కాశ్మీర్​ రెండు దేశాల సమస్య.. మేమే తేల్చుకుంటం

కాశ్మీర్​ రెండు దేశాల సమస్య.. మేమే తేల్చుకుంటం
  • ట్రంప్ ​మీడియేషన్​పై మన దేశం క్లారిటీ

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్​ అంశం ఇండియా–పాకిస్తాన్​ మధ్య సమస్య అని, దానిని రెండు దేశాలు పరిష్కరించుకుంటాయని, ఇందులో వేరే వారి ప్రమేయం అవసరం లేదని  మనదేశం బుధవారం స్పష్టం చేసింది. వరల్డ్​ ఎకనమిక్​ ఫోరం(డబ్ల్యూఈఎఫ్) మీటింగ్​ సందర్భంగా అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ కాశ్మీర్​ వివాదం పరిష్కారంలో సహకరిస్తామని ప్రకటించడంతో   మనదేశం ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. టెర్రరిజం, చర్చలు కలిసి నడిచే అవకాశం లేదని, ఈ విషయంలో  మనకు  స్పష్టమైన విధానం ఉందని విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. చర్చలకు ముందడుగు పడాలంటే ముందు పాకిస్తాన్​ టెర్రరిజాన్ని అరికట్టాలని సూచించాయి. మంగళవారం స్విట్జర్లాండ్​ దావోస్​లో డబ్ల్యూఈఎఫ్​ మీటింగ్​ సందర్భంగా పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​తో ట్రంప్​ సమావేశం అయ్యారు. ఈ మీటింగ్​ తర్వాత ట్రంప్​ మాట్లాడుతూ కాశ్మీర్​ అంశంలో మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధమని మరోసారి ప్రకటించారు. ‘‘కాశ్మీర్​లో పరిస్థితులపై చర్చించాం. ఈ అంశంలో మీడియేషన్​ చేసేందుకు సిద్ధం. కొన్ని సరిహద్దుల్లో మేము పాకిస్తాన్​తో కలిసి పనిచేస్తున్నాం. ఇండియా, పాకిస్తాన్​ మధ్య కాశ్మీర్​కు సంబంధించిన వివాదంపైనా మేము చర్చించాం. మేము సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం” అని ట్రంప్​ చెప్పారు. కాశ్మీర్​ అంశాన్ని లేవనెత్తిన ఇమ్రాన్​ ఆగస్టు 5 నుంచి అక్కడ తలెత్తిన పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా,  అంతర్జాతీయ సమాజం ఈ విషయంలో కలుగజేసుకోవాలని, కాశ్మీర్​ సమస్య పరిష్కారంలో అమెరికా జోక్యం చేసుకోవాలని కోరారు.  ఏడాది కాలంలో ట్రంప్​తో ఇమ్రాన్​ సమావేశం కావడం ఇది మూడోసారి. కాశ్మీర్ అంశంలో మీడియేషన్​ చేసేందుకు సిద్ధమని ఇప్పటికే చాలాసార్లు ట్రంప్​ చెప్పారు. అలా చెప్పిన ప్రతిసారీ ఇది ఇండియా–పాకిస్తాన్​మధ్య సమస్య అని, రెండు దేశాలే పరిష్కరించుకుంటాయని  మనదేశం స్పష్టం చేస్తూ వస్తోంది.