బరువు తగ్గడానికి చిట్కాలు.. గ్రీన్ కాఫీ ఉపయోగాలు

బరువు తగ్గడానికి చిట్కాలు.. గ్రీన్ కాఫీ ఉపయోగాలు

బరువు తగ్గడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. టైంకి తింటూ.. నచ్చింది తింటూ బరువు తగ్గడంలేదు అంటే ఎలా? హెల్త్ డైట్‌ని ఫాలో అవుతూ వ్యాయామం కూడా చేస్తేనే బరువు తగ్గగలరు. కాఫీ తాగితే బరువు తగ్గుతారని చాలా మంది నమ్ముతారు. అవును అది నిజమే.. అది కూడా గ్రీన్ కాఫీ తాగితే చాలా బెటర్. అలా అని కేవలం గ్రీన్ కాఫీ ద్వారా బరువు తగ్గుతాం అంటే అది కాని పని. గ్రీన్ కాఫీ తాగడంతో పాటూ.. ఆహారాన్ని తీసుకోవడం కూడా తగ్గించుకోవాలి.

కాఫీ గింజలలో క్లోరోజెనిక్ ఆమ్లం ఉంటుంది. ఈ ఆమ్లంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. కాఫీ గింజలు రెండు రకాలుంటాయి. అవి, కాల్చిన కాఫీ గింజలు, కాల్చని కాఫీ గింజలు(గ్రీన్ కాఫీ గింజలు). కాల్చిన గింజల కాఫీతో పోలిస్తే.. కాల్చని గింజలే బరువు తగ్గడానికి ఎక్కువగా ఉపయోగపడతాయి. రెగ్యులర్ వ్యాయామంతో పాటూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటేనే.. బరువు తగ్గడానికి కాఫీ ఉపయోగపడుతుంది. అంతే కాకుండా.. మధ్యపానం, ధూమపానం వదిలేస్తేనే బరువు తగ్గడంలో గ్రీన్ కాఫీ బాగా పనిచేస్తుంది.

ఇండియన్ జర్నల్ ఆఫ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ప్రకారం గ్రీన్ కాఫీలోని క్లోరోజెనిక్ ఆమ్లం బరువు తగ్గడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ ఆమ్లం శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వును తగ్గించి.. బరువును తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఈ ఆమ్లం మెటబాలిక్ రేటును పెంచి లివర్ నుంచి గ్లూకోజ్ రక్తంలో కలవాడాన్ని తగ్గిస్తుంది. దాంతో శరీరం గ్లూకోజ్‌కు బదులుగా కొవ్వును కరిగించి బరువు తగ్గిస్తుంది.

మీరు బాగా ఎక్కువ తినేవాళ్లయితే.. గ్రీన్ కాఫీ తీసుకోవడం వల్ల ఆకలి తగ్గి బరువు కూడా తగ్గుతుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత కానీ లేదా భోజనం చేసిన తర్వాత కానీ గ్రీన్ కాఫీ తీసుకుంటే బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేసి బరువును తగ్గిస్తుంది. గుడ్లు, సోయా, ఆకు కూరలు, నట్స్, మొలకలు బరువు తగ్గడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. జీర్ణక్రియ మొదలయ్యేది నోటి నుంచే కాబట్టి ఆహారాన్ని బాగా నమిలి, నెమ్మదిగా తినడం వల్ల తక్కువ మోతాదులో తీసుకుంటాము. దాని వల్ల కూడా బరువు తగ్గడం సులభమవుతుంది.

ఆహారాన్ని ఒకేసారి కాకుండా..విడతలవారీగా కొంచెం కొంచెం తినాలి. ఇలా చేయడం వల్ల కూడా బరువును తగ్గించుకోవచ్చు. టీవీ, ఫోన్, పేపర్ మొదలైనవి చూస్తూ ఆహారం తినకూడదు. ఇలా చేస్తే మనం తిన్నది ఒంటబట్టదు. అందుకే తినేటప్పుడు ఏ పని చేయకూడదు. వ్యాయామం చేయకుండా బరువును తగ్గించుకొని, ఆరోగ్యంగా బతకలేము. అందుకే బరువు తగ్గాలంటే వ్యాయామం కూడా నిత్యకృత్యం కావాలి.