస్టరీని కనుక్కోవడానికి కావాల్సిన ఆధారాలు మాత్రం దొరకడం లేదు.