ఇయ్యాల ఎయిర్ ఫోర్స్ లోకి లైట్ కంబాట్ హెలికాప్టర్లు

ఇయ్యాల ఎయిర్ ఫోర్స్ లోకి లైట్ కంబాట్ హెలికాప్టర్లు

న్యూఢిల్లీ:  శత్రుదేశాల సైన్యాలకు వణుకు పుట్టించేలా హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) రూపొందించిన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్​లు(ఎల్​సీహెచ్ లు) సోమవారం ఎయిర్ ఫోర్స్ అమ్ములపొదికి చేరనున్నాయి. రాజస్థాన్ జోధ్ పూర్ లోని ఎయిర్ ఫోర్స్ బేస్ లో జరిగే కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్, ఎయిర్ చీఫ్​ మార్షల్ వీఆర్ చౌధరి సమక్షంలో వీటిని వాయుసేనలోకి ప్రవేశపెట్టనున్నారు.

ఈ హెలికాప్టర్లతో ఎయిర్ ఫోర్స్ పోరాట పటిమ గణనీయంగా పెరుగుతుందని రాజ్ నాథ్ సింగ్ ఆదివారం ట్వీట్ చేశారు. ఎయిర్ ఫోర్స్ కోసం 10, ఆర్మీ కోసం 5 ఎల్ సీహెచ్ లను సమకూర్చుకునేందుకు ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని కేబినెట్ కమిటీ గత మార్చిలో ఆమోదం తెలిపింది. ఇందుకు రూ. 3,887 కోట్లను కేటాయించింది. ఇటీవలే ఈ హెలికాప్టర్లు ఆర్మీలో  చేరగా, ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ చేతికీ అందనున్నాయి. 

నిలువుగా కూలినా తట్టుకుంటది..

సముద్రంలో, నేలపై, అడవుల్లో, హిమాలయాల వంటి ఎత్తైన ప్రాంతాల్లో, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా సమర్థంగా ఎగిరేలా తయారు చేసిన ఎల్ సీహెచ్​లు.. అటు పాక్, ఇటు చైనా సైన్యానికి వణుకు పుట్టించడం ఖాయమని  ఎక్స్​పర్ట్​లు చెప్తున్నారు. కేవలం 5.8 టన్నుల బరువుఉండే ఎల్ సీహెచ్​లలో 24 చిన్న మిసైళ్లు, ఇతర వెపన్స్ ఉంటాయి. శత్రు రాడార్లు, మిసైళ్లు, జెట్​లకు చిక్కకుండా తప్పించుకుంటూ వాటిపై దాడి చేసే సత్తా వీటి సొంతం. దీని ముందువైపు ఉన్న గన్ 110 డిగ్రీల కోణంలో తిరిగి బులెట్లు పేల్చగలదు. దీనిని పూర్తిగా ఆర్మర్డ్ వెహికల్​గా రూపొందించడంతో శత్రువులు ఫైరింగ్ చేసినా పెద్దగా డ్యామేజ్ కాదు. ఒకవేళ కూలిపోయినా తట్టుకునేలా ల్యాండింగ్ గేర్ అమర్చారు.