ఫార్మాసిటీ పేరుతో ప్రభుత్వం రైతుల భూములను లాక్కుంటోంది

 ఫార్మాసిటీ పేరుతో ప్రభుత్వం  రైతుల భూములను లాక్కుంటోంది

తెలంగాణ లో వ్యవసాయం ప్రగతి పథంలో ఉందన్న ప్రకటనలు తప్ప ఏమీ లేదని రైతు సంఘాల ఐక్యవేదిక సమన్వయకర్త జైపాల్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్  సోమాజిగూడలో రైతు సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ రైతు సంఘాల నేతలు, రైతులు పాల్గొన్నారు. అందులో భాగంగా రైతు సంఘాల ఐక్యవేదిక సమన్వయకర్త  జైపాల్ రెడ్డి మాట్లాడుతూ... 26 రాష్ట్రాల రైతు సంఘాల నాయకులను అహ్వానించారు. కానీ ఇక్కడ ఉన్న రైతు సంఘాల నాయకులు కనపడలేదని రైతు సంఘాల ఐక్యవేదిక సమన్వయకర్త జైపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.  రాష్ట్రం లో 65లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయని, వారికి కనీస గిట్టు బాటు ధర కల్పించడం లేదని ఆరోపించారు. తెలంగాణలో రోజురోజుకీ రైతు ఆత్మహత్యలుపెరుగుతున్నాయన్న జైపాల్ రెడ్డి...  రాబోయే రోజుల్లో రైతులతో కలిసి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. లక్ష రూపాయల రుణమాఫీ గాలికి వదిలేశారన్న ఆయన...  కేంద్రం తెచ్చిన ఫసల్ భీమా యోజన పథకం తెలంగాణలో అమలు చేయడం లేదని ఆరోపణలు చేశారు. రాష్ట్రం లో రైతు ప్రయోజనాలు వదిలి ఇతర రాష్ట్రం లో పర్యటిస్తున్నారని ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి పరోక్ష విమర్శలు చేశారు. భూసార పరీక్షలు గాలికి వదిలేశారని, పంటలకు ఇన్సూరెన్స్ నష్ట పరిహారం ఇవ్వలేదని ఆరోపించారు.

ధాన్యం కొనుగోలు రసీదు రైతులకు ఇవ్వాలి

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ హామీని ఇప్పటివరకు నెరవేర్చ లేదని భారతీయ కిసాన్ సంఘ్ నేత రాజిరెడ్డి ఆరోపించారు. వ్యవసాయానికి 18 నుంచి 20 గంటలు కరెంటు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. పంట భీమా విషయంలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాలేదన్న ఆయన... వానా కాలంలో పంట నష్టం వాటిల్లిన రైతులకు ఎకరానికి 25 వేల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు. అటవీ ప్రాంతంలో జంతువుల వల్ల నష్టపోయిన పంటకు ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలని కోరారు. రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసి రైతుల ఖాతాలో డబ్బు జమ చేయాలన్నారు. ధాన్యం కొనుగోలు రసీదు రైతులకు ఇవ్వాలని.. రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలతో రైతులు సతమతమవుతున్నారని తెలిపారు. ధరణి వెబ్ సైట్ తో రైతు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా రాజిరెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలో 11 చక్కర ఫ్యాక్టరీలుంటే అందులో ఐదు మాత్రమే రన్ చేస్తున్నారని, మిగతావి మూసేశారని ఆరోపించారు. మిగిలిన 6 ఫ్యాక్టరీలను కూడా తిరిగి ప్రారంభించాలని, దానికి ప్రభుత్వం కృషి చేయాలని రాజిరెడ్డి డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి

60 ఏండ్ల కింద వ్యవసాయానికి ఇంత ఖర్చు ఉందేది కాదని పర్యావరణ నేత హరిబాబు అన్నారు. సరైన మార్కెట్ వ్యవస్థ లేక రైతులు నష్టపోతున్నారన్న ఆయన... ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేద్దామని పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని నమ్ముకొని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. గోవులు గోశాలలో కాదు రైతుల దొడ్లల్లో ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పారు. రైతులు తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేయాలని కోరారు. స్వాతంత్ర్యం ఏర్పడి 75 ఏళ్లు గడిచినా ఆయిల్ ను మాత్రం ఇప్పటికీ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు.

*ఫార్మాసిటీ పేరుతో  మా రైతుల భూములను తెలంగాణ ప్రభుత్వం లాక్కుంటుంది. ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఫార్మాసిటీని ఓపెనింగ్ చేయనియ్యం కేసీఆర్. ఎకరం భూమికి 7 లక్షలు నష్ట పరిహారం ఇవ్వడం ఏంటీ.. ఫార్మాసిటీని ప్రారంభోత్సవం చేయడానికి వస్తే మంత్రి కేటీఆర్ ను అడ్డుకుంటాం. కారంపొడి, చీపురుగట్టలతో మహిళలమంతా అడ్డంగా నిలుచుంటాం.

అనసూయ, రైతు 

*మా పూర్వీకుల నుండి వారసత్వంగా వస్తున్న భూమి మా పిల్లలకు మేము ఇవ్వాలి.  మా భూమిని లాక్కోవడానికి నువ్వు ఎవరు కేసీఆర్. రాష్ట్రం పాలించిన ఎందరో  ముఖ్యమంత్రులను చూసా... నీలాంటి నియంత ముఖ్యమంత్రిని చూడలేదు.

మానెమ్మ, రైతు

 *మిడ్ మానేరు డ్యామ్ ద్వారా ఎంతో నష్టపోయాము ఇప్పటివరకు పరిహారం ఇవ్వలేదు. మిడ్ మనేర్ కింద ఉన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది.

ఎర్ర శ్రీకాంత్, రైతు 

*2018 లో ఎకరాకు 9 లక్షలు ఇచ్చారు. రికార్డు పరం గా మాది 5 ఎకరాలు. కానీ 3 ఎకరాలకు నష్టపరిహారం ఇచ్చారు. ఇంకా 2 ఎకరాలకు నష్టపరిహారం రాలేదు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. కానీ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు.

శోభ రంగారెడ్డి, రైతు