ఇంటర్​లో ఫెయిలయ్యామని ముగ్గురు ఆత్మహత్య

ఇంటర్​లో ఫెయిలయ్యామని ముగ్గురు ఆత్మహత్య
  • నల్గొండ, భూపాలపల్లి, నిజామాబాద్​లో ఘటనలు
     

నల్గొండ క్రైం/ చిట్యాల/ నిజామాబాద్/ కమలాపూర్, వెలుగు:  ఇంటర్​లో ఫెయిలయ్యామన్నా బాధతో ముగ్గురు స్టూడెంట్లు ఆత్మహత్య చేసుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన జాహ్నవి రైలు కింద పడి.. జయశంకర్​ భూపాలపల్లి జిల్లాకు చెందిన వరుణ్, నిజామాబాద్​ జిల్లా అర్సపల్లికి చెందిన ధనుష్  ఉరి వేసుకొని ప్రాణాలు విడిచారు. కరోనా కారణంగా క్లాసులు సరిగ్గా జరగలేదని, అయినా పరీక్షలు పెట్టి ఇట్లా ఫెయిల్​ చేసి తమ బిడ్డల ప్రాణాలు తీసుకున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.  

రైలుకు ఎదురుగా వెళ్లి..!
నల్గొండ జిల్లా గాంధీనగర్​కు చెందిన జాహ్నవి (16) స్థానిక గౌతమి కాలేజీలో ఇంటర్​ చదువుతున్నది. గురువారం విడుదలైన  ఫస్టియర్​ రిజల్ట్స్​లో ఆ అమ్మాయి మ్యాథ్స్​లో ఫెయిలైంది. అన్ని సబ్జెక్టుల్లో 56 శాతం మార్కులు వస్తే.. మ్యాథ్స్​లో చాలా  తక్కువ వచ్చాయి. తాను బాగానే రాసినా ఎందుకు ఫెయిలయ్యానని కలత చెందిన జాహ్నవి శుక్రవారం ఉదయం 5 గంటలకు ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్లి రైల్వే స్టేషన్​ వద్ద  ఎదురుగా వస్తున్న రైలుకు  ఎదురుగా నిలబడి ఆత్మహత్య చేసుకుంది. 

ఉరేసుకొని ఇద్దరు..
జయశంకర్​ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగకు చెందిన కొల్లూరి బాబు, పూల దంపతుల కొడుకు వరుణ్​(19) హనుమకొండలో ఉంటూ ఇంటర్​ చదువుతున్నాడు. తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం హైదరాబాద్​ వెళ్లి అక్కడే ఉంటున్నారు. కరోనా కారణంగా క్లాస్​లు సరిగ్గా జరగక ఇంటర్​ పరీక్షలను వరుణ్​ సరిగా రాయలేదు. ఫస్టియర్​లో అన్ని సబ్జెక్టుల్లో ఫెయిలైనట్లు వచ్చింది. దీంతో వరుణ్​ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. హనుమకొండలోని తన సమీప బంధువు దగ్గర డబ్బులు తీసుకొని, ఇంటికి వెళ్లి వస్తానని చల్లగరిగకు వచ్చాడు. ఇంటి వద్ద ఉంటున్న తాత పోశయ్య ఇంటికి తాళం వేసి పనికి వెళ్లాడు. వరుణ్​ ఇంటి తలుపులను పైకి లేపి.. లోపలికి వెళ్లి ఉరేసుకున్నాడు.  నిజామాబాద్​ జిల్లా​అర్సపల్లికి చెందిన ధనుష్  ఓ ప్రైవేట్ కాలేజీలో  ఇంటర్ చదువుతున్నాడు. ఇంటర్  ఫస్టియర్​ ఫలితాల్లో ధనుష్  మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరేసుకున్నాడు.

నల్గొండలో స్టూడెంట్​ సంఘాల ఆందోళన
ఇంటర్​ రిజల్ట్స్​ను ఇష్టమున్నట్లు ప్రకటించి పిల్లల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నదని స్టూడెంట్​ లీడర్లు మండిపడ్డారు. జాహ్నవి ఆత్మహత్య విషయం తెలుసుకొని నల్గొండలోని ఇంటర్మీడియట్​ ఆఫీసు ఎదుట ఎస్​ఎఫ్ఐ లీడర్లు ఆందోళనకు దిగారు. ఇంటర్​ స్టూడెంట్లకు పాఠాలు చెప్పకుండా టెస్టులు ఎట్లా నిర్వహిస్తారని వారు నిలదీశారు. జాహ్నవిది ఆత్మహత్య కాదని, ప్రభుత్వ హత్య అని ఎస్​ఎఫ్​ఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆకారం నగేశ్​ అన్నారు. జాహ్నవి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్​గ్రేషియా ప్రకటించాలని డిమాండ్​ చేశారు.

బిల్డింగ్ ​పైనుంచి దూకిన స్టూడెంట్​.. కాపాడిన ఫ్రెండ్స్
హనుమకొండ జిల్లాలోని పసరగొండకు చెందిన ఓ అమ్మాయి కమలాపూర్​ మండల కేంద్రంలోని మోడల్​ స్కూల్​లో ఇంటర్​ చదువుతున్నది. ఇంటర్​ రిజల్ట్స్​లో తాను ఫెయిలైనట్లు రావడంతో తీవ్రంగా కలత చెంది.. శుక్రవారం మధ్యాహ్నం లంచ్​ టైంలో హాస్టల్​ బిల్డింగ్​ మొదటి అంతస్తు పైనుంచి దూకింది. గమనించిన తోటివారు వెంటనే చేతులు అడ్డుగా పెట్టి పట్టుకునేందుకు ప్రయత్నించారు. స్వల్ప గాయాలతో ఆ అమ్మాయి ప్రాణాలతో బయటపడింది.