Cooper Connolly: ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టుకి బిగ్ షాక్ తగిలింది. అద్భుత ఫామ్‌లో ఉన్న యువ ఆటగాడు కూపర్ కొన్నోలీ హఠాత్తుగా ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు వస్తున్న వార్తలు అభిమానుల్లో సందిగ్ధతకు గురి చేస్తున్నాయి. అతను పెర్త్‌లోని 'నార్త్ బీచ్' ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కొన్నోలీ వెన్నుముక్క గాయం (Back Injury)తో వెనక్కి వెళ్లడానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది.
ఐపీఎల్ ప్రారంభానికి ముందే గాయపడిన కూపర్, ప్రస్తుతం కేవలం బ్యాటర్‌గా మాత్రమే ఆడుతున్నాడు.. బౌలింగ్ చేయడానికి క్రికెట్ ఆస్ట్రేలియా (CA) నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ తీసుకునేందుకు అతను స్వదేశానికి వెళ్లినట్లు తెలుస్తోంది. పంజాబ్ కింగ్స్ తదుపరి మ్యాచ్ ఏప్రిల్ 25న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనుంది. ఆ లోపు అతను ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తి చేసుకుని జట్టుతో చేరుతారా లేదా అన్నది వేచి చూడాలి. కాగా ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటంలో కొన్నోలీ కీలక పాత్ర పోషించారు.
Also Read : ఇప్పుడైనా ఇంటికి వెళ్లనివ్వు
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో (ఏప్రిల్ 19) కొన్నోలీ కేవలం 46 బంతుల్లో 87 పరుగులు చేసి పంజాబ్ భారీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు ఆడిన 5 ఇన్నింగ్స్‌ల్లో 223 పరుగులు చేశారు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ సుమారు 164గా ఉంది. ప్రియాన్ష్ ఆర్యతో కలిసి రెండో వికెట్‌కు 182 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో అజేయంగా కొనసాగుతోంది (ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది). అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో రాణిస్తుండగా.. బ్యాటింగ్ విభాగంలో కొన్నోలీ, ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఒకవేళ కూపర్ కొన్నోలీ ఫిట్‌నెస్ క్లియరెన్స్ పొంది బౌలింగ్ కూడా చేస్తే, పంజాబ్ కింగ్స్ మరింత పటిష్టంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

