ఇల్లు గుల్ల చేస్తరు.. జాగ్రత్త!

ఇల్లు గుల్ల చేస్తరు.. జాగ్రత్త!

యజమానులు అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు

హైదరాబాద్,వెలుగుపనిమనిషులను పెట్టుకునే ముందు వారి పూర్తి వివరాలు తెలుసుకోవాలని..వారిపై నిఘా ఉంచాలని సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు. కోకాపేటలోని ఆర్టిసోస్ పౌలోమీ విల్లాలోని ఓ వ్యాపారి ఇంట్లో పనికి చేరిన ఇద్దరు నేపాలీ జంట పక్కా స్కెచ్ వేసి బంగారం, వెండి, డబ్బు ఎత్తుకెళ్లారు. కొంతకాలం పాటు నమ్మకంగా పనిచేసి చోరీకి పాల్పడ్డారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి కోకాపేట్ లో గత శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనతో పాటు గతంలోనూ జరిగిన కొన్ని కేస్ స్టడీస్ వివరాలు ఇలా ఉన్నాయి.

కీర్తన గచ్చిబౌలి హిల్‌రిడ్జ్ విల్లాస్ లో ఉంటోంది. ఈమె పేరెంట్స్, చెల్లెలు నార్సింగి కోకాపేటలోని ఆరిస్టోస్‌ పౌలోమి విల్లాలో ఫ్లాట్ నంబర్ 44 లో ఉంటున్నారు. పనిమనుషుల కోసం కీర్తన డిసెంబర్ ఫస్ట్ వీక్ లో హౌస్ సర్వీస్ ఏజెన్సీని ఆశ్రయించింది. వారు ఓ నేపాలీ దంపతులను వెతికి నెల జీతం, వసతి ఇవ్వాలనే అగ్రిమెంట్​పై డిసెంబర్‌27న పనికి కుదిర్చారు. నేపాలీ జంటను ఔట్​హౌస్​లో ఉంచి వంటపని, ఇతర పనులు అప్పగించారు.  అప్పటినుంచి వీరు తమపై ఏమాత్రం అనుమానం రాకుండా పూర్తి నమ్మకం కలిగేలా చేశారు.   కీర్తన పేరెంట్స్ ఇంట్లోని లాకర్, అల్మారాల్లో క్యాష్, గోల్డ్ దాచే ప్రాంతాలను ఈ జంట గుర్తించింది. ముగ్గురి డైలీ షెడ్యూల్, లంచ్, డిన్నర్ టైమ్ తెలుసుకున్నారు. తమ ప్లాన్​లో భాగంగా గత శుక్రవారం రాత్రి కీర్తన పేరెంట్స్ తో పాటు ఆమె చెల్లికి భోజనంలో మత్తు మందు కలిపి వడ్డించారు. కొద్దిసేపటికే వారంతా స్పృహ తప్పారు. ఇంట్లోని బంగారం, వెండితో పాటు ఇతర విలువైన వస్తువులను నేపాలీ దంపతులు ఎత్తుకెళ్ళారు.

రెహమత్ నగర్ లో..

గతేడాది నవంబర్ లో రెహమత్ నగర్‌లో ఓ ఇంట్లో పనిచేస్తున్న ఈశ్వరమ్మ చోరీకి పాల్పడింది. షాప్ ఓనర్ దగ్గర ఏడాది పాటు నమ్మకంగా పనిచేసిన ఈశ్వరమ్మ అతడు డబ్బు,బంగారు ఆభరణాలను ఎక్కడ దాస్తున్నాడో గమనించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రూ.లక్షతో పాటు 7 తులాల బంగారు ఆభరణలను ఈశ్వరమ్మ ఎత్తుకెళ్లింది. ఇంటి ఓనర్ ఇచ్చిన కంప్లయింట్ తో పోలీసులు కేసు నమోదు చేసి ఈశ్వరమ్మను అరెస్ట్ చేశారు. దొంగిలించిన బంగారాన్ని రికవరీ చేశారు.