మాట్లాడితే బూతులు, ప్రశ్నిస్తే దాడులు..హైకమాండ్ అండతో రెచ్చిపోతున్న ఎమ్మెల్సీ కౌశిక్​ రెడ్డి

మాట్లాడితే బూతులు, ప్రశ్నిస్తే దాడులు..హైకమాండ్ అండతో రెచ్చిపోతున్న ఎమ్మెల్సీ కౌశిక్​ రెడ్డి

కరీంనగర్, వెలుగు: ఎమ్మెల్సీ, మండలి విప్ పాడి కౌశిక్ రెడ్డి తరచూ ఏదో కాంట్రవర్సీలో ఇరుక్కోవడం.. వార్తల్లో నిలవడం ఈ మధ్య కాలంలో రోటీన్ అయ్యింది. ఆయన నోరు తెరిస్తే బూతులే.. సభ్యత, సంస్కారం మరిచి ఎదుటి వాళ్లను తిట్టుడే. ప్రాతినిధ్యం వహించేది పెద్దల సభకే అయినా ఆయన మాటలు గల్లీ లీడర్ కన్నా అధ్వానంగా ఉంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. తన ఉన్నత హోదాను మరిచి కింది స్థాయి సర్పంచులను, చోటామోటా లీడర్లను, మండల స్థాయి జర్నలిస్టులను టార్గెట్ చేస్తూ తన నోటి దురుసుతో తన స్థాయిని రోజురోజుకూ దిగజార్చుకుంటున్నారు. ప్రశ్నిస్తే కిడ్నాపులకు పాల్పడి బెదిరింపులకు గురిచేస్తారనే టాక్ నియోజకవర్గంలో ఉంది. ఈ ఏడాది జనవరి 26న గవర్నర్ తమిళిసై పై చేసిన అసభ్యకరమైన కామెంట్స్ నుంచి మొదలుకుంటే తాజాగా జీఎస్ ఆర్ యూట్యూబ్ చానల్ కెమెరామన్ బండి అజయ్ ను బంధించి దుర్భాషలాడే వరకు గత ఐదు నెలల్లో అనేక వివాదాలకు కౌశిక్ రెడ్డి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. 

జనవరి 26న గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ ఫైళ్ల గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత జాతీయ మహిళా కమిషన్ సీరియస్ కావడంతో గవర్నర్ కు రాతపూర్వకంగా క్షమాపణ చెప్పారు. ఆ తర్వాత ఏప్రిల్ రెండోవారంలో మురికి కాల్వ విషయంలో హుజూరాబాద్ మండలం జూపాక పంచాయతీ సెక్రటరీ తోటరాజుకు, ప్రహరీ విషయంలో ఇదే మండలంలోని రంగాపూర్ పంచాయతీ సెక్రటరీకి ఫోన్ లో ధమ్కీ ఇచ్చారు. యూజ్ లెస్ ఫెలో... పని చేయాలని ఉందా లేదా అని బెదిరించారు. 

జూన్ 3న హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఆబాది జమ్మికుంటలో రైతు దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని నష్టపోయిన పంటలకు పరిహారం ఎప్పుడిస్తారని ఓ రైతు అడిగాడు. దీంతో రైతుపై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘నీకు సిగ్గు శరం లేదా, రైతు బంధు, పింఛన్ తీసుకోవడంలేదా?’ అంటూ నోరు జారారు.  

మే నెలలో సీఎం కప్ ప్రోగ్రామ్ సందర్భంగా ఓ మహిళా అధికారిపై ఎమ్మెల్సీ అనుచిత వ్యాఖ్యలు చేస్తుండగా.. ఓ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ వీడియో రికార్డు చేశాడని తెలిసింది. దీంతో అతడి సెల్ ఫోన్ లాక్కుని, బెదిరించి వీడియో డిలీట్ చేసి ఇచ్చారని సమాచారం. చెల్పూర్  సర్పంచ్ నేరెళ్ల మహేందర్ గౌడ్ పై అక్రమ కేసులు బనాయించడమేగాక పోలీసులతో కొట్టించారనే ఆరోపణలు ఉన్నాయి.  

ఈ నెల 21న అమరవీరుల స్థూపం కూల్చివేతతో మరోసారి ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక హుజూరాబాద్ అంబేద్కర్ సెంటర్ లో అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేశారు.  జూన్ 2న ఆ  స్థూపం వద్దే అమరులకు నివాళి అర్పించేవారు. ఈ క్రమంలోనే హుజూరాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో డివైడర్ పైన మరో స్థూపాన్ని నిర్మించారు. పాత స్థూపంపై తన పేరు లేదనే  నెపంతోనే ఎమ్మెల్సీ ప్రోద్బలంతోనే  కొత్త స్థూపాన్ని నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. కొత్త స్థూపం ఆవిష్కరణకు ముందే ఈ నెల 21న రాత్రి పాత స్థూపాన్ని కూల్చివేశారు. 

కొత్తగా నిర్మించిన అమరవీరుల స్థూపం ఆవిష్కరణ కార్యక్రమాన్ని కవర్​ చేసేందుకు ఈ నెల 22న జీఎస్ ఆర్ యూట్యూబ్ చానల్  కెమెరామన్​ బండి అజయ్ హుజూరాబాద్ వెళ్లాడు. అక్కడ ఓ మహిళ.. ఎమ్మెల్సీ కౌశిక్​ రెడ్డిని సంక్షేమ పథకాలు రావడం లేదని అడుగుతున్న విషయా న్ని కెమెరాలో రికార్డు చేస్తుండగా కౌశిక్​ అనుచరులు వచ్చి  తనను కారులో తీసుకెళ్లి దాడి చేశారని అజయ్ ఆరోపించారు. అజయ్​ను  కౌశిక్ రెడ్డి తిట్టిన బూతులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ముదిరాజ్ కులస్తులను బండబూతులు తిట్టడం వివాదాస్పదంగా మారింది. కౌశిక్ నుంచి ప్రాణహాని ఉందని అజయ్ శుక్రవారం హుజూరాబాద్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

అభ్యర్థిగా కన్ఫమ్​ అయిన తర్వాత.. మరింతగా

గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని జాతీయ మహిళా కమిషన్ మందలించింది. కానీ బీఆర్ఎస్ అధిష్ఠానం మాత్రం ఆ తర్వాతే మరింత ప్రయార్టీ ఇస్తూ వచ్చింది. జనవరి 31న జమ్మికుంటలో నిర్వ హించిన బహిరంగ సభలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డినే అభ్యర్థిగా కన్ఫమ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకే ప్రభుత్వం ఆయనకు మండలిలో విప్ గా పదవి కట్టబెట్టిం ది. ఆ తర్వాత అనేక వివాదాలకు కేంద్ర బిందు వుగా మారారు. దీంతో బీఆర్ ఎస్ హైకమాండ్ అండతోనే కౌశిక్ రెడ్డి రెచ్చిపోతున్నారనే చర్చ హుజూరాబాద్ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.

భగ్గుమన్న ముదిరాజ్​లు

నెట్​వర్క్​, వెలుగు :  ఎమ్మెల్సీ పాడి కౌశిక్​రెడ్డిపై ముదిరాజ్​లు భగ్గుమన్నారు. తెలంగాణవ్యాప్తంగా రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. ఆయన దిష్టిబొమ్మలను దహనం చేసి.. వెంటనే ముదిరాజ్​లకు క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. ఆందోళనలో పలుచోట్ల బీఆర్ఎస్ లీడర్లు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనడం విశేషం. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ముదిరాజ్ కులస్తులు ఆందోళనలకు దిగారు. గన్నేరువరంలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. రామడుగు, ఇల్లందకుంట, హుజూరాబాద్, సైదాపూర్,చిగురుమామిడి మండల కేంద్రాల్లోనూ ఆందోళన జరిగింది. 

ఖమ్మంలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను ఊరేగించి జడ్పీ సెంటర్ లో దహనం చేశారు. ఉమ్మడి మెదక్​ జిల్లా వ్యాప్తంగా కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఉమ్మడి వరంగల్​ జిల్లాలోని ములుగు, జనగామ, భూపాలపల్లిల్లో నిరసన ప్రదర్శనలు చేశారు. హైదరాబాద్ లోని బోయిగూడలో ఉన్న రాష్ట్ర ముదిరాజ్ భవన్ లో నాయకులు ఆందోళన చేపట్టారు. ముదిరాజ్ భవన్ నుంచి గాంధీనగర్ పీఎస్ వరకు ర్యాలీగా వెళ్లారు. పీఎస్ లో కంప్లయింట్ చేశారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. శంషాబాద్ బస్టాండ్ నుంచి ఎయిర్ పోర్టు వరకు ముదిరాజ్ సంఘం నేతలు ర్యాలీ తీశారు. ఎయిర్ పోర్టు పీఎస్ లో అతనిపై  కంప్లయింట్ చేశారు.