V6 News

భారతదేశం భగభగ మండుతోంది : ప్రపంచంలోనే అత్యంత ఎండ ఇక్కడే..!

భారతదేశం భగభగ మండుతోంది : ప్రపంచంలోనే అత్యంత ఎండ ఇక్కడే..!

ఎండాకాలంలో సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఆకాశం అగ్నిగోళంలా మారింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేడి ప్రాంతాల జాబితా తీస్తే.. అందులో మొదటి 20 స్థానాల్లో 19 మన దేశానివే కావటం గమనార్హం. కేవలం నేపాల్‌లోని లుంబినీ మినహా, మిగిలిన టాప్ ర్యాంకులన్నీ భారత్‌కే దక్కాయి. దీంతో జనం కూడా ఎండల నుంచి ఎలా గట్టెక్కాలా అని ఆందోళన చెందుతున్నారు. 

బీహార్‌లోని భాగల్పూర్, ఒడిశాలోని తాల్చేర్, పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ నగరాలు 44 డిగ్రీల ఉష్ణోగ్రతతో ప్రపంచంలోనే అత్యంత వేడి నగరాలుగా రికార్డు సృష్టించాయి. ఇక బీహార్‌లోని బెగుసరాయ్, మోతీహరి, ముంగేర్ వంటి ప్రాంతాలు కూడా 43 డిగ్రీల వేడిలో మండుతున్నాయి. ఉత్తరప్రదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు తూర్పు భారతం అంతా ఇప్పుడు ఒక పెద్ద ఓవెన్ మాదిరిగా మారిపోయింది.

ఎందుకీ విలయం?
ఈ పరిస్థితికి ప్రధాన కారణం తీవ్రమైన సౌర వేడి అంటున్నారు వాతావరణ శాస్త్రవేత్తలు. ఆకాశం మేఘాలు లేకుండా నిర్మలంగా ఉండటంతో సూర్యరశ్మి నేరుగా భూమిని తాకుతోంది. హిమాలయాల్లో మంచు తక్కువగా ఉండటం వల్ల సూర్యకిరణాలు వెనక్కి వెళ్లకుండా భూమి పీల్చుకుంటోంది. పసిఫిక్ మహాసముద్రంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు కూడా వేడి గాలులను పెంచుతున్నాయని వారు చెబుతున్నారు.

ALSO READ : మెట్రోను 5 గంటల నుంచే నడపండి..

రాబోయే రోజులు ఎలా ఉంటాయి?
రానున్న కొన్ని రోజుల పాటు ఈ వేడి గాలుల తీవ్రత ఇలాగే కొనసాగనుందని భారత వాతావరణ శాఖ ప్రజలందరినీ హెచ్చరిస్తోంది. సాధారణంగా 40 డిగ్రీలు వేడి దాటితేనే వడగాల్పులుగా పరిగణిస్తారు. కానీ ఇప్పుడు చాలా చోట్ల అది 43 డిగ్రీలు దాటిపోతోంది. వాయువ్య దిశ నుంచి వచ్చే పొడి గాలులు పరిస్థితిని మరింత దారుణంగా మారుస్తున్నాయి.

దక్షిణ భారతంతో పాటుగా ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడక్కడా వర్షాలు పడుతున్నా.. దేశంలోని మెజారిటీ ప్రాంతాలు మాత్రం నిప్పుల కొలిమిలోనే కొనసాగుతున్నాయి. పర్యావరణ మార్పులు ఎంత వేగంగా మన జీవితాలను దెబ్బతీస్తున్నాయో చెప్పడానికి ఈ అసాధారణ ఉష్ణోగ్రతలే నిదర్శనం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏప్రిల్ నెలలోనే ఇలా ఉంటే.. మే నెల ఇంకెంత మంట పుట్టిస్తుందోనని జనం హడలిపోతున్నారు.