బీజేపీ అధికారంలోకి వచ్చాక పేదల బతుకులు దారుణంగా మారాయి

బీజేపీ అధికారంలోకి వచ్చాక పేదల బతుకులు దారుణంగా మారాయి
  • బీజేపీకి కాంగ్రెస్ రిక్రూట్ మెంట్ ఏజెంట్ గా మారింది 
  • కేరళ సీఎం పినరయి విజయన్ 
  • ఖమ్మంలో వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలకు హాజరు 

ఖమ్మం/ ఖమ్మం టౌన్, వెలుగు : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల బతుకులు దారుణంగా మారాయని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే శక్తి ఒక్క సీపీఎంకు మాత్రమే ఉందన్నారు. ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్ లో గురువారం రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం 3వ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులకు గిట్టుబాటు ధర లేక, కేంద్ర విధానాల కారణంగా బీజేపీ హయాంలో ఇప్పటి వరకు 4 లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. నిరుద్యోగాన్ని రూపుమాపడంలో కేంద్రం విఫలమైందన్నారు. ఎనిమిదేళ్లలో ఇండస్ట్రియల్, సర్వీస్ సెక్టార్ లో 18 లక్షల ఉద్యోగాలు, పబ్లిక్ సెక్టార్ లో 11 లక్షల ఉద్యోగాలకు కోత పడిందన్నారు.  వ్యవసాయ రంగానికి ప్రతి ఏటా బడ్జెట్ లో కేటాయించిన నిధులను కేంద్రం తగ్గిస్తూ వస్తోందని చెప్పారు. మొత్తం బడ్జెట్ లో 5 శాతం నుంచి 3.5 శాతానికి కేటాయింపులు తగ్గించిందని వివరించారు. పీఎం కిసాన్ యోజన లబ్ధిదారుల సంఖ్యను చూస్తేనే స్పష్టమవుతోందన్నారు. 2019లో మొదటి విడతలో కేంద్రం నిధులిచ్చినప్పుడు దేశంలో 11కోట్ల 84 లక్షల మంది లబ్ధిదారులున్నారని, 2022 నాటికి 11వ విడతలో 3 కోట్ల 87 లక్షల మందికి లబ్ధిదారుల సంఖ్య పడిపోయిందని చెప్పారు. తెలంగాణలో 2019లో 39 లక్షల 10 వేల మంది పీఎం కిసాన్ లబ్ధిదారులుంటే, ఇప్పుడు 24 లక్షల 32 వేలకు పడిపోయిందని చెప్పారు.  బీజేపీకి రిక్రూట్ మెంట్ ఏజెంట్ గా కాంగ్రెస్ పని చేస్తోందని విజయన్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఇంటికి పంపించే బాధ్యత సీపీఎం తీసుకుంటుందన్నారు. కేరళలో ఎల్డీఎఫ్ సాధించిన విజయాలను విజయన్ వివరించారు.  

ఈ జనాలను చూస్తే నోళ్లు మూతపడతాయ్​

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ సభకు హాజరైన జనాలను చూస్తే, సీపీఎం లేదనే వాళ్ల నోళ్లు మూతపడతాయన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తో ఎన్ని విభేదాలున్నా, బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పోరాడేందుకు బీఆర్ఎస్ కు మద్దతిస్తున్నామని చెప్పారు. పోడు సాగుదారులకు పట్టాలివ్వకపోతే ఊరుకునేది లేదని కేసీఆర్ కు స్పష్టం చేసినట్టు తెలిపారు. కేరళలో ధాన్యానికి మద్దతు ధరకు రూ.800 బోనస్ కలిపి రూ.2800 చెల్లిస్తున్నారని, తెలంగాణలో కూడా అలాగే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మునుగోడు ఎన్నికల టైంలో అమిత్ షా తమతో మాట్లాడాడని, కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు తమతో జత కట్టాలని కోరాడని తమ్మినేని చెప్పారు. నలుగురు ఎమ్మెల్యేలున్న బీజేపీకి, కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఆలిండియా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సుదర్శన్ పాల్గొన్నారు.