ఎన్డీఏలోకి జగన్? కేంద్రంలో మూడు పదవులు?

ఎన్డీఏలోకి జగన్? కేంద్రంలో మూడు పదవులు?
  • 40 నిమిషాలపాటు కొనసాగిన చర్చ..
  • కరోనా టైంలో జగన్ కు మాత్రమే పీఎం అపాయింట్​మెంట్
  • కేబినెట్ బెర్తులపై కేంద్రం పెద్దలతో ఏపీ సీఎం మంతనాలు

న్యూఢిల్లీ, వెలుగు: నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లోకి ఏపీ సీఎం వైఎస్ జగన్ చేరుతున్నారన్న వార్తలపై ఢిల్లీలో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీతో జగన్ భేటీ అయ్యారని జోరుగా ప్రచారం సాగుతోంది. కరోనా వ్యాప్తి వల్ల ఆరు నెలలుగా అత్యంత పకడ్బందీగా మోడీ షెడ్యూల్, టూర్స్ డిసైడ్ అవుతున్నాయి. కేబినెట్ మీటింగ్స్ కూడా వర్చువల్స్ కాన్ఫరెన్స్ ద్వారానే జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో కేవలం జగన్ కు మాత్రమే మోడీ కలిసేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వడం, దాదాపు 40 నిమిషాలపాటు వన్ టు వన్ చర్చించుకోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగానే ఆకస్మికంగా ఢిల్లీ పర్యటన చేపట్టిన జగన్.. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు.

ప్రధానంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో వరుసగా భేటీ అయ్యారు. కరోనా ట్రీట్​మెంట్ తీసుకొని రెస్ట్ లో ఉన్న అమిత్ షా కూడా.. జగన్ కు వరుసగా రెండు రోజులు అపాయింట్​మెంట్ ఇవ్వడం ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. రెండు సార్లు భేటీ అయిన వీరిద్దరూ అత్యంత సీక్రెట్​గా చర్చలు జరిపారు. దీంతో ఎన్డీఏలోకి జగన్ రాక కోసమే ఈ మీటింగ్స్ అనే ప్రచారం జరుగుతోంది. అమిత్ షానే జగన్ ను ఢిల్లీకి పిలిపించారన్న ప్రచారాలు ఉన్నాయి.

బీజేపీకి మిత్రుల దూరం

తాజాగా తీసుకొచ్చిన చట్టాలు, ఊహించని పరిణామాలతో బీజేపీకి దాదాపు 35 ఏళ్ల చిరకాల మిత్రులు దూరం అయ్యారు. వ్యవసాయ చట్టాలకు నిరసనగా శిరోమణి అకాలీ దళ్.. కాషాయ కూటమితో తెగదెంపులు చేసుకుంది. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత మరోమిత్ర పక్షం శివసేన కూడా ఎన్డీఏతో కటిఫ్ చెప్పింది. అదీగాక త్వరలో జరగబోయే బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించినా.. నితీశ్ కుమార్ ఎలా వ్యవహరిస్తారనేది అంచనా వేయలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో బీజేపీకి బలమైన మిత్రుడి అవసరం ఉంది. దీంతో 22 మంది లోక్ సభ ఎంపీలు, ఆరుగురు రాజ్యసభ ఎంపీలు ఉన్న వైసీపీని ఎన్డీఏలోకి ఆహ్వానించాలని బీజేపీ భావిస్తోంది. జగన్ కు కూడా కేంద్రంతో ఫ్రెండ్​షిప్ అవసరం ఉంది. అందుకే ముందు నుంచీ కేంద్రం విషయంలో సాఫ్ట్ గానే ఉంటున్నారు. దీంతో ఎన్డీఏలో చేరే అంశంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఒకవేళ కేంద్రంతో జత కడితే ఎలా ఉంటుందని రాష్ట్ర మంత్రి వర్గ సహచరులు, నమ్మకమైన ఎంపీలతో జగన్ సమావేశం నిర్వహించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

కొన్ని డిమాండ్స్ పెట్టిన వైసీపీ

ఎన్డీఏ గూటికి చేరేందుకు జగన్ సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అయితే పలు ప్రపోజల్స్ కేంద్రం ముందు జగన్ ఉంచినట్లు ఢిల్లీలో చర్చ జరగుతోంది. ‘ఏపీకి ప్రత్యేక హోదా’ డిమాండ్ తో భారీ మెజార్టీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ప్రత్యేక హోదా లేక ఆ స్థాయి హామీ లేకుండా ఎన్డీఏలో చేరితే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తే అవకాశం ఉందని ప్రధానికి జగన్ వివరించినట్లు సమాచారం. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి ఎన్డీఏ నుంచి బయటకు రావాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్.. అప్పటి సీఎం చంద్రబాబును డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు టీడీపీ ఈ అంశంపై వైఎస్సార్ సీపీని ఇరుకునపెట్టే అవకాశం ఉందని, ఇదే అస్త్రంతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుందని ప్రధాని, కేంద్ర మంత్రుల దృష్టికి తెచ్చినట్లు తెలుస్తోంది. ఇక అమరావతి భూముల కుంభకోణం, ఫైబర్ గ్రిడ్ పై విచారణ జరిపి చర్యలు తీసుకునేలా కచ్చితమైన హామీ ఇవ్వాలని జగన్ కోరినట్లు ప్రచారం జరుగుతోంది.

మూడు పదవులు?

కేబినెట్ బెర్తుల అంశంపై ప్రధానితో జరిగిన భేటీలో క్లారిటీ వచ్చినట్లు వైఎస్సార్ సీపీకి చెందిన నేతలు చెబుతున్నారు. కేబినెట్ పోర్ట్ ఫోలియోపై సమగ్ర చర్చలుజరిపినట్లు తెలుస్తోంది. త్వరలో జరగబోయే కేబినెట్ విస్తరణలో వైఎస్సా ర్ సీపీకి ఒక కేబినెట్ హోదా, రెండు సహాయ మంత్రి పదవులు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.