జనం తిరస్కరించాక ఈ పబ్లిసిటీ స్టంటేంది..! జన్ సురాజ్ పార్టీపై సుప్రీంకోర్టు ఫైర్

జనం తిరస్కరించాక ఈ పబ్లిసిటీ స్టంటేంది..! జన్ సురాజ్ పార్టీపై సుప్రీంకోర్టు ఫైర్
  • బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై పిటిషన్​ను విచారణకు తీసుకోబోమని క్లారిటీ
  • హైకోర్టుకు వెళ్లాలని సూచన.. 
  • పాట్నా హైకోర్టుకు పిటిషన్  రీడైరెక్ట్

న్యూఢిల్లీ: నిరుడు ముగిసిన బిహార్  అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల కోడ్  ఉల్లంఘన జరిగిందని, ఆ ఎలక్షన్లను రద్దు చేయాలని కోరుతూ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్  కిశోర్​కు చెందిన జన్ సురాజ్ పార్టీ (జేఎస్పీ) వేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించడానికి ఒప్పుకోలేదు. పిటిషన్​ను విచారణకు స్వీకరించబోమని సీజేఐ జస్టిస్  సూర్యకాంత్, జస్టిస్  జోయ్ మాల్యతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. ‘

‘ఆ ఎన్నికల్లో ఓటర్లు మిమ్మల్ని (జన్ సురాజ్  పార్టీ) తిరస్కరించారు. పబ్లిసిటీ కోసం ఇలా పిటిషన్లు వేయడం కరెక్టు కాదు. ఆ ఎన్నికలపై మీరు అంతగా పోరాడాలనుకుంటే హైకోర్టులో కేసు వేయవచ్చు కదా? అక్కడికి వెళ్లకుండా సుప్రీంకోర్టుకు రావడం ఏంది? ఇదేమైనా ప్యాన్ ఇండియా కేసా? కోడ్  ఉల్లంఘన జరిగిందనడానికి సాక్ష్యం ఏముంది? మీరు అధికారంలోకి వచ్చినా ఇలానే పిటిషన్లు వేస్తారు” అని బెంచ్ వ్యాఖ్యానించింది. 

పిటిషన్​ను బిహార్  హైకోర్టుకు రీడైరెక్ట్  చేసింది. కాగా.. బిహార్  ఎన్నికల్లో కోడ్  అమల్లో ఉండగానే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి కుటుంబంలో ఒక మహిళకు రూలింగ్  జేడీయూ, బీజేపీ కూటమి రూ.10 వేలు పంచిందని జేఎస్పీ ఆరోపించింది. అలా రాష్ట్రంలోని 25 లక్షల నుంచి 35 లక్షల మందికి డబ్బులు పంచారని పిటిషన్​లో పేర్కొంది. అంతకుముందు కూడా ఎన్డీటీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ ప్రశాంత్  కిశోర్  ఇదే ఆరోపణ చేశారు. ఓటర్లకు బీజేపీ, జేడీయూ కూటమి డబ్బులు పంచి ఓట్లు కొనుగోలు చేసిందని ఆయన పేర్కొన్నారు.