సిలిండర్లు స్టాక్ లేవని అంటించిన గ్యాస్ ఏజెన్సీ.. హైదరాబాద్లో ఈ పరిస్థితి ఎందుకు ఉందంటే..

సిలిండర్లు స్టాక్ లేవని అంటించిన గ్యాస్ ఏజెన్సీ.. హైదరాబాద్లో ఈ పరిస్థితి ఎందుకు ఉందంటే..

హైదరాబాద్: ఎల్పీజీ గ్యాస్ కొరత ఉందని దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రచారంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గ్యాస్ ఏజెన్సీల దగ్గర జనం బారులు తీరుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆన్ లైన్ బుకింగ్ కావడం లేదని కస్టమర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల నుంచి బుకింగ్ చేస్తున్నా బుకింగ్ కాక ఉదయం నుంచి లైన్లో నిలబతున్నామని కస్టమర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి అవసరాలకు సంబంధించిన గ్యాస్ కొరత లేదని గ్యాస్ ఏజెన్సీలు చెబుతున్నా పబ్లిక్ పట్టించుకోవడం లేదు.

గ్యాస్ దొరుకుతుందో.. లేదోననే భయంతో గ్యాస్ ఏజెన్సీల దగ్గరకు నేరుగా వెళుతున్నారు. ఇంటికంటూ వెళితే ఫుల్ సిలిండర్తోనే అని పట్టుబట్టి గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరుతున్న పరిస్థితి ఉంది. కమర్షియల్ సిలిండర్ల కొరత మాత్రమే ఉందని డొమెస్టిక్ సిలిండర్ల కొరత లేదని ఏజెన్సీలు చెబుతున్నా వినియోగదారులు వినిపించుకోవడం లేదు. ఇప్పటికిప్పుడు గ్యాస్ అవసరం లేని వాళ్లు కూడా ముందు ముందు అసలు గ్యాస్ దొరకదనే భయంతో గ్యాస్ బుక్ చేసుకుంటుండటంతో డొమెస్టిక్ సిలిండర్లకు కొరత ఏర్పడుతున్న పరిస్థితులున్నాయి.

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో ఎల్పీజీ గ్యాస్ గుబులు రోజురోజుకూ పెరుగుతోంది. ముందు జాగ్రత్త చర్యగా రీఫిల్ బుక్ చేసుకునేందుకు వినియోగదారులు మొబైల్ యాప్స్, వెబ్ సైట్లు, వాట్సాప్ చానెళ్లలో ప్రయత్నిస్తుండగా బుకింగ్స్ ఏకంగా మూడు రెట్లకు చేరడంతో దేశవ్యాప్తంగా ఎల్పీజీ బుకింగ్ సిస్టమ్స్ క్రాష్​అయిపోయాయి. దీంతో వినియోగదారులు ఎలాగైనా రీఫిల్ అందుకునేందుకు పలు నగరాల్లో ఏజెన్సీలకు పరుగులు పెట్టారు. భారీ సంఖ్యలో క్యూలో నిల్చుని సిలిండర్ తీసుకునిపోతున్నారు. గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడడంతో పలు సిటీల్లో పెండ్లిండ్లు, శుభకార్యాలకు ఇబ్బందులు కలుగుతున్నాయి.