బస్సుల కొనుగోళ్లపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన ఎల్జీ సక్సేనా

బస్సుల కొనుగోళ్లపై సీబీఐ దర్యాప్తునకు 	ఆదేశించిన ఎల్జీ సక్సేనా

న్యూఢిల్లీ: లిక్కర్ స్కాంలో సీబీఐ దర్యాప్తుతో ఇబ్బందుల్లో పడ్డ ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సర్కార్ కు మరో షాక్ తగిలింది. ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ) బస్సుల కొనుగోలుకు టెండర్లు పిలిచిన  వ్యవహారంలోనూ అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు రావడంతో దీనిపై కూడా సీబీఐ దర్యాప్తు చేయాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనా ఆదేశించారు. బిడ్ లో పాల్గొనేందుకు అర్హత లేని కంపెనీలు ఇందులో పాల్గొన్నాయని, ఆ తర్వాత వాటికి లబ్ధి కలిగేలా చేసేందుకు ప్రయత్నించారని ప్రతిపక్ష బీజేపీ ఆరోపించింది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తును స్వాగతించింది. అయితే, బస్సుల కొనుగోలుపై సీబీఐ దర్యాప్తు వెనక రాజకీయ కారణం ఉందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సర్కార్ ఖండించింది. 

ఇదీ కేసు.. 
డీటీసీకి వెయ్యి లో ఫ్లోర్ బీఎస్4, బీఎస్6 బస్సుల కొనుగోలు కోసం 2019 జులైలో బిడ్లు ఆహ్వానించారు. ఆ తర్వాత 2020 మార్చిలో ఈ బస్సుల నిర్వహణ కోసం మరోసారి బిడ్లు పిలిచారు. ఈ రెండు వ్యవహారాల్లోనూ అక్రమాలు జరిగాయని ఈ ఏడాది జూన్​లో ఎల్జీకి ఫిర్యాదు అందింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ జులై 22న ఢిల్లీ చీఫ్​సెక్రటరీకి ఎల్జీ ఫిర్యాదును ఫార్వర్డ్ చేశారు. దీనిపై చీఫ్ సెక్రటరీ నివేదిక ఇచ్చారు. టెండర్ ప్రాసెస్​లో అక్రమాలు జరిగాయని, సీవీసీ, జనరల్ రూల్స్ ను ఉల్లంఘించారని నివేదికలో తెలిపారు. అయితే, అక్రమాలకు పాల్పడాలన్న ఉద్దేశంతోనే టెండర్ ప్రాసెస్​ను నిర్ణయించే కమిటీకి ట్రాన్స్​పోర్ట్ మినిస్టర్​ను చైర్మన్​గా నియమించారని, దీనిపై విచారణ చేయించాలంటూ ఇదివరకే వచ్చిన ఓ ఫిర్యాదుపై సీబీఐ విచారిస్తోంది. టెండర్ ప్రాసెస్​లో అక్రమాలు జరిగాయని సీఎస్ కూడా నివేదిక ఇవ్వడంతో రెండు కంప్లయింట్లపైనా సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఎల్జీ ఆదేశించారని అధికారులు వెల్లడించారు.  

ఢిల్లీకి బాగా చదువుకున్న ఎల్జీ కావాలి: ఆప్ 
‘‘టెండర్లు రద్దు అయ్యాయి. అసలు బస్సులనే కొనుగోలు చేయలేదు. ఢిల్లీకి బాగా చదువుకున్న ఎల్జీ అవసరం. ఎల్జీ దేనిపై సంతకం చేస్తున్నారో ఆయనకే తెలియదు. స్వయంగా ఆయనే అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాటి నుంచి డైవర్ట్ చేసేందుకే ఇలా ఎంక్వైరీలకు ఆదేశిస్తున్నారు” అని ఆప్ విమర్శించింది.