ఫేక్ డాక్యుమెంట్స్ తో మోసగించిన దంపతుల అరెస్ట్

ఫేక్ డాక్యుమెంట్స్ తో మోసగించిన దంపతుల అరెస్ట్

బషీర్ బాగ్, వెలుగు:  ఓపెన్ ప్లాట్స్ పేరిట ఫేక్ డాక్యుమెంట్స్ తో పలువురిని మోసగించిన దంపతులను హైదరాబాద్ సీసీఎస్ డిటెక్టివ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీఎస్ డీసీపీ ఎన్. శ్వేత తెలిపిన ప్రకారం... వీబీజే కాప్ స్టోన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు కందుల వెంకట ప్రసాద్ గుప్త , అనురాధ గుప్త దంపతులు మార్కెట్ ధరల కంటే తక్కువకే ఓపెన్ ప్లాట్స్ ఇస్తామని తనను నమ్మించి మోసగించారని గత మార్చి16న మోపిదేవి మహాలక్ష్మి సీసీఎస్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. కేసు నమోదు చేసి సీసీఎస్ డిటెక్టివ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

దంపతులను అదుపులోకి తీసుకొని విచారించారు. మేడ్చల్ జిల్లా కాప్రా వద్ద లక్ష్మినగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ పేరుతో 2019 నుంచి తక్కువ ధరకు ఓపెన్ ప్లాట్స్ అమ్ముతామని నమ్మించి, ఆపై ఫేక్ డాక్యుమెంట్స్ తో పలువురిని మోసగించినట్టు గుర్తించారు. బాధితుల నుంచి రూ. 12. 35 కోట్ల వరకు వసూలు చేసినట్టు ఇన్వెస్టిగేషన్ లో తేలింది. దంపతులను అరెస్ట్ చేసి ఐపీసీ 406 , 420 , 506 సెక్షన్ల కింద  కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపామని డీసీపీ శ్వేత తెలిపారు. నిందితుడు కందుల వెంకట ప్రసాద్ గుప్త గతంలో ఇదే తరహాలో మోసగించగా పలు పోలీస్ స్టేషన్లలో 6 కేసులు నమోదు అయ్యాయని చెప్పారు.