శ్రీకాంతాచారి వర్ధంతిన తెలంగాణ యూత్​ డిమాండ్స్ డే

శ్రీకాంతాచారి వర్ధంతిన తెలంగాణ యూత్​ డిమాండ్స్ డే

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతిని ‘తెలంగాణ యూత్‌‌ డిమాండ్స్‌‌ డే’గా నిర్వహించుకుందామని టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. డిసెంబర్ 3న హైదరాబాద్‌‌లో వేలాది మంది విద్యార్థి, నిరుద్యోగ యువతతో ఈ కార్యక్రమాన్ని జరుపుకుందామన్నారు. టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో యువజన, విద్యార్థి రాష్ట్ర, జిల్లా ముఖ్య నాయకుల సంయుక్త సమావేశం యువజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు సలీం పాషా అధ్యక్షతన శనివారం జరిగింది.  ఈ సమావేశానికి కోదండరాం హాజరయ్యారు. "అసెంబ్లీ సాక్షిగా ఉద్యోగాల భర్తీ విషయంలో సీఏం కేసీఆర్ అబద్దాలు చెప్పడం సిగ్గుచేటు. 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి 1 లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో మరో 2 లక్షల 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసుకునే అవకాశం ఉంది. అయినా వాటి భర్తీకి సర్కారు నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. కరోనాతో ప్రైవేటు రంగంలో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరికి ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోనందునే నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.” అని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని.. ధైర్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ, ఉపాథి సాధన కోసం దసరా పండుగ తర్వాత జిల్లాల్లో సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.