782.81 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

782.81 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

స్టాక్ మార్కెట్లు లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 11.15 నిమిషాల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 782.81 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 244.80 పాయింట్లు లాభపడ్డాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచొచ్చనే ఆందోళనలు రేకెత్తినప్పటికీ.. ఇవాళ ఉదయం ఆ దేశ మార్కెట్లలో పాజిటివ్ ట్రెండే కనిపించింది. అదే ప్రభావంతో మన దేశ స్టాక్ మార్కెట్లు కూడా గ్రీన్ రూట్ లోకి దూసుకుపోయాయి. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ గణనీయంగా 602.10 పాయింట్లు పుంజుకోగా, ఆటో, ఎఫ్ఎంసీజీ, సిమెంట్, ఐటీ  ఇండెక్స్ లు  సైతం లాభాలను మూటకట్టుకున్నాయి. ఈవారమంతా ఇదే తరహా ట్రెండ్ కొనసాగే సూచనలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇవాళ ప్రారంభం కానున్న  అమెరికా ఫెడరల్ రిజర్వ్ మానిటరీ పాలసీ సమావేశాన్ని మార్కెట్ వర్గాలు నిశితంగా గమనించనున్నాయి. అమెరికాలో ఆగస్టు నెలలో ద్రవ్యోల్బణం కొంతమేర తగ్గి 8.5 శాతం నుంచి 8.3 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణాన్ని 2 శాతానికి తగ్గించాలని అమెరికా ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం కంటే ఇది చాలా ఎక్కువే. ఈనేపథ్యంలో త్వరలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీరేట్లను పెంచే చాన్స్ ఉంది.

టాప్ గెయినర్స్.. టాప్ లూజర్స్

 నేటి టాప్ గెయినర్స్ జాబితాలో దీపక్ నైట్రేట్ (6.3 శాతం), టీవీఎస్ మోటార్ (4.97 శాతం), కోఫోర్జ్ (4.79 శాతం), ఎంసీఎక్స్ ఇండియా (4.53 శాతం), గుజరాత్ స్టేట్ పెట్రోలియం (4.34 శాతం) ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో గ్రాన్యూల్స్ ఇండియా (-మైనస్ 2.73 శాతం), క్యాన్ ఫిన్ హోమ్స్ ( మైనస్ 2.54 శాతం), పీవీఆర్ (మైనస్ 2.09 శాతం), ఎస్కార్ట్స్ కుబోటా (మైనస్ 1.9 శాతం), గ్రాసిమ్ (మైనస్ 0.85 శాతం) ఉన్నాయి.