టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ ఆర్థికంగా, సైనికంగా అన్ని రకాలు తీవ్రంగా నష్టపోయింది. అమెరికాతో కొనసాగుతోన్న సుదీర్ఘ యుద్ధం కారణంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. తమ దేశ ఆదాయంలో సింహాభాగమైన చమురు ఉత్పత్తి, రవాణాను అమెరికా అడ్డుకోవడంతో ఆ దేశ ఎకానమీ అల్లకల్లోలంగా మారింది. ఈ తరుణంలో దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు ఇరాన్ మనీ గేమ్ ఆడాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ కొత్త వ్యూహాం తెరపైకి తెచ్చింది.
అదే.. షిప్పింగ్ టోల్. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటిదైనా గల్ఫ్ తీరంలోని హార్మూజ్ జలసంధి గుండా రాకపోకలు సాగించే వాణిజ్య నౌకలపై షిప్పింగ్ టోల్ వసూల్ చేయాలని ఇరాన్ భావిస్తోంది. ఈ మేరకు ఒమన్‌తో ఇరాన్ చర్చలు జరుపుతున్నట్లు ఇంటర్నేషనల్ మీడియా పేర్కొంది. ఈ ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం.. హార్మూజ్ జలసంధి గుండా రాకపోకలు సాగించే వాణిజ్య నౌకల్లోని సరుకు విలువలో 7 శాతం సుంకాం వసూల్ చేయాలని ఇరాన్ భావిస్తోంది.
అయితే, ఒమన్ మాత్రం 7 శాతం కాకుండా 3 పర్సెంట్ ట్యాక్స్ ప్రతిపాదించినట్లు సమాచారం. ఇరాన్ ప్రతిపాదనల ప్రకారం.. వాణిజ్య నౌకల్లోని సరుకు విలువలో 7 శాతం సుంకం విధిస్తే సాధారంగా హార్మూజ్‌లో ఉండే రద్దీ ఆధారంగా ఇరాన్‌కు ప్రతిరోజూ సుమారు 385 మిలియన్ డాలర్ల ఆదాయం.. ఏడాదికి 100 బిలియన్ డాలర్లకు పైగా నికర ఆదాయం సమకూరుతుందని అంచనా. హార్మూజ్‌లో టోల్ నిర్వహణకు పెద్దగా ఖర్చులు ఉండవు కాబట్టి వచ్చే ఆదాయంలో 97 శాతం లాభమే అంటున్నారు నిపుణులు. అయితే, ఈ ఒప్పందం ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు.
షిప్పింగ్ టోల్‌కు అమెరికా నో:
ఇరాన్ ప్రతిపాదిస్తోన్న హార్మూజ్ జలసంధిలో షిప్పింగ్ టోల్‌ను అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అంతర్జాతీయ జలమార్గాలపై పన్నులు విధించే హక్కు ఏ దేశానికీ లేదని తేల్చి చెబుతోంది. ప్రపంచ చమురు రవాణాకు కీలకమై హోర్ముజ్‌లో టోల్ విధానాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని అమెరికా స్పష్టం చేసింది. దీంతో అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి ఈ ప్రతిపాదన ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం ఉంది.
హార్మూజ్‌లో తగ్గిన నౌకల రద్దీ:
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం మొదలుకాక ముందు అంతర్జాతీయ నౌకయానానికి హార్మూజ్ జలసంధిలో ఫ్రీ యాక్సెస్ ఉండేది. అమెరికాతో యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ తన ప్రాంతీయ సార్వభౌమత్వాన్ని చాటుకోవడానికి హార్మూజ్ జలసంధిలో షిప్పింగ్ టోల్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. అమెరికా-ఇరాన్ మొదలైన నాటినుంచి హార్మూజ్ జలసంధిలో నౌకయానానికి తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి.
ఈ జలసంధి గుండా ప్రయాణించే సమయంలో నౌకలపై దాడులు జరుగుతుండటంతో చమురు రవాణా భారీగా తగ్గిపోయింది. ఆగస్టు 4 నాటికి హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల సంఖ్య కేవలం ఎనిమిది శాతానికి పడిపోయింది. హార్మూజ్‌కు ప్రత్యామ్నాయంగా నౌకలు బాబ్ ఎల్-మండేబ్తో పాటు ఇతర మార్గాలను ఎంచుకుంటున్నాయి.
