ఈ ఏడాది అదరగొట్టిన ఇండియా రెజ్లర్లు వీరే

ఈ ఏడాది అదరగొట్టిన ఇండియా రెజ్లర్లు వీరే
  • ఒలింపిక్‌‌ రేసులో నలుగురు రెజ్లర్లు
  • ఐదు వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ మెడల్స్‌‌
  • స్టార్‌‌ స్టేటస్‌‌ దక్కించుకున్న దీపక్‌‌
  • 2019లో ఇండియా రెజ్లింగ్‌‌ హిట్‌‌

పాలు అమ్ముకునే వ్యక్తి కొడుకు స్టార్‌‌ రెజ్లర్‌‌ అయ్యాడు. తామేంటో ఆల్రెడీ నిరూపించుకున్నవాళ్లు మెగాస్టార్లు అయ్యారు. యంగ్‌‌స్టర్స్‌‌ కూడా మ్యాట్‌‌పై ఇరగదీసి ఫ్యూచర్‌‌పై ఆశలు పెంచారు. ఓవరాల్‌‌గా ఐదు వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ మెడల్స్‌‌.. నాలుగు ఒలింపిక్‌‌ బెర్త్‌‌లతో ఈ ఏడాది ఇండియా రెజ్లర్లు సూపర్‌‌ హిట్‌‌ కొట్టారు. కొత్త ఏడాదితోపాటు టోక్యోలోనూ మన కుస్తీ వీరులు ఇదే దూకుడు చూపెట్టాలని, విశ్వవేదికపై మువన్నెల జెండాను రెపరెపలాడించాలని ఆశిద్దాం.

(వెలుగు  క్రీడావిభాగం)

స్టార్లందరూ దాదాపు అంచనాలు అందుకోవడంతో రెజ్లింగ్‌‌లో ఈ ఏడాది ఇండియాకి మంచి ఫలితాలు వచ్చాయి. దీపక్‌‌ పునియా రూపంలో కొత్త స్టార్‌‌ వెలుగులోకి రావడం ఆనందాన్ని ఇస్తే.. ఒలింపిక్‌‌ మెడలిస్ట్‌‌లు సుశీల్‌‌ కుమార్‌‌, సాక్షి మాలిక్‌‌ పెర్ఫామెన్స్‌‌ దిగజారడం కలవరపెట్టింది. మన రెజ్లర్లు ఐదు వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ మెడల్స్‌‌, నాలుగు ఒలింపిక్‌‌ కోటాలు సాధించడంతో వరల్డ్‌‌ రెజ్లింగ్‌‌పై ఇండియా బలమైన ముద్ర వేసింది.

ఆ నలుగురు..

ఇండియా నుంచి బజ్‌‌రంగ్‌‌ పునియా(65 కేజీ), వినేశ్‌‌ ఫొగట్‌‌(53 కేజీ), దీపక్‌‌ పునియా(86 కేజీ), రవి కుమార్‌‌ దాహియా(57 కేజీ) టోక్యో ఒలింపిక్స్‌‌కు అర్హత సాధించారు. సెప్టెంబర్‌‌లో కజకిస్థాన్‌‌లోని నూర్‌‌ సుల్తాన్‌‌ వేదికగా జరిగిన వరల్డ్‌‌ రెజ్లింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఒలింపిక్‌‌ సిల్వర్‌‌ మెడలిస్ట్‌‌ సారా హిల్‌‌డెబ్‌‌రాన్త్‌‌ను చిత్తుగా ఓడించిన వినేశ్‌‌ ఫొగట్‌‌ ఇండియా తరఫున తొలి ఒలింపిక్‌‌ కోటా సాధించింది. ఆ తర్వాత ఇదే మెగా ఈవెంట్‌‌లో బ్రాంజ్‌‌ మెడల్స్‌‌ గెలిచిన జజ్‌‌రంగ్‌‌, రవి కుమార్‌‌ కూడా టోక్యో టికెట్లు సొంతం చేసుకున్నారు. వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ ఫైనలిస్ట్‌‌ దీపక్‌‌ చివరిగా ఒలింపిక్స్‌‌కు అర్హత సాధించాడు. వీరంతా ఫామ్‌‌ కొనసాగిస్తే టోక్యో నుంచి మెడల్‌‌తో తిరిగిరావడం ఖాయం.

దీపక్‌‌.. ఓ సంచలనం

దీపక్‌‌ పునియా ఈ ఏడాది ఇండియాతోపాటు వరల్డ్‌‌ రెజ్లింగ్‌‌కే ఓ సంచలనం. హర్యానాకు చెందిన ఓ పాల వ్యాపారి కొడుకైన దీపక్‌‌ ఊహకందని వేగంతో రెజ్లింగ్‌‌లో సూపర్‌‌ స్టార్‌‌ అయిపోయాడు. 2016లో క్యాడెట్‌‌ వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ గోల్డ్‌‌ మెడల్‌‌ గెలిచి అందరి దృష్టిని ఆకర్షించిన దీపక్‌‌ 2018లో సీనియర్‌‌ లెవెల్‌‌లో ఒకేఒక్క మెడల్‌‌ గెలిచాడు. కానీ ఈ సీజన్‌‌ ప్రారంభంలో జూనియర్‌‌ వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌తోపాటు సీనియర్‌‌ లెవెల్‌‌లో రెండేసి సిల్వర్‌‌, బ్రాంజ్‌‌ మెడల్స్‌‌ గెలిచాడు. ఇందులో ఒక రజతం వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో సాధించగా, ఒలింపిక్‌‌ కోటా కూడా దక్కించుకున్నాడు. గాయం వల్ల వరల్డ్‌‌ టైటిల్‌‌ బౌట్‌‌కు దూరమైన దీపక్‌‌ బరిలోకి దిగుంటే గోల్డ్‌‌ మెడల్​సాధించేవాడు. అయితే రెజ్లింగ్‌‌ గవర్నింగ్‌‌ బాడీ అయిన యునైటెడ్‌‌ వరల్డ్‌‌ రెజ్లింగ్‌‌(యూడబ్ల్యూబ్ల్యూ) దీపక్‌‌కు జూనియర్‌‌ రెజ్లర్‌‌ ఆఫ్‌‌ ద ఇయర్‌‌ అవార్డు ఇచ్చింది. 86 కేజీ కేటగిరిలో వరల్డ్‌‌ నంబర్‌‌ వన్‌‌గా ఉన్న దీపక్‌‌ ఒలింపిక్‌‌ మెడల్‌‌ తీసుకొస్తాడని యావత్​ దేశం ఆశలు పెట్టుకుంది. రెజ్లింగ్‌‌ టీవీ నిర్వహించిన పోల్‌‌లో బెస్ట్‌‌ మేల్‌‌ రెజ్లర్‌‌గా దీపక్‌‌ నిలిచాడంటే అంచనాలను అర్థం చేసుకోవచ్చు.

సత్తా చాటిన బజ్‌‌రంగ్‌‌

స్టార్‌‌ రెజ్లర్‌‌ బజ్‌‌రంగ్‌‌ పునియా కూడా అంచనాలను అందుకున్నాడు. వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ మినహా బరిలోకి దిగిన ప్రతీ పోటీలోనూ విజేతగా నిలిచాడు. డాన్‌‌ కొలవ్‌‌, ఏషియన్‌‌ చాంపియన్‌‌షిప్‌‌, అలీ అలివ్‌‌ అండ్‌‌ యసర్‌‌ డొగో టోర్నీల్లో గోల్డ్‌‌ మెడల్స్‌‌ గెలిచాడు. అయితే అతని విజయ పరంపరకు వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో బ్రేక్‌‌ పడింది. వరల్డ్‌‌ నంబర్‌‌ వన్‌‌గా భారీ అంచనాలతో బరిలోకి దిగిన బజ్‌‌రంగ్‌‌ లెగ్‌‌ డిఫెన్స్‌‌ వైఫల్యాన్ని ప్రత్యర్థులు సొమ్ము చేసుకున్నారు. సెమీఫైనల్లో పునియా 9–9తో సమానంగా నిలిచినప్పటికీ రెఫరీలు.. లోకల్‌‌ రెజ్లర్‌‌ నియజ్బెకోవ్‌‌ను విజేతగా ప్రకటించడం తీవ్ర వివాదం రేపింది. దీనిపై బజ్‌‌రంగ్‌‌ ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దాంతో, ఈ మెగా టోర్నీలో స్వర్ణం నెగ్గాలన్న కలను నెరవేర్చుకోలేకపోయిన బజ్‌‌రంగ్‌‌.. కాంస్య పతక బౌట్‌‌లో గెలిచి సంతృప్తి చెందాల్సి వచ్చింది. ప్రస్తుతం రెండో ర్యాంక్‌‌లో ఉన్న బజ్‌‌రంగ్‌‌ డిఫెన్స్‌‌ను మెరుగుపర్చుకునేందుకు రష్యాకు చెందిన విక్టొర్‌‌ రాస్సాడిన్‌‌తో కలిసి ట్రైనింగ్‌‌ తీసుకుంటున్నాడు. రవిపై భారీ అంచనాలు..

57 కేజీ కేటగిరీలో టోక్యో టికెట్‌‌దక్కించుకున్న రవి కుమార్‌‌ దహియా ఈ ఏడాది మెరిసిన మరో రెజ్లర్‌‌. అతనిపై కూడా ఒలింపిక్స్‌‌లో భారీ అంచనాలున్నాయి. హర్యానాలోని ఓ సాధారణ కుటుంబానికి చెందిన 22 ఏళ్ల రవి వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో బ్రాంజ్‌‌ మెడల్‌‌ గెలిచి ఆశ్చర్యపరిచాడు. అయితే ప్రొ లీగ్‌‌లో రవిని చూసిన వాళ్లకి అతని సత్తా ఏమిటో ముందే తెలుసు. తిరుగులేని టెక్నిక్‌‌, బలమైన డిఫెన్స్‌‌ రవి సొంతం. ఇక, 61 కేజీ కేటగి రీ(నాన్‌‌ ఒలింపిక్‌‌)లో రాహుల్‌‌ అవారే వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో బ్రాంజ్‌‌ గెలిచి సంచలనం సృష్టించాడు.

ఆశలు పెంచిన వినేశ్‌‌

రియో ఒలింపిక్స్‌‌లో గాయపడి కొన్నాళ్లు ఆటకు దూరమైన స్టార్‌‌ వినేశ్‌‌ ఫొగట్‌‌కు ఈ ఏడాది కలిసొచ్చింది. కెరీర్‌‌లో తొలి వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ మెడల్‌‌ నెగ్గడంతో పాటు వచ్చే ఒలింపిక్స్‌‌లో ఇండియా ఆశలు మరింత పెంచింది. అయితే 53 కేజీ కేటగిరీలో భారీ పోటీ ఉండడంతో ఒలింపిక్‌‌ మెడల్‌‌ గెలవడం వినేశ్‌‌కు అంత ఈజీ కాదనిపిస్తోంది. కానీ వరల్డ్‌‌ టాప్‌‌ రెజ్లర్స్‌‌పై ఈ ఏడాది ఆమె విజయాలు సాధించడం సానుకూలాంశం. రెజ్లింగ్‌‌ టీవీ నిర్వహించిన సర్వేలో ఈ ఏటి మేటి మహిళా రెజ్లర్‌‌గా నిలిచిన వినేశ్‌‌ మానసికంగా సిద్ధమై, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటే ఒలింపిక్స్‌‌లో తిరుగుండదు.

నిరాశపరిచిన సుశీల్‌‌, సాక్షి

రెండు ఒలింపిక్‌‌ మెడల్స్‌‌ గెలిచిన సుశీల్‌‌ కుమార్‌‌, రియో బ్రాంజ్‌‌ మెడలిస్ట్‌‌ సాక్షి మాలిక్‌‌ ఈ ఏడాది తీవ్ర నిరాశపరిచారు. నేషనల్‌‌ ట్రయల్స్‌‌ ద్వారా వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌కు అర్హత సాధించిన వీరిద్దరూ తొలి రౌండ్‌‌లు దాటలేకపోయారు. 36 ఏళ్ల సుశీల్‌‌ త్వరలోనే భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే చాన్స్‌‌ ఉండగా, సాక్షి(27) విషయం ఆందోళన కలిగిస్తుంది. రియో ఒలింపిక్స్‌‌ తర్వాత ఆమె పెర్ఫామెన్స్‌‌ క్రమంగా దిగజారుతోంది. టార్గెట్‌‌ ఒలింపిక్‌‌ పోడియం స్కీమ్‌‌(టీఓపీఎస్‌‌)నుంచి కూడా ఆమెను తప్పించారు. అయితే 62 కేజీ కేటగిరీలో నేషనల్‌‌ టైటిల్‌‌ గెలిచి సీజన్‌‌ను పాజిటివ్‌‌గా ముగించింది.