పేదల కోసం షాపింగ్ మాల్

పేదల కోసం షాపింగ్ మాల్

పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో షాపింగ్ అంటే అత్యంత ఖర్చుతో కూడుకున్న విషయం. ఇక సామాన్య ప్రజలైతే కనీసం షాప్ లోకి వెళ్లడానికి కూడా ఆలోచిస్తారు. కానీ ఓ మాల్ మాత్రం  కేవలం పేదల కోసమే దుకాణం నడిపిస్తోంది. అది కూడా ఉచితంగా. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అదే నిజం. ఇది లక్నోలోని రహీంనగర్ లో ఉంది. అనోఖా పేరుతో పలువురు దాతలు కలిసి ఈ మాల్ ను నడిపిస్తున్నారు. దీనికి మూలం మాత్రం నగరానికి చెందిన వైద్యుడు డా.అహ్మద్‌ రజాఖాన్‌. పేదల అసౌకర్యాలు చలించిపోయిన ఆయన.. వారి కోసం ఏమైనా చేయాలని ఈ మాల్ ప్రారంభించారు. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే ఎవరినీ చేయి చాచకుండా తమకు అవసరమైన దుస్తులను తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ మాల్‌లో దాతలు అందించిన స్వెటర్లు, బ్లాంకెట్లు, దుప్పట్లతోపాటు చెప్పులు, సూట్‌కేసులు, స్కూల్‌ యూనిఫాం తదితరాలను ఉంచుతారు. 

అయితే ఈ మాల్ కు ముఖ్యంగా కార్మికులు, మురికివాడల్లో నివాసముండే పేదలు వీటిని తీసుకెళ్లి ఉపయోగించుకుంటారని డా. రజాఖాన్ తెలిపారు. ప్రతీ ఏడాది డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఈ మాల్ ఓపెన్ ఉంటుందని చెప్పారు. గత ఐదేళ్ల నుండి ఈ మాల్ ను నిర్వహిస్తున్నామని.. దాతలు మరియు బట్టలు తీసుకునే వారి గురించి సరైన రికార్డు కూడా మెయింటైన్ చేస్తామని ఆయన అన్నారు. ఈ మాల్‌ను రోజూ ఉదయం 10 నుండి సాయంత్రం 6 గంటల వరకు నలుగురి సిబ్బందితో నిర్వహిస్తారు. గత సంవత్సరం ఈ మాల్ నుండి సుమారు 3వేల నుండి 4వేల మంది బట్టలు తీసుకున్నారని డాక్టర్ ఖాన్ చెప్పారు.