రాష్ట్రమంతా ఆగమైనా.. ఎనుముల కుటుంబం బాగుపడ్డది : కేటీఆర్

రాష్ట్రమంతా ఆగమైనా.. ఎనుముల కుటుంబం బాగుపడ్డది : కేటీఆర్
  • కొండల్​ రెడ్డి టెస్సెరాక్ట్​కు రూ.200 కోట్ల విలువైన 5 ఎకరాల భూమిచ్చిన్రు: కేటీఆర్​
  • దీనిపై బీజేపీ ఈడీ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్న
  • బీఆర్ఎస్​ నేతలతో కలిసి టెస్సెరాక్ట్​ భూములను పరిశీలించిన కేటీఆర్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రమంతా ఆగమైనా.. ఒక్క ఎనుముల కుటుంబం మాత్రం భివృద్ధి చెందిందని బీఆర్ఎస్ వర్కింగ్​ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏకంగా ఏరో స్పేస్, డిఫెన్స్ కంపెనీ పెట్టే స్థాయికి వచ్చారని.. ఆ దోపిడీని అసెంబ్లీలో నిలదీస్తామనే సభ నుంచి తమను బయటకు పంపారని మండిపడ్డారు.  కాంగ్రెస్​ ప్రభుత్వం 420 హామీలిచ్చి నెరవేర్చకుండా మోసం చేసిందని తెలిపారు. వెయ్యి రోజులైంది ఏం చేశారని నిలదీస్తే.. అసెంబ్లీలో తమ గొంతు నొక్కి సస్పెండ్ చేశారని ఫైర్ అయ్యారు.

గురువారం ఆయన పార్టీ నేతలతో కలిసి సీఎం రేవంత్​ తమ్ముడు కొండల్​ రెడ్డికి చెందిన టెస్సెరాక్ట్​ కంపెనీకి కేటాయించిన భూములను పరిశీలించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. టెస్సెరాక్ట్​ కంపెనీకి రూ.200 కోట్ల విలువైన 5 ఎకరాల భూమిని కేటాయించారని ఆరోపించారు. కేవలం రూ.లక్ష పెట్టుబడి ఉన్న షెల్​ కంపెనీకి ఇంత విలువైన భూములను ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కంపెనీలో ఒక్క ఉద్యోగి కూడా లేరని ఆరోపించారు. సీఎం దావోస్ వెళ్లి సోదరుని కోసం 18 గంటలు కష్టపడి ఇజ్రాయెల్ ప్రభుత్వ పెద్దలతో చర్చించారని ఎద్దేవా చేశారు.

ఆ కంపెనీకి ఇచ్చిన 5 ఎకరాల భూమి రేవంత్​ జాగీరు కాదన్నారు. ఇజ్రాయెల్ తో ఒప్పందాలను రాహుల్ గాంధీ తప్పుపడుతున్నారని, కానీ, ఇక్కడ రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు ఎవరి ఆదేశాలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారని ప్రశ్నించారు.

ఫ్యూచర్​ సిటీ ఒక మిథ్య

ఎనుముల కుటుంబం అవినీతి వ్యవహారంపై బీజేపీ ఎందుకు స్పందించడం లేదని, ఈడీ విచారణ ఎందుకు చేయించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఇదంతా బీజేపీ, రేవంత్ కలిసి ఆడుతున్న నాటకమన్నారు. మంత్రి పొంగులేటి కూడా డిఫెన్స్, ఏరో స్పేస్ కంపెనీ పెట్టారన్నారు. దోచుకున్నది అంతరిక్షంలో దాచుకునేందుకు ఈ కంపెనీలు పెట్టారని మండిపడ్డారు. ఫ్యూచర్​సిటీ ఒక మిథ్య అని, దానికి ఫ్యూచరే​లేదని చెప్పారు. ఈ దందాను ఇక్కడితో వదిలిపెట్టబోమని, రంగారెడ్డి జిల్లాలో ఊరూరా సదస్సులు పెట్టి వివరిస్తామని చెప్పారు. కోర్టుకు వెళ్లి పోరాడుతామన్నారు.

ప్రజా సమస్యలు ప్రస్తావించేందుకు కేసీఆర్ తమను సభకు పంపారని.. కానీ, అక్కడ ఏం జరిగిందో అందరూ చూశారని కేటీఆర్ అన్నారు. అక్క మీద దాడి జరిగితే ఏ తమ్ముడైనా చూస్తూ ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. సీఎం టీం సృష్టించిన ఫేక్ ఖాతాను అసెంబ్లీలో ప్రస్తావించి సభను తప్పుదోవ పట్టించారన్నారు. ఆ ఖాతా ఎవరిదో.. ఆ అంతర్జాతీయ కార్యదర్శి ఎవరో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.