కేసీఆర్‌‌వి పిల్లి శాపనార్థాలు : మంత్రి పొన్నం ప్రభాకర్

కేసీఆర్‌‌వి పిల్లి శాపనార్థాలు : మంత్రి పొన్నం ప్రభాకర్
  •      ఫ్రస్ట్రేషన్‌లో పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నరు

 కరీంనగర్/రాజన్నసిరిసిల్ల, వెలుగు : మాజీ సీఎం కేసీఆర్ ఫ్రస్ట్రేషన్​లో ఉన్నాడని, కాంగ్రెస్‌కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని, ప్రభుత్వం ‌కూలుతుందని ‌పిల్లి శాపనార్థాలు పెడుతున్నారని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. శుక్రవారం కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో వాకర్స్ తో కలిసి మార్నింగ్ వాక్ చేస్తూ ఓట్లడిగారు. పొన్నం మాట్లాడుతూ గత ఎన్నికల్లో వినోద్‌కుమార్​ను ఓడగొట్టడానికి బండి సంజయ్​తో గంగుల కమలాకర్ కలిసిపోయారని ఆరోపించారు. 

బీఆర్ఎస్ నాయకులు భూకబ్జాలకు‌ పాల్పడి జైలుకు‌పోయారని, ఇంకా ఎవరైనా కబ్జాలకు పాల్పడి ఉంటే భూములు వదిలేయాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.  కరీంనగర్​లో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని మూడేండ్లలో పూర్తి చేయాలనుకుంటున్నామన్నారు. మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ లీడర్​ వెలిచాల రాజేందర్‌‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, లీడర్లు వైద్యుల అంజన్ కుమార్ పాల్గొన్నారు. 

అలాగే సిరిసిల్లలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పొన్నం మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల గడవక ముందు నుంచే ప్రభుత్వం కూలుతోందని అవాకుల చెవాకులు పేలుతున్నారని, ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరి తరం కాదని, టచ్​ చేసి చూడాలన్నారు. సిరిసిల్ల నేతన్నలు అధైర్యపడొద్దని, అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని పొన్నం స్పష్టం చేశారు. చొప్పదండి, వేములవాడ ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్​చార్జి  కేకే మహేందర్ రెడ్డి  పాల్గొన్నారు.