పెరిగిన చేనేత ముడి సరుకుల రేట్లు

పెరిగిన చేనేత ముడి సరుకుల రేట్లు
  •     కిలో నూలు రూ.5,600 
  •     రసాయనాలు 40 శాతం హైక్‌
  •     గిట్టుబాటు కాక నేతన్నలకు పని ఇవ్వని మాస్టర్‌‌ వీవర్లు
  •     కార్మికులకు ఇబ్బందులు 

హైదరాబాద్‌, వెలుగు: కరోనాతో ఆగమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చేనేత రంగంపై ధరల పిడుగు పడింది. నూలు, ముడి సరుకుల రేట్లు విపరీతంగా పెరిగాయి. చీరల తయారీకి ఉపయోగించే మల్బరీ పట్టు గూళ్ల ధర కూడా రెట్టింపు అయింది. కానీ, పట్టు చీరల ధరలు మాత్రం పెరగడం లేదు. గిట్టుబాటు కాక మాస్టర్‌‌ వీవర్లు నేతన్నలకు పని ఇస్తలేరు. దీంతో ఉపాధి లేక నేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. 
రేట్లు రెట్టింపు..
రాష్ట్రంలో లక్ష కుటుంబాల దాకా చేనేతపై ఆధారపడ్డాయి. ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌ తదితర జిల్లాల్లో ఎక్కువగా నేతన్నలు ఉన్నారు. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చేనేత కార్మికులు.. నూలు, ముడిసరుకుల ధరలు పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. 3 నెలల క్రితం రూ.3,600 ఉన్న కిలో నూలు, ఇప్పుడు రూ.5,600 దాకా పలుకుతోంది. అన్ని రకాల రసాయనాలపై 40 శాతం వరకు రేట్లు పెరిగాయి. జరి, కాటన్‌ ధరలూ పెరిగాయి. కాగా, రాష్ట్రంలో గతంలో పట్టుగూళ్ల ఉత్పత్తి గణనీయంగా ఉండేది. పలు కారణాలతో కొంతకాలంగా ఉత్పత్తి తగ్గింది. దిగుమతులు కూడా తగ్గడంతో కిలో పట్టు గూళ్లు గతంలో రూ.200 నుంచి -రూ.300 వరకు ఉండగా, ఇప్పుడు రూ.600 దాకా పలుకుతున్నాయి. 
కార్మికులకు పని ఇస్తలేరు..
ధరలు పెరగడంతో మాస్టర్‌ వీవర్లు నేతన్నలకు పని ఇవ్వడం లేదు. తమకు గిట్టుబాటు కావడం లేదని, కొన్ని రోజులు ఆగాలని స్పష్టం చేస్తున్నారు. దీంతో కార్మికులు పనిలేక ఇబ్బందులు పడుతున్నారు. కొంత మంది వీవర్లు పని ఇస్తున్నా కూలి మాత్రం ఇప్పుడు అడగొద్దంటున్నారు. 
స్కీంలు సక్కగ అమలైతలే..
నేతన్నల కోసం ప్రభుత్వం చేనేత చేయూత, చేనేత మిత్ర స్కీంలు తీసుకొచ్చింది. చేనేత చేయూత కింద కార్మికులు నెలకు కొంత మొత్తంలో కిస్తీ లెక్క 36 నెలలు కడతారు. మూడేండ్ల తర్వాత ప్రభుత్వం కొంత కలిపి కార్మికులను చెల్లిస్తుంది. కానీ ఇది సక్కగా అమలైతలేదు. ఇక, చేనేత మిత్ర స్కీం కింద నూలు సబ్సిడీ ఇస్తున్నామని సర్కారు గొప్పలు చెబుతున్నా అంతంత మాత్రమే అమలవుతోంది. రెండు నెలలకోసారి సబ్సిడీ ఇస్తామని చెప్పినా.. 6 నెలలకు కూడా అందడంలేదు. 
సర్కారు పట్టించుకుంటలే..
ధరలు పెరిగి నేతన్నలు ఇబ్బందులు పడుతున్నా సర్కారు పట్టించుకోవడం లేదు. ఏపీలో ఏటా రూ.24 వేల పెట్టుబడి సాయం అందిస్తుండగా, మన దగ్గర మాత్రం ఇవ్వడం లేదు. ఇటీవల చేనేత రంగానికి రూ.1,134 కోట్లు ఇచ్చామని మంత్రి కేటీఆర్‌‌ ప్రకటించారు. అయితే కరోనా టైమ్‌లో కేవలం రూ.90 కోట్లు మాత్రమే చేనేత చేయూత పథకానికి ఇచ్చారు. అందులోనూ రూ.30 కోట్లు నేతన్నలు కట్టిందేనని చేనేత సంఘాల లీడర్లు చెబుతున్నారు. రాష్ట్రంలో సహకార సంఘాలను కూడా నిర్వీర్యం చేశారని ఆరోపిస్తున్నారు. 
సర్కారు ఆదుకోవాలె..
చేనేత రంగం కోలుకునే టైమ్‌లో ధరల దెబ్బ పడింది. గిట్టుబాటు కాకపోవడంతో వీవర్లు పని ఇస్తలేరు. దీంతో పని దొరక్క కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. సర్కారు పట్టించుకుంటలేదు. ఏపీలో లాగా పెట్టుబడి సాయం అందించాలి. 
- పాశికంటి లక్ష్మీనర్సయ్య, చేనేత లీడర్‌