V6 News

ఇండ్ల స్థలాల కోసం 18న మహాధర్నా

ఇండ్ల స్థలాల కోసం 18న మహాధర్నా
  • ప్రకటించిన డబ్ల్యూజేఎఫ్ ​రాష్ట్ర కమిటీ

ఖైరతాబాద్, వెలుగు: జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం ఈ నెల 18న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్‌) రాష్ట్ర కమిటీ తెలిపింది. ఆదివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ధర్నాకు సంబంధించిన పాంప్లెంట్​ను ఫెడరేషన్ సభ్యులు ఆవిష్కరించారు. అనంతరం ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య, ఉపాధ్యక్షుడు రఘు మాట్లాడుతూ.. 35 ఏండ్లుగా జర్నలిస్టులు ఇంటి స్థలాల కోసం పోరాటం చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందన్నారు.

హైదరాబాద్ సిటీలో దాదాపు 5 వేల మంది జర్నలిస్టులు ఉన్నారని, వారందరూ ఇంటి రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. గ్రేటర్‌‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60 వేల మంది జర్నలిస్టులు ఉన్నారని, వారందరికీ ఇండ్ల స్థలాలు కేటాయించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాలతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికే ఈ నెల 18న మహా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి జర్నలిస్టులు తరలివచ్చి ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు విజయానంద్, పద్మరాజు, కళ్యాణ్ చక్రవర్తి, హెచ్‌యూ జే ప్రధాన కార్యదర్శి జగదీశ్, రేనయ్య తదితరులు పాల్గొన్నారు.