ఆన్​లైన్​ గేమింగ్​ కంపెనీలకు అనుమతులు ఇవ్వం : మంత్రి రాజీవ్​ చంద్రశేఖర్

ఆన్​లైన్​ గేమింగ్​ కంపెనీలకు అనుమతులు ఇవ్వం : మంత్రి రాజీవ్​ చంద్రశేఖర్

స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
ఆన్​లైన్​ గేమింగ్​ కంపెనీలకు రిజిస్ట్రేషన్​ తప్పనిసరి
కార్యాలయం ఫిజికల్​ అడ్రస్​నూ వెరిఫికేషన్​ చేయించుకోవడం కూడా తప్పదు


న్యూఢిల్లీ : ఇక నుంచి గేమ్​ రిజల్ట్​పై పందెం కాయడానికి ఆన్​లైన్​ గేమింగ్​ కంపెనీలకు అనుమతులు ఇవ్వబోమని కేంద్ర ఎలక్ట్రానిక్స్​, ఐటీశాఖల సహాయ మంత్రి రాజీవ్​ చంద్రశేఖర్​ ప్రకటించారు. ఈ విషయాన్ని సంబంధిత బిల్లు ముసాయిదాలోనూ చేర్చామని తెలిపారు. అన్ని గేమింగ్​ కంపెనీలు సెల్ఫ్​ రెగ్యులేటరీ మెకానిజం కింద రిజిస్ట్రేషన్​ చేసుకోవాలని స్పష్టం చేశారు. దీనివల్ల అవి రూల్స్​ను తూచ తప్పకుండా పాటిస్తాయని అన్నారు. రూల్స్​ను ఉల్లంఘిస్తే సెల్ఫ్​రెగ్యులేటరీ సంస్థ తగిన చర్యలు తీసుకుంటుందని చంద్రశేఖర్​ వివరించారు. కొత్త నిబంధనల ప్రకారం, సంస్థల వెరిఫికేషన్​తోపాటు ఆఫీసు చిరునామాను కచ్చితంగా చెక్​ చేస్తారు. సోషల్ మీడియా ప్లాట్‌‌ఫారమ్‌‌ల కోసం 2021లో జారీ చేసిన కొత్త ఐటీ నిబంధనలు ఆన్‌‌లైన్ గేమింగ్ కంపెనీలు కూడా వర్తిస్తాయి. ఆన్‌‌లైన్ గేమింగ్ ప్లాట్‌‌ఫారమ్‌‌లు జూదం లేదా బెట్టింగ్‌‌కు సంబంధించి చట్టంలోని అన్ని రూల్స్​ను తప్పనిసరిగా పాటించాలి. గేమర్​కు సంబంధించిన వయోపరిమితి నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. ముసాయిదా సవరణలు ఆన్‌‌లైన్ గేమింగ్ పరిశ్రమ అభివృద్ధికి సాయపడతాయని ప్రభుత్వం పేర్కొంది. భారత చట్టాలకు అనుగుణంగా లేని ఆన్‌‌లైన్ గేమ్‌‌ను హోస్ట్ చేయడం, ప్రదర్శించడం, అప్‌‌లోడ్ చేయడం, ప్రచురించడం, ప్రసారం చేయడం వంటివి నేరమని స్పష్టం చేసింది.  ఇక నుంచి కంపెనీలు అన్నీ ఆన్‌‌లైన్ గేమ్‌‌లపై రిజిస్ట్రేషన్ గుర్తును ప్రదర్శించాలి.   కేంద్రం ఎలక్ట్రానిక్స్  ఐటీ మంత్రిత్వ శాఖ ఈ ముసాయిదాపై ప్రజల అభిప్రాయాలను ఆహ్వానించింది. ఇందుకు జనవరి 17 వరకు గడువు ఇచ్చింది. 

డీపీడీసీ ముసాయిదా బాగుంది...
డిజిటల్​ పర్సనల్​ డేటా ప్రొడక్షన్​ (డీపీడీపీ) ముసాయిదాను ఇంటర్నెట్​ అండ్​ మొబైల్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా (ఐఏఎంఏఐ) ప్రశంసించింది. ఇది పరిశ్రమకు తప్పకుండా మేలు చేస్తుందని పేర్కొంది. క్రాస్​ బార్డర్​ డేటా ఫ్లోలకు ఇది మరింత అనువైన ఫ్రేమ్​వర్క్​ అని పేర్కొంది. దీనివల్ల సరిహద్దు వాణిజ్యం పెరుగుతుందని తెలిపింది. అయితే బిల్లులోని నిబంధనల అమలు ఎప్పుడు ఉంటుందో స్పష్టంగా తెలియజేయాలని ఐఏఎంఏఐ కోరింది. దీనివల్ల తమ సభ్యులు చట్టాన్ని సక్రమంగా అమలు చేయగలుగుతారని పేర్కొంది. చిన్నారుల డేటా సేకరణకు సంబంధించిన నిబంధనలు, విధానాలను ఎప్పుడు చేస్తారనే విషయమై స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదని అభ్యంతరం తెలిపింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక రోడ్​మ్యాప్​ను ప్రకటించగలిగితే బిల్లు చట్టరూపంలోకి రాగానే ఐఏఎంఏఐ సభ్యులు వాటిని అమలు చేయడానికి సిద్ధంగా ఉంటారని తెలిపింది. తల్లిదండ్రుల అనుమతి విషయంలో కొంత సరళంగా వ్యవహరించాలని సూచించింది.   యువతకు సేవలను అందించే రంగాలకు ఈ బిల్లు వల్ల ఇబ్బంది ఉండవచ్చన్న కామెంట్స్​సరికాదని స్పష్టం చేసింది. సంప్రదింపులు,  సహకారం ద్వారా డిజిటల్ ఎకోసిస్టమ్​లో పెట్టుబడి పెట్టే  వాటాదారులకు సహాయం చేసేలా చట్టం మారుతుందన్న నమ్మకం కలుగుతోందని ఐఏఎంఏఐ పేర్కొంది. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు (డీపీడీపీ) వల్ల  పరిశ్రమకు ఎన్నో లాభాలు ఉంటాయని తెలిపింది.  టెక్ స్టార్టప్‌‌లు మరింత ఎదగడానికి అవకాశాలు కల్పించడంతోపాటు డేటానూ పరిరక్షించగలుగుతుందని ప్రశంసించింది.  డీపీడీపీలోని డేటా ప్రొటెక్షన్ ఫ్రేమ్‌‌వర్క్‌‌ని మార్చడం వల్ల ఇన్నోవేషన్​, ఎకనమీ గ్రోత్​మధ్య సమతౌల్యం ఏర్పడుతుందని ఈ సంస్థ పేర్కొంది.

విమర్శలూ ఉన్నాయ్​..

డేటా ప్రొటెక్షన్​ బిల్లు వల్ల మంచితో పాటు చెడూ ఉందని ఇండస్ట్రీ సంస్థ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ ఇండస్ట్రీ ( ఐటీఐ) విమర్శించింది. ఈ చట్టం ద్వారా ప్రభుత్వానికి  విపరీతమైన అధికారాలు వస్తాయని ఆందోళన ప్రకటించింది. ఫలితంగా మనదేశంలో డేటా సెంటర్లు, డేటా ప్రాసెసింగ్​ బిజినెస్​లలో పెట్టుబడులు పెట్టడం కంపెనీలకు కష్టతరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో బిల్లులోని నిబంధనల నుంచి ప్రభుత్వానికి మినహాయింపులు ఉండటాన్ని కూడా వ్యతిరేకించింది. దీనివల్ల కొన్ని సందర్భాల్లో సమాచారాన్ని తీసుకోవడానికి గల కారణాలను ప్రభుత్వం వ్యక్తులకు తెలియజేయాల్సిన అవసరం లేదు. అవసరమైతే చిన్నారుల సమాచారాన్నీ తీసుకోవచ్చు. డేటా ఆడిటర్​నూ నియమించుకోవచ్చు. సమాచారం ఎందుకు తీసుకున్నారని సహ చట్టం కింద అడిగినా వివరాలు అందించే నిబంధన ఈ బిల్లులో లేదని పేర్కొంది. ట్రాకింగ్​, బిహేవియర్​, మానిటరింగ్​, టార్గెట్​ అడ్వర్టైజింగ్​ అంశాల్లో చిన్నారులకు హాని చేసే డేటా ప్రాసెసింగ్​ కార్యకలాపాలపై మాత్రమే నిషేధం విధించాలని కోరింది. గూగుల్​, మైక్రోసాఫ్ట్​, మెటా, ట్విటర్, యాపిల్​ వంటి కంపెనీలు ఐటీఐలో మెంబర్లు.