ఆదివాసీ రాష్ట్రపతి నుంచి 5జీ కాల్స్ వరకు.. 2022లో పడ్డ తొలి అడుగులు

ఆదివాసీ రాష్ట్రపతి నుంచి 5జీ కాల్స్ వరకు.. 2022లో పడ్డ తొలి అడుగులు

1. తనను తానే పెండ్లి చేసుకున్న క్షమా బిందు

గుజరాత్ వడోదరాకు చెందిన క్షమా బిందు తనను తానే పెళ్లి చేసుకుని సంచలనం సృష్టించింది. జూన్ 11న  గోత్రిలోని ఓ ఆలయంలో వివాహం చేసుకునేందుకు ముహూర్తం కూడా నిశ్చయమైంది. అయితే ఆమె నిర్ణయం వివాదాస్పదంగా మారింది. క్షమ తీరును తప్పుపట్టిన కొందరు రాజకీయ నేతలు.. పెళ్లి అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో అనుకున్న ముహూర్తానికి రెండు రోజుల ముందే సన్నిహితుల సమక్షంలో ఇంట్లోనే తనను తానే పెండ్లి చేసుకుంది.

2. యూకే ప్రధానిగా తొలి భారత సంతతి వ్యక్తి

బ్రిటన్ పాలనాపగ్గాలు చేపట్టిన భారత సంతతికి చెందిన రిషి సునాక్ రికార్డు సృష్టించారు. లిజ్ ట్రస్ రాజీనామాతో బ్రిటన్ కొత్త ప్రధానిగా సునాక్ నియమితులయ్యారు. బ్రిటన్ లో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో పార్టీ అంతర్గత ఎన్నికల్లో టోరీ సభ్యులు రిషి సునాక్ వైపే మొగ్గు చూపారు. తమ దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించగలరని విశ్వసించారు. దీంతో బ్రిటన్ పగ్గాలు చేపట్టే అరుదైన అవకాశం రిషి సునాక్ ను వరించింది.

3. నింగిలోకి తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-ఎస్ 

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. మరో మైలురాయిని చేరింది. హైదరాబాద్ కు చెందిన ప్రైవేటు కంపెనీ స్కైరూట్ నిర్మించిన తొలి రాకెట్‌ను నింగిలోకి విజయవంతంగా పంపింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ప్రయోగించిన ఈ ప్రయోగం.. దేశంలోనే తొలి ప్రైవేటు రాకెట్‌ ప్రయోగంగా పేరు తెచ్చుకుంది.

4. దేశ తొలి గిరిజన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించి భారతదేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని అలంకరించిన తొలి గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ముర్ము 50 శాతానికి పైగా ఓట్లతో రెండో మహిళా రాష్ట్రపతిగా రికార్డు సృష్టించారు. 2015 -2021 మధ్య జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేసిన ద్రౌపది ముర్ము.. రామ్ నాథ్ కోవింద్ తర్వాత దేశ 15వ రాష్ట్రపతిగా నియమితులయ్యారు. రాష్ట్రపతిగా ముర్ము జూలై 25న ప్రమాణ స్వీకారం చేశారు.

5. బుకర్ ప్రైజ్ గెలుచుకున్న టూంబ్ ఆఫ్ శాండ్ 

ప్రముఖ రచయిత్రి గీతాంజలి శ్రీ ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్‌ను అందుకున్నారు. ఆమె రాసిన హిందీ నవల 'టూంబ్‌ ఆఫ్‌ శాండ్'కు ఈ అవార్డు వరించింది. దీంతో అంతర్జాతీయ బుకర్‌ ప్రైజ్‌ గెలుచుకున్న తొలి హిందీ నవల రచయిత్రిగా ఆమె రికార్డ్ సృష్టించారు.

6. దేశంలో తొలి 'మెటావర్స్‌' రిసెప్షన్‌..

దేశంలోనే తొలిసారి మెటావర్స్ పద్ధతిలో వివాహ రిసెప్షన్ 2022లో జరిగింది. తమిళనాడుకు చెందిన టెక్ నిపుణుడు దినేష్ క్షత్రియన్, జనగనందిని అనే యువతితో ఫిబ్రవరిలో వివాహం జరిగింది. వీరి రిసెప్షన్ ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంధువులు, మిత్రులు వర్చువల్‌ పద్ధతిలో హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. 

7. పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లకు వేతనాలు

మహిళల వేతనాలకు సంబంధించి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దేశ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు వేతనాలు ఇవ్వనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో పాటు మహిళా అంపైర్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది. 

8. తొలి స్వదేశీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ INS విక్రాంత్ 

పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను ప్రధాని నరేంద్ర మోడీ నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో దాన్ని జాతికి అంకితం చేశారు. భారత్‌ ఇప్పటి వరకు నిర్మించిన అతిపెద్ద నౌక కూడా ఇదే కావడం విశేషం. ఈ నౌక నిర్మాణానికి దాదాపు రూ.20వేల కోట్లను ఖర్చు చేసింది. దీంతో పాటు భారత నౌకా దళానికి సరికొత్త గుర్తును కూడా ఆవిష్కరించారు.

9. చెన్నై-బెంగళూరు-మైసూర్ రూట్లో మొదటి వందే భారత్ ట్రెయిన్

చెన్నై- బెంగళూరు- మైసూర్ మార్గంలో మొదటి వందే భారత్ ట్రైన్‌ ప్రారంభమైంది. నవంబర్ 10వ తేదీన ఈ ఎక్స్‌ప్రెస్‌ను అధికారికంగా ప్రారంభించారు. మొత్తం 483 కిలోమీటర్లను కవర్ చేయనున్న ఈ ఎక్స్‌ప్రెస్. ఎన్నికలున్న రాష్ట్రాల్లోనే మొదటగా లాంచ్ చేసింది. అవే గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌. వచ్చే ఏడాది కర్ణాటకలో ఎన్నికలున్న తరుణంలో ఇప్పుడు బెంగళూరులోనూ ఈ సర్వీస్‌లు మొదలు పెట్టనున్నారు. 

10. రెండు గోల్డెన్ గ్లోబ్ నామినేషన్ అందుకున్న RRR

ఆస్కార్స్‌ వైపు ఆర్ఆర్ఆర్  మరో అడుగు వేసింది. రాజమౌళి, జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల అద్భుతం ఆర్‌ఆర్ఆర్‌ .. అధికారికంగా ఆస్కార్స్‌కు నామినేట్‌ కాలేకపోయినా.. నేరుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డుల రేసులో నిలిచే దిశగా మరో అడుగు పడింది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న ఈ సినిమా.. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులకు నామినేట్‌ అయింది.

11. ఏసియన్ గేమ్స్ లోబ్రాంజ్ మెడల్ సాధించిన మనికా బత్రా 

బ్యాంకాక్ లో జరిగిన ఆసియా కప్ టేబుల్ టెన్నిస్ పోటీల్లో భారత ప్లేయర్ మనికా బాత్రా సంచలనం క్రియేట్ చేసింది. ఈ విభాగంలో బ్రాంజ్ మెడల్ అందుకున్న తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. మనిక 11 -6, 6-11, 11-7, 12-10, 4-11, 11-2 స్కోరు తేడాతో విజయం సాధించింది. జపాన్ కు చెందిన హనా హయతను 4-2 పాయిట్ల తేడాతో ఓడించింది.

12. మొదటి డార్క్ స్కై రిజర్వ్ గా హాన్లే డార్క్ స్కై రిజర్వ్. 

లద్దాఖ్ లోని హాన్లేలో దేశంలో మొట్టమొదటి డార్క్ స్కై రిజర్వ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (DST) ప్రకటించింది. అందుకోసం ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, లడఖ్ యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్ లడఖ్ అటానమస్ హిల్ డెవలప్ మెంట్ కౌన్సిల్ మద్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. అందమైన, అత్యంత సహజమైన ఈ ప్రాంతం చాంగ్ తాంగ్ వన్యప్రాణుల అభయారణ్యం పరిధిలో ఉంది. 

13. కాంగ్రెస్  అధ్యక్షుడిగా గాంధీ కుటుంబేతర నేత 

కాంగ్రెస్ చరిత్రలో తొలిసారి పార్టీ అధ్యక్షుడిగా గాంధీ కుటుంబేతర నేత ఎన్నికయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే నియమితులయ్యారు. అధ్యక్ష పదవి కోసం పోటీ పడిన శశి థరూర్ పై ఆయన ఘన విజయం సాధించారు. మొత్తం 9,385 ఓట్లలో ఖర్గేకు 7,897 ఓట్లు రాగా... థరూర్ కు 1,072 ఓట్లు వచ్చాయి. 416 ఓట్లు చెల్లనివిగా పోలయ్యాయి. 24 ఏళ్ల తర్వాత గాంధీయేతర వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన వ్యక్తిగా ఖర్గే నిలిచారు.

14. దేశంలోనే మొదటి 5జీ ఫోన్ కాల్ 

దేశంలో 5జీ సేవలు ఈ ఏడాదిలోనే ప్రారంభమయ్యాయి. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్​.. దేశంలోనే తొలి 5జీ కాల్​ చేశారు. ఐఐటీ మద్రాస్​లో ఏర్పాటు చేసిన దేశీయ 5జీ ట్రయల్​ నెట్​వర్క్ ​సాయంతో ఈ 5జీ కాల్​ చేశారు.

15. కోతుల పేరిట 32 ఎకరాలు

మహారాష్ట్ర ఉస్మానాబాద్‌ జిల్లాలోని ఉప్లా గ్రామంలో కోతుల పేరిట ఏకంగా 32 ఎకరాల భూమి ఉన్న విషయం ఇటీవలే బయటకు వచ్చింది. ఈ గ్రామంలో కోతులను ప్రేమగా చూసుకోవడం, వాటి ఆకలి తీర్చడం సంప్రదాయంగా వస్తోంది. అయితే వీటి పేరు మీద దాదాపు 32 ఎకరాల భూమి ఉన్నట్టు గ్రహించిన గ్రామ అధికారులు... దానికి సంబంధించిన పత్రాలను కూడా గుర్తించారు. అయితే ఆ భూమిని ఎవరు, ఎప్పుడు వానరాల పేరిట రాశారో తెలియదని ఆ గ్రామ సర్పంచ్ చెప్పారు.

16. కామన్ వెల్త్ హైజంప్ లో బ్రాంజ్ మెడల్ 

కామన్‌వెల్త్ క్రీడల్లో హైజంప్‌లో తేజస్విన్‌ శంకర్‌ కాంస్య పతకం సాధించాడు. దీంతో.. కామన్వెల్త్‌ గేమ్స్‌ హైజంప్‌ విభాగంలో దేశానికి పతకం అందించిన తొలి అథ్లెట్‌గా తేజస్విని రికార్డ్ నెలకొల్పాడు. 2.22 మీటర్ల దూరం దూకి మూడో స్థానంలో నిలిచిన తేజస్విని.. జూన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌ షిప్‌లో శంకర్‌ 2.27 మీటర్ల దూరం జంప్‌ చేశాడు. ఆ రికార్డ్‌తో పోలిస్తే, కామన్‌వెల్త్‌తో 0.05 మీటర్ల తేడా వచ్చింది. 

17. 70 ఏళ్ల తర్వాత భారత్లోకి చీతాలు

ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాలను మధ్యప్రదేశ్‌లో ఉన్న కునో నేషనల్ పార్క్‌లో ప్రవేశపెట్టారు. ఈ పులులు భారత్ లో అడుగు పెట్టిన తర్వాత నెల రోజుల పాటు ఈ నేషనల్ పార్క్‌లో ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్‌లో క్వారంటైన్‌ చేశారు. అనంతరం వాటిని జాతీయ పార్కులో విడిచిపెట్టారు.

18. కాన్స్ డాక్యుమెంటరీ ప్రైజ్ గెలిచిన ‘ఆల్ దట్ బ్రీథ్స్’

ఢిల్లీకి చెందిన చిత్రనిర్మాత షౌనక్ సేన్ డాక్యుమెంటరీ ‘ఆల్ దట్ బ్రీత్స్’ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022లో ప్రతిష్టాత్మక L’OEil d’Or అవార్డును కైవసం చేసుకుంది. ‘ది గోల్డెన్ ఐ’ అని కూడా పిలిచే అతిపెద్ద డాక్యుమెంటరీ అవార్డును గెలుచుకుంది. ‘ఆల్ దట్ బ్రీత్స్’ అనేది అనేక అంశాలపై రూపొందించిన సృజనాత్మక డాక్యుమెంటరీ చిత్రం. పక్షులను రక్షించడానికి తమ జీవితాలను అంకితం చేసిన సోదరుల కథ ఇది. 90 నిమిషాల నిడివి గల ఈ డాక్యుమెంటరీ, గాయపడిన పక్షులను, ముఖ్యంగా బ్లాక్‌ కైట్‌లను రక్షించడానికి, చికిత్స చేయడానికి తమ జీవితాలను అంకితం చేసిన తోబుట్టువులు మొహమ్మద్ సౌద్ , నదీమ్ షెజాద్‌లకు సంబంధించింది.

19. ట్రాన్ జెండర్లకు పైలట్లయ్యే ఛాన్సిచ్చిన డీజీసీఏ  

2022లో లింగ సమానత్వం దిశగా మరో ముందుడుగు పడింది. ఇప్పటికే అనేక రంగాల్లో ట్రాన్స్ జెండర్లు అవకాశాలు కల్పిస్తున్న నేపథ్యంలో డీజీసీఏ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో తొలిసారి భారత్ లో ట్రాన్స్ జెండర్లు విమానాలు నడిపేందుకు అవకాశం కల్పించింది. ఈమేరకు దేశంలో ట్రాన్స్ జెండర్లకు విమానాలు నడిపేందుకు అనుమతులివ్వడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్-DGCA మార్గదర్శకాలు జారీచేసింది. కేరళకు చెందిన ఆడమ్ హ్యారీ ప్రయత్నాల కారణంగా DGCA తమ విధానంలో ఈ మార్పులు చేసింది. 

20.  ఫస్ట్ ఇండియన్ కొరియన్ పాప్ స్టార్ గా శ్రేయ లెంకా 

అంతర్జాతీయ పాప్‌ మ్యూజిక్‌ బ్యాండ్‌లలో ‘బ్లాక్‌ స్వాన్‌’ ఒకటి. దక్షిణ కొరియాకు చెందిన ఆ బృందంలో పాడే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న తొలి భారతీయురాలిగా ఒడిశా రాక్‌స్టార్‌ శ్రేయా లెంకా చరిత్ర సృష్టించింది. తమ జట్టులో ఖాళీ అయిన స్థానాల్ని భర్తీ చేయడానికి బ్లాక్ స్వాన్ బ్యాండ్ ప్రపంచవ్యాప్తంగా ఆడిషన్స్‌ నిర్వహించింది. ఇందులో శ్రేయ, బ్రెజిల్‌ అమ్మాయి గ్యాబ్రియెలా దాల్సిన్‌ అర్హత సాధించారు. హిందుస్థానీ సంగీతంలో శిక్షణ తీసుకున్న శ్రేయ పాశ్చాత్య సంగీతాన్ని వీడియోలు చూసి సొంతంగానే నేర్చుకుంది.

21. మొదటిసారిగా హిందీలో ఎంబీబీఎస్ బుక్స్

వైద్య విద్య (ఎంబీబీఎస్ కోర్సు)ను హిందీలో అందించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. హిందీ మాధ్యమంలో ఎంబీబీఎస్ కోర్సు పుస్తకాలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భోపాల్‌లో ఆవిష్కరించారు. దీంతో హిందీలో ఎంబీబీఎస్ కోర్సు ప్రారంభించిన తొలి రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది.

22.  తొలి భారతీయ దళిత కార్డినల్ గా డాక్టర్ పూల ఆంథోనీ

హైదరాబాద్‌లో ఆర్చ్ బిషప్ గా ఉన్న డాక్టర్ పూల ఆంటోనీ కార్డినల్ గా నియమితులు అయ్యారు. దళితుడైన ఈయన కార్డినల్ స్థాయిలో నియమితులు కావడం చరిత్రలో ఇదే తొలిసారి. క్రైస్తవ మత గురువు అయిన పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బసిలికాలో పూల ఆంటోనీపై ఎరుపు టోపీ ఉంచి, ఆయన వేలికి ఉంగరం తొడిగి బాధ్యతలు అప్పగించారు.