కాంబినేషన్ పై టీమిండియా కసరత్తు

కాంబినేషన్ పై టీమిండియా కసరత్తు

ప్రతిష్టాత్మక వరల్డ్​ టెస్ట్​ చాంపియన్​షిప్​ ఫైనల్లో ఎలాంటి కాంబినేషన్​తో బరిలో దిగాలన్నదానిపై ఇండియా కసరత్తులు ముమ్మరం చేసింది. బ్యాటింగ్​ లైనప్​పై ముందునుంచే స్పష్టత ఉన్నా.. కీలకమైన  బౌలింగ్​పై కూడా​ ఓ అంచనాకు వచ్చేసింది! నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్ కాంబినేషన్​ను ప్రస్తుతానికి పక్కనబెట్టిన కోహ్లీ, కోచ్​  రవిశాస్త్రి.. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల  స్ట్రాటజీకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది..! ఇంగ్లిష్​ కండీషన్స్​, పిచ్​తోపాటు ప్రత్యర్థి న్యూజిలాండ్​ లైనప్​ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం..! అయితే ఫ్రంట్​ లైన్​ స్పిన్నర్ల ఎంపికలో ఎలాంటి ఇబ్బందుల్లేకపోయినా.. థర్డ్​  పేసర్​ ఎవరనే దానిపైనే ఇంకా సస్పెన్స్​ కొనసాగుతున్నది..!

సౌతాంప్టన్​: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరల్డ్​ టెస్ట్​ చాంపియన్​షిప్​ (డబ్ల్యూటీసీ) ఫైనల్​కు టీమిండియా తుది జట్టును ఖరారు చేసుకునే పనిలో పడింది. ప్రాక్టీస్​ మ్యాచ్​ లేకపోయినా, ఇంట్రా స్క్వాడ్​ మ్యాచ్ పెర్ఫామెన్స్​తోనే ఫైనల్​ ఎలెవన్​ను రూపొందించుకుంటోంది. దీనికితోడు ఇంగ్లిష్​ కండీషన్స్​, పిచ్​ను బట్టి బౌలింగ్​ లైనప్​పై ఓ అంచనాకు వచ్చింది. ఇండియారే బాగా కలిసొచ్చే ఐదుగురు బౌలర్ల వ్యూహ్యంతోనే బరిలోకి దిగాలని కెప్టెన్​ కోహ్లీ, కోచ్​ రవి శాస్త్రి భావిస్తున్నారు. ఇందులో భాగంగా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల లైనప్​తో న్యూజిలాండ్​ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడున్న అంచనాల ప్రకారం దాదాపుగా ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నా.. లాస్ట్​ మినిట్​లో ఏదైనా మార్పులు కూడా చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. పిచ్​ కూడా పేస్​–స్పిన్​కు అనుకూలంగా ఉన్నట్లు ఏజెస్​ బౌల్​ క్యూరేటర్​ సైమన్​ లీ వెల్లడించాడు. ‘ఫస్ట్​ త్రీ డేస్​ పేస్​, బౌన్స్, క్యారీ ఉంటుంది. లాస్ట్​ రెండు రోజులు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది’ అని లీ పేర్కొన్నాడు. 

3+2 కాంబినేషన్​..

సౌతాంప్టన్​లో ఇండియా చివరిగా ఆడిన టెస్టును దృష్టిలో ఉంచుకొని రెండో స్పిన్నర్​తో బరిలోకి దిగడం చెత్త ఐడియా మాత్రం కాదు. 2018 టూర్​లో ఇక్కడ జరిగి పోరులో ఇంగ్లండ్​ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. ఫైనల్​ ఎలెవన్​లో మొయిన్​ అలీ, ఆదిల్​ రషీద్​ను ఆడించారు. ఈ మ్యాచ్​లో అలీ​ 9 వికెట్లు తీస్తే, అశ్విన్​ మూడుకే పరిమితమయ్యాడు. లాస్ట్​ రెండు రోజులు పిచ్​ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది కాబట్టి ఇద్దరు స్పిన్నర్లు ఉండటం మేలే. కాబట్టి జడేజా, అశ్విన్​ను తీసుకున్నా.. బ్యాటింగ్​ బలం కూడా బాగా పెరుగుతుంది. 

థర్డ్​ పేసర్​ ఎవరు?

ఇంగ్లిష్​ కండీషన్స్​ బట్టి చూస్తే పేసర్లు బుమ్రా, షమీ ఆటోమెటిక్​ చాయిస్​. ఈ ఇద్దరి వేరియేషన్స్​ కూడా అద్భుతంగా పని చేస్తాయి. చాలా రోజుల నుంచి ఇండియా బౌలింగ్​ కాంబినేషన్​లో కీలకంగా ఉన్నారు. అయితే ఇప్పుడు థర్డ్​ పేసర్​ ఎవరన్నదే అతిపెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది. ఇషాంత్​ శర్మ, శార్దూల్​ ఠాకూర్​తో పాటు హైదరాబాదీ మహ్మద్​ సిరాజ్​ కూడా ఈ ప్లేస్​ కోసం పోటీపడుతున్నాడు.  తన హైట్​తో విపరీతమైన బౌన్స్​ను క్రియేట్​ చేస్తాడు కాబట్టి ఆస్ట్రేలియాలో అయితే ఇషాంత్​ను ఆడించాల్సిందే. కానీ ఇంగ్లండ్​కు వచ్చేసరికి పరిస్థితులు కొద్దిగా డిఫరెంట్​గా ఉంటాయి. కాబట్టి వేరియేషన్​ కోసం సిరాజ్​ను తీసుకోవాలని విరాట్​ భావిస్తున్నాడు. కొన్ని నెలలుగా సిరాజ్​ వండర్స్​ క్రియేట్​ చేస్తున్నాడు. ఇండియా పిచ్​లపైనే ఇంగ్లిష్​ బ్యాట్స్​మెన్​ను వణికించాడు. ఆసీస్​లో మ్యాచ్​ విన్నింగ్​ పెర్ఫామెన్స్​ చేశాడు.  కాబట్టి  ఇక్కడ కూడా సిరాజ్​ ప్రభావం చూపిస్తాడని కెప్టెన్​ నమ్ముతున్నాడు. ఇక శార్దూల్​ విషయానికొస్తే స్వింగ్​ రాబడతాడు.నైట్​ వాచ్​మన్​గా కూడా ఉపయోగపడతాడు. అయితే ఇంగ్లండ్​లో ఎక్స్​పీరియెన్స్​ను పరిగణనలోకి తీసుకుంటే ఇషాంత్​కే చాన్స్​ ఎక్కువగా ఉంది. ఎందుకంటే 2018 టూర్​లో 18 వికెట్లతో టాప్​ బౌలర్​గా నిలిచాడు. అదనపు పేస్​, బౌన్స్​ కూడా ఆయుధంగా ఉపయోగపడొచ్చు. 

4+1 కాంబినేషన్​ అయితే ఎలా?

ఒకవేళ కోహ్లీ అండ్​ శాస్త్రి.. చివరి నిమిషాల్లో 3+2 కాంబినేషన్​ మార్చి 4+1కు వెళ్తే.. ఒక్క స్పిన్నర్​ ఎవరుంటారు. మ్యాచ్​ టైమ్​లో చిరుజల్లులు పడే చాన్స్​ ఉందని వాతావరణ నివేదిక. దీనిని దృష్టిలో పెట్టుకుంటే కోచ్​ అండ్​ కెప్టెన్​  నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్​తో దిగొచ్చు. లాస్ట్​ రెండు రోజులు స్పిన్​కు అనుకూలం కాబట్టి ఏకైక స్పిన్నర్​గా అశ్విన్​తో నడిపించొచ్చని ఈ ఇద్దరు అనుకుంటున్నారు. అప్పుడు జడేజా బెంచ్​కు పరిమితమవుతాడు. ఇక పేసర్లలో బుమ్రా, షమీ, సిరాజ్​, ఇషాంత్​ ఫైనల్​ ఎలెవన్​లోకి వస్తారు. ఓవరాల్​గా మ్యాచ్​కు ముందు రోజు ఉండే వెదర్​ కండీషన్స్​పైనే ఫైనల్​ ఎలెవన్​ ఆధారపడి ఉంటుంది.