నేను ముస్లిం.. నా భార్య హిందూ.. నా పిల్లలు హిందుస్థాన్

నేను ముస్లిం.. నా భార్య హిందూ.. నా పిల్లలు హిందుస్థాన్

కులం, మతం అనే తేడాలు లేకుండా మనమంతా భారతీయులమన్న భావనతో దేశ ప్రజలంతా ఉండాలని బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అన్నారు. స్టార్ ప్లస్ చానెల్‌లో జరిగిన ఓ డాన్స్ షో సందర్భంగా ఆయన జాతీయ సమగ్రత గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రతీ వీకెండ్‌లో వచ్చే డాన్స్ ప్లస్ 5 అనే రియాలిటీ షోలో రిపబ్లిక్ డే నాడు స్పెషల్ గెస్ట్‌గా వెళ్లిన షారుఖ్ జడ్జిగా వ్యవహరించారు. భీమ్ బహదుర్ అనే ఓ కంటెస్టెంట్ దేశ భక్తి థీమ్‌తో ఐక్యత గురించి సాంగ్ చేశాడు. ఆ తర్వాత షారుఖ్ మాట్లాడుతూ డాన్స్ ద్వారా మత సామరస్యం, యూనిటీ గురించి అద్భుతంగా చూపించాడని అన్నాడు. ఈ సందర్భంగా ఓ పర్సనల్ విషయం మాట్లాడాలనుకుంటున్నానంటూ తాను ఓ ముస్లింనని, తన భార్య (గౌరి) హిందువని, తన పిల్లలు హిందుస్థాన్ అని చెప్పాడు షారుఖ్. తన కూతురు సుహానాను స్కూల్‌లో చేర్పించేటప్పుడు ఫామ్‌లో మతం గురించి అడిగితే, తన బిడ్డ వచ్చి మన మతమేంటని అడిందని అన్నాడు. అప్పుడు మనం ఇండియన్స్ అని చెప్పానన్నాడు.

దేశంలో మరో మతం ఉండకూడదు

‘‘మన దేశంలో హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్స్.. ఇలా పలు మతాల గురించి మనం మాట్లాడుతుంటాం. అయితే నేడు మన యువతరం వీటి గురించి మాట్లాడడం మానేసింది. మీలాంటి వాళ్లు (కంటెస్టెంట్), నాలాంటి వాళ్లు (నేను కూడా యువకుడినే అనుకుంటున్నా) ఉన్నంత కాలం ఈ సామరస్య భావాన్ని ఎవరూ దూరం చేయలేరు. అయితే ఇండియాలో ముగ్గురు టాప్ సూపర్ స్టార్స్ ఖాన్స్ అంటూ తరచూ న్యూస్ పేపర్లలో చూస్తుంటాం. ఖాన్స్, కుమార్స్, కపూర్స్ ఎవరైనా సరే మనమంతా భారతీయులం. ఈ తేడా కూడా చూపించకూడదన్నది నా ఫీలింగ్. ఇండియన్స్ అన్న ఒక్క ఫీలింగ్ తప్ప దేశంలో మరో మతం లేదు. ఉండకూడదు’’ అని షారుఖ్ అన్నారు. ఆయన మాటలకు షోలో అందరూ ఒక్కసారిగా చప్పట్లతో హోరెత్తించారు. షారుఖ్ మాట్లాడిన ఆ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మత సామరస్యం గురించి షారుఖ్ చెప్పిన మాటలు కరెక్ట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.