రాష్ట్ర చరిత్రలోనే ఇయ్యాల మస్త్ కరెంట్ వాడిన్రు

రాష్ట్ర చరిత్రలోనే ఇయ్యాల మస్త్ కరెంట్ వాడిన్రు

రాష్ట్ర చరిత్రలోనే ఇయ్యాల ప్రజలు అత్యధిక విద్యుత్ ను వినియోగించారు. ఇవాళ ఉదయం 10 గంటలకు  14500 మెగా వాట్లు విద్యుత్ డిమాండ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. గతేడాది ఇదే రోజు గరిష్ట డిమాండ్ 11460 మెగా వాట్లు మాత్రమేనని చెప్పారు. ఇవాళ మధ్యాహ్నం వరకు మరింత విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిన్న 14169 మెగా వాట్లు కాగా రాష్ట్రం ఏర్పడిన తరువాత అత్యధిక విద్యుత్ డిమాండ్ 14500 రికార్డ్ స్థాయిలో నమోదు కావడం ఇదే మొదటిసారి.  గత సంవత్సరం మార్చి నెలలో 14160 మెగా వాట్ల అత్యధిక విద్యుత్ వినియోగం కాగా ఈసారి ఫిబ్రవరి నెలలోనే గత సంవత్సరం రికార్డ్ ను అధిగమించి 14169 మెగా వాట్ల విద్యుత్ నమోదు చేసింది. ఈ సంవత్సరం వేసవి కాలంలో 15 వేల మెగా వాట్ల డిమాండ్  వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. డిమాండ్ ఎంత వచ్చినా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. 

సాగు విస్తీర్ణం పెరగడం, రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలు పెరగడంతో విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది.మొత్తం విద్యుత్ వినియోగం లో 37 శాతం వ్యవసాయ రంగానికే కేటాయిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. విద్యుత్ వినియోగంలో దక్షిణ భారతదేశంలో తమిళనాడు మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో తెలంగాణ నిలిచింది.