గెలుపే లక్ష్యం..!వ్యూహాలకు పదును పెడుతున్న పార్టీలు

గెలుపే లక్ష్యం..!వ్యూహాలకు పదును పెడుతున్న పార్టీలు
  • ఉనికి కోసం పాకులాడుతున్న బీజేపీ
  • కాంగ్రెస్​కు వ్యతిరేకంగా మహా కూటమి ఏర్పాటు 

 భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  జిల్లాలో కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్​తోపాటు అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో తొలిసారి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నాయి.

కొత్తగూడెం కార్పొరేషన్​తోపాటు అశ్వారావుపేట, ఇల్లెందు మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఉనికి చాటుకునేందుకు బీజేపీ పాకులాడుతోంది. ఇల్లెందులో కాంగ్రెస్​కు వ్యతిరేకంగా బీఆర్ఎస్​, సీపీఐ, సీపీఎం, మాస్​లైన్ ఆధ్వర్యంలో మహా కూటమి ఏర్పడింది. 

గెలుపు కోసం పోటాపోటీ..

కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతోపాటు సుజాతనగర్​ మండలంలోని ఏడు గ్రామాలతో కలిసి గతేడాది కొత్తగూడెం మున్సిపల్​కార్పొరేషన్ ఏర్పడింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత పాల్వంచ వాసులు ఓట్లు వేయనున్నారు. నిన్నటివరకు పంచాయతీల్లో ఓట్లు వేసిన సుజాతనగర్​లోని ఏడు గ్రామాల ప్రజలు ఇప్పుడు కార్పొరేషన్ లో భాగంగా ఓట్లు వేయనున్నారు.

పంచాయతీగా ఉన్న అశ్వారావుపేట మున్సిపాలిటీగా ఏర్పడింది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో జరుగుతున్న తొలి ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు తహతహలాడుతున్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్​లో 60 డివిజన్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్​, సీపీఐ, బీజేపీ పార్టీలు ప్రధానంగా పోటీ చేస్తున్నాయి. 

ఉనికి కోసం..

జిల్లాలో జరుగుతున్న మున్సిపల్​ఎన్నికల్లో ఉనికి కోసం బీజేపీ పాకులాడుతోంది. పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో ఒక్క సర్పంచ్ ను​కూడా బీజేపీ గెలుచుకోలేకపోయింది. ఈ క్రమంలో కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్​కార్పొరేషన్​తోపాటు అశ్వారావుపేట, ఇల్లెందు మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. 

వ్యూహాలకు పదును..

గెలుపే లక్ష్యంగా పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కొత్తగూడెం మున్సిపల్​ కార్పొరేషన్​లో సీపీఎంతో పొత్తుపెట్టుకొని కాంగ్రెస్​ ఎన్నికల బరిలో నిలిచింది. టీడీపీతో కలిసి సీపీఐ పోటీ చేస్తుండగా.. బీఆర్ఎస్​, బీజేపీలు ఒంటరిగా బరిలోకి దిగాయి. అశ్వారావుపేట మున్సిపాలిటీలో బీఆర్ఎస్, టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్​, సీపీఎం ఐక్యంగా ముందుకు సాగుతున్నాయి.

ఇల్లెందులో మున్సిపాలిటీలో కాంగ్రెస్​ ఒంటరిగా పోటీ చేస్తోంది. బీఆర్ఎస్​, సీపీఐ, సీపీఎం, మాస్​ లైన్​ పార్టీలు మహా కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగాయి. పొలిటికల్ లీడర్లు తెర వెనుక రాజకీయాలకు శ్రీకారం చుడుతున్నారు. లోపాయికారి పొత్తులకు ఆయా పార్టీల లీడర్లు ప్రధాన్యత ఇస్తున్నారు.