కాంగ్రెస్‌లో వర్గపోరు.. కోమటిరెడ్డి ఫ్లెక్సీలు కత్తిరింపు

కాంగ్రెస్‌లో వర్గపోరు.. కోమటిరెడ్డి ఫ్లెక్సీలు కత్తిరింపు

మేడ్చల్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరుతో ఉన్న ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు కత్తిరించారు. అదే పార్టీలో మరో వర్గానికి చెందిన నేతలు ఫ్లెక్సీలను, కటౌట్లను బ్లేడ్లతో కత్తిరించి చించివేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేడ్చల్ కొంపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఈ నెల 9, 10 తేదీల్లో జన జాగరణ యాత్ర పేరుతో కాంగ్రెస్ పార్టీ శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రానుండటంతో అతని అనుచరులు పెద్దఎత్తున హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలోనే ఒకరంటే ఒకరికి పడరాని వాళ్లే ఈ పని చేసి ఉంటారని గుసగుసలాడుకుంటున్నారు నేతలు.